మండీలో కంగనా మేనియా…

హిమాచల్ ప్రదేశ్లోని మండీ లోక్ సభా నియోజకవర్గం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బాలీవుడ్ రెబెల్ లేడీ స్టార్ కంగనా రనౌత్ అక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడమే ఇందుకు కారణమని చెప్పాలి. బీజేపీ జాబితాలో కంగన పేరు కనిపించినప్పటి నుంచి హిమాచల్ ప్రదేశ్ అంతటా ఇప్పుడు అదే చర్చ జరుగుతోంది. బీజేపీ కార్యకర్తల్లోనే కాకుండా సామాన్య ప్రజల్లోనూ అదే ఉత్సాహం ఉరకలేస్తోంది. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా..కంగనకు ఎప్పుడు ఓటెయ్యాలా అని జనం ఎదురు చూస్తున్నట్లుగా అనిపిస్తోంది..

రోడ్ షోలతో కంగన బిజీ…

బీజేపీ అభ్యర్థిగా తన పేరును ప్రకటించినప్పటి నుంచి కంగనా రనౌత్ స్వరాష్ట్రానికి వచ్చి బిజీగా గడుపుతున్నారు. మండీ నియోజకవర్గంలో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. తను ప్రధాని మోదీ అభిమానిని అని ప్రతీ ఒక్కరినీ పిలిచి చెబుతున్నారు. ఆమెను చూసేందుకు జనం తండోపదండాలుగా వస్తున్నారు. ఆమె స్పీచులకు ఫ్యాన్స్ అయిపోతున్నారు. ఇంతలోనే అంత మంచి స్పీకర్ అయిపోయారని ప్రశంసించే వాళ్లూ ఉన్నారు… పైగా కంగన పట్ల కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా ష్రినాటే చేసిన వ్యాఖ్యలు మండీ జనానికి కోపం తెప్పించాయి. ఒక ఆడబిడ్డ ఒంటరిగా పోరాడుతుంటే ఏమిటీ అసభ్య ప్రేలాపన అని జనం ప్రశ్నిస్తున్నారు…

కాంగ్రెస్ కోటను లాగేసుకునే ప్రయత్నం….

నిజానికి మండీ నియోజకవర్గం చాలా కాలం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. అందులోని 17 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ హస్తం పార్టీ హవా నడిచేది. మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ తొమ్మిది సార్లు మండీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2014…2019లో బీజేపీ అభ్యర్థి రామ్ స్వరూప్ శర్మ గెలిచారు. ఇటీవలే ఆయన చనిపోవడంతో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రతిభా సింగ్ గెలిచారు. ప్రస్తుతం ఆమె పీసీసీ అధ్యక్షురాలిగా కూడా ఉన్నారు. బీజేపీ తరపున కంగన రంగంలోకి దిగుతున్నారని తెలియగానే ప్రతిభ పోటీ నుంచి తప్పుకున్నారు. వేరే అభ్యర్థిని వెదుక్కోవాలని కాంగ్రెస్ అధిష్టానానికి ఆమె వర్తమానం పంపారు. కంగనను ఓడించడం తన వల్ల కాదన్నట్లుగా ఆమె సందేశమిచ్చారు….

స్థానికురాలైన కంగన…

మండీ జిల్లాలోని భాంబ్లా…కంగనాకు సొంతూరు. ఆమెకు మనాలీలో కూడా ఒక ఇల్లు ఉంది. ఆ ప్రాంతం మండీ లోక్ సభా స్థానం పరిధిలోకి వస్తుంది. వీరభద్ర సింగ్ అయినా, ప్రతిభా సింగ్ అయినా బయట నుంచి వచ్చిన వారే కావడం విశేషం. ఇటీవల అనర్హతకు గురైన ఆరుగురు ఎమ్మెల్యేల్లో కొందరు మండీ లోక్ సభా నియోజకవర్గం ప్రాంతం వారే. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత పోరు కూడా కంగనకు కలిసొచ్చే అంశంగా చెప్పుకోవాలి. కంగనకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని స్థానిక బీజేపీ నేతలు ప్రకటించడం కూడా కలిసొచ్చే అంశంగా చెప్పుకోవాలి..పైగా బీజేపీలో తాను సాధారణ కార్యకర్తనని కంగన చెప్పుకుంటున్నారు. ఆమె ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్న మండీ నిండా గుళ్లు ఉండటంతో ఆ ప్రాంతాన్ని ఛోట కాశీ అని కూడా పిలుస్తారు. కంగన కూడా శివుడి భక్తురాలే….శివభక్తే తనను గెలిపిస్తుందని ఆమె నమ్మకం…