బిహార్లో లాలూ ఫ్యామిలీ ప్యాక్

మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నిత్యం కుటుంబాన్ని పక్కన పెట్టుకుని తిరుగుతుంటారు. కుటుంబ పాలనకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తుంటారు. తన కుటుంబ సభ్యులకు అవకాశాలు వచ్చిన తర్వాతే ఇతరులకు మిగిలిన స్థానాలు కేటాయిస్తుంటారు. ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ నిన్న మొన్నటి దాకా బిహార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. లాలూ కుటుంబం పేరాశ వల్లే సీఎం నితీశ్ కుమార్ రెండు పర్యాయాలు వారికి దూరమయ్యారు. ఈ సారి కూడా లాలూ ప్రసాద్ తన ఫ్యామిలీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు.

లోక్ సభకు ఇద్దరు కుమార్తెలు పోటీ…

ఎన్నికలు వచ్చాయంటే లాలూ కుటుంబం ఎక్కడ నుంచి పోటీ చేస్తోందీ..ఎవరెవరు ఎక్కడ నుంచి బరిలో ఉన్నారు..లాంటి ప్రశ్నలు తలెత్తుంటారు. బిహార్లో అదో చర్చనీయాంశమవుతుంది. ఈసారి లోక్ సభ ఎన్నికలకు 22 మంది అభ్యర్థులతో ఆర్జేడీ జాబితా విడుదలైంది. అందులో లాలూ ఇద్దరు కుమార్తెల పేర్లు ఉన్నాయి. మీసా భారతీ ఇప్పుడు పాటలీపుత్ర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మరో కూతురు రోహిణి ఆచార్య కూడా బరిలోకి దిగుతూ శరణ్ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయబోతున్నారు.

మాజీ కేంద్రమంత్రిపై పోటీ…

రోహిణి ఆచార్య లాలూ రెండో కూతురు. సోనేపూర్లోని హరినాథ్ దేవాలయాన్ని సందర్శించిన తర్వాత ఆమె తన అభ్యర్థిత్వాన్ని స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఆ ఆలయం ఆమె పోటీ చేయబోయే శరణ్ నియోజకవర్గం పరిధిలోనే వస్తుంది. మే 20న అక్కడ పోలింగ్ జరుగుతోంది. బీజేపీ అభ్యర్థి అయిన రాజీవ్ ప్రతాప్ రూడీపై ఆమె పోటీ పడుతున్నారు. మాజీ కేంద్ర మంత్రి అయిన రూడీ నాలుగు పర్యాయాలుగా శరణ్ నియోజకర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రజల మనిషిగా ఆయనకు మంచి పేరు ఉంది. రోహిణి, సింగపూర్లో వైద్యురాలిగా పనిచేసేవారు. గతంలో తన తండ్రికి కిడ్నీదానం చేసి ఆమె వార్తల్లో నిలిచారు. రోహిణి రాజకీయాలకు కొత్త అయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఇటీవల మహాకూటమి విడిపోవడానికి రోహిణా కారణమని చెబుతారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ను విమర్శిస్తూ ఆమె ఎక్స్ లో పెట్టిన పోస్ట్ తో కోపం వచ్చిన సీఎం.. తన ప్రభుత్వం నుంచి ఆర్జేడీని వెళ్లగొట్టారు.

లాలూ కుటుంబంలో ఆరుగురు…

తూర్పు రాష్ట్రాల్లో వారసత్వ రాజకీయాలంటే లాలూ కుటుంబమే గుర్తుకు వస్తుంది.ఆ కుటుంబం నుంచి మొత్తం ఆరుగురు రాజకీయాల్లో ఉన్నారు. లాలూ, ఆయన భార్య రబ్రీ దేవీ ముఖ్యమంత్రులుగా చేశారు. లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్..రాష్ట్రంలో మంత్రులుగా పనిచేసిన వాళ్లే. మీసా భారతి మూడు పర్యాయాలు పాటలీపుత్ర నియోజకవర్గంలో గెలిచారు. ఇప్పుడు రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్నా లాలూ కుటుంబ ఆరో సభ్యురాలిగా రోహిణి రికార్డు సృష్టించారు. అలాగని రాజకీయాల్లో ఏమైనా వెలగబెట్టారా అంటే ఏమీ లేదనే చెప్పాలి.