ఖర్గే పరపతి వర్సెస్ బీజేపీ అభివృద్ధి

కర్ణాటకలోని అత్యంత కీలక నియోజకవర్గాల్లో అది కూడా ఒకటి. అక్కడి ఫలితం ఎలా ఉంటుందోనని దేశం మొత్తం ఎదురుచూస్తోంది. అదే కలబురగి లోక్ సభా నియోజకవర్గం. దాన్ని గతంలో గుల్బర్గా అని పిలిచేవారు. తెలంగాణకు దగ్గరగా ఉండే ఆ నియోజకవర్గంపై మరోసారి బీజేపీ కన్నేసింది. ఎస్సీ నియోజకవర్గమైన కలబురగిలో ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. అఫ్జల్పూర్, జేవార్గీ, గుర్మిట్కల్, చిత్తాపూర్ (ఎస్సీ), సేదం, గుల్బర్గా రూరల్ (ఎస్సీ) గుల్బర్గా దక్షిణ్, గుల్లర్గా ఉత్తర నియోజకవర్గాలు ఆ లోక్ సభ పరిధిలోకి వస్తాయి…

నిన్నటి దాకా కాంగ్రెస్ కంచుకోట…

దశాబ్దాల పాటు కలబురగి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉండేది. గత 17 ఎన్నికల్లో 14 సార్లు కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచింది. పార్టీకి క్షేత్రస్థాయిలో బలముండేది. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీకి పట్టుండేది. ఓటర్లు కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసంగా ఉండేవారు. అలాంటి పార్టీ 2019లో ఖంగుతిన్నది. ప్రస్తుతం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే 2019లో అక్కడ ఓడిపోవడంతో బీజేపీకి గేట్లు తెరిచినట్లయ్యింది…

బరిలో ఖర్గే అల్లుడు..

ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడైన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. పోటీకి ఖర్గే విముఖత వ్యక్తం చేయడంతో ఆయన అల్లుడు రాధాకృష్ణ దొడ్డమానికి, కాంగ్రెస్ పార్టీకి టికెట్ ఇచ్చింది. అల్లుడి కోసం ఖర్గే ఒకటికి పది సార్లు వచ్చి వెళ్తున్నారు. స్థానికుడినైనప్పటికీ తన కుటుంబానికి ఓటెయ్యకపోయినా తను చనిపోయినప్పుడు శవయాత్రకు రావాలని కోరుతూ ఖర్గే ఇటీవల కలబురగిలో ఉద్వేగ భరిత ప్రసంగం చేశారు. ఐనా ఉద్వేగాలకు జనం ఓటెయ్యరు కాదు. తమ కోసం ఏం చేశారో చెప్పి విశ్వాసం కలిగిస్తే మాత్రమే ఓటేస్తారు…

బీజేపీలో యమ జోష్..

2019లో మల్లికార్జున్ ఖర్గేను బీజేపీ అభ్యర్థి ఉమేష్ జీ. జాధవ్ ఓడించారు. ఈ సారి కూడా బీజేపీ ఆయనకే టికెట్ ఇచ్చి కాంగ్రెస్ ను ఓడించే బాధ్యత మరోసారి అప్పగించింది. ఓటర్లు బీజేపీకి కనెక్ట్ కావడంలో ఉమేష్ జాధవ్ ప్రత్యేక పాత్ర పోషించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారని జాధవ్ ను జనం ప్రశంసిస్తున్నారు. అగ్రకులాలు, దళితుల మధ్య సంఘర్షణను బాగా తగ్గించి వేసేందుకు జాధవ్ కృషి చేశారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచేందుకు తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారు. నియోజకవర్గంలో 15 శాతం ఉన్న కోలి సమాజ్ ను ఎస్టీల్లో చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని బీజేపీ చెబుతోంది. కోలి సమాజానికి అక్కడ 3 లక్షల ఓట్లున్నాయి. గణనీయంగా ఉన్న ముస్లిం ఓట్లు తమకే పడతాయని కాంగ్రెస్ ఎదురుచూస్తుండగా, మెజార్టీ ముస్లింలు మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. ఈ సారి బీజేపీకి ఓటేస్తామని చెబుతున్నారు.ఇక మత పరమైన కార్యక్రమాలు, ఊరేగింపులకు సంబంధించి గతంలో వివాదాలు చెలరేగినా ఇప్పుడవి సమసిపోయాయి.రేపు కలబురగిలో పోలింగ్ జరుగుతుంది….