వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా విజయం సాధిస్తుందని తాను ప్రధాని అవుతానని… కేసీఆర్ చెబుతున్నారు. మరో వైపు ఆయన పార్టీకి తెలంగాణలో తప్ప ఎక్కడా రాష్ట్ర హోదా లేకుండా ఈసీ తీసేసింది. అయినా ఆయన మాత్రం ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. మరో వైపు ఆయన ప్రధాని అయితే తానే సీఎం అని భారత రాష్ట్ర సమితిలో కీలక నేతలు ఊహల్లో తేలిపోతున్నారు. నిజానికి ఇప్పటికే కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం అనే సంగతి క్లారిటీ వచ్చింది. ఆయనను సీఎం చేస్తారంటూ తరచూ ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు హరీష్ రావు పేరునూ మెల్లగా తెరపైకి తీసుకు వస్తున్నారు. కేసీఆర్ పీఎం హరీష్ రావు సీఎం అనే నినాదం పెరుగుతూండటంతో ఆ పార్టీలో అంతర్గత కలహాలు కొత్త రూపు సంతరించుకున్నాయన్న వాదన వినిపిస్తోంది.
హరీష్ కాబోయే సీఎం అని జోస్యం
సాధారణంగా మంత్రులు పాల్గొనే కార్యక్రమాల్లో స్పీచులు అన్నీ పక్కాగా స్క్రిప్టెడ్. చిన్న పిల్లలతో మాట్లాడించాలంటే ముందుగా చాలా సార్లు ప్రాక్టీస్ చేయిస్తారు . ఇలా హరీష్ రావు పాల్గొన్న ఓ కార్యక్రమంలో సోది చెప్పే మహిళ వేషం లో వచ్చిన ఓ పాప.. హరీష్ రావును కాబోయే సీఎంగా చెప్పింది. కేసీఆర్ ప్రధాని అవుతారని.. హరీష్ సీఎం అవుతారని జోస్యం చెప్పింది. అందరూ నవ్వుకున్నారు కానీ.. బీఆర్ఎస్ లో మాత్రం దీనిపై విస్తృత చర్చ జరుగుతోంది. ఉద్దేశపూర్వకంగానే ఇలా హరీష్ రావు చెప్పించుకున్నారని అనుమానిస్తున్నారు. దీని వెనుక పెద్ద ప్లాన్ ఉందన్న చర్చ కూడా నడుస్తోంది.
ఇటీవల హరీష్ రావు తెలంగాణ సెంటిమెంట్ రాజకీయాలు
టీఆర్ఎస్ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చిన తర్వాత హరీష్ రావు సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారు. సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకు ఏపీ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అక్కడి వారూ స్పందిస్తున్నారు. దీంతో ఏదో మతలబు ఉందన్న అభిప్రాయం బలపడుతోంది. దానికి తోడు ఇప్పుడు హరీష్ రావు సీఎం అనే నినాదానికి కొద్ది కొద్దిగా బలం పెంచుకుంటూపోతున్నారు. హరీష్ రావు రాజకీయాల గురించి తెలిసిన వారు.. ఏదో పెద్ద ప్రణాళికే ఉందన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హరీష్ రావు మాత్రం గుంభనంగా వ్యవహరిస్తున్నారు. ఇదంతా యాధృచ్చికంగా జరుగుతుందన్నట్లుగా ఉంటున్నారు. కానీ ఏదో ఉందని బీఆర్ఎస్ వర్గాలు అనుమానిస్తున్నాయి.
అప్పట్లో హరీషే నెంబర్ 2 – మళ్లీ పంజా విసురుతారా ?
కేటీఆర్ .. రాజకీయంగా యాక్టివ్ కాక ముందు అయిన తర్వాత కూడా హరీషే నెంబర్ టు. తెలంగాణ వచ్చిన తర్వాత హరీష్ రావుకు క్రమంగా ప్రాధాన్యత తగ్గించారు. రెండో సారి గెలిచిన తర్వాత పూర్తిగా పక్కన పెట్టారు. అయితే తర్వాతకేసీఆర్ మనసు మార్చుకుని మంత్రి పదవి ఇచ్చారు. ఈటల రాజేందర్ ను బయటకు పంపిన తర్వాత కాస్త ప్రాధాన్యం పెంచారు. కానీ హరీష్ సమయం కోసం చూస్తున్నారని అంటున్నారు. పార్టీపై ఆయనకు మంచి పట్టు ఉందని… సరైన సమయంలో ఆయన రాజకీయం ఉంటుందన్న చర్చ కూడా నడుస్తోంది. ఇప్పుడు హరీష్ సీఎం నినాదం రావడంతో ముందు ముందు బీఆర్ఎస్ రాజకీయాలు మరింత జోరుగా ఉంటాయన్న చర్చ జరుగుతోంది