టిక్కెట్ల కసరత్తులో కనిపించని చంద్రబాబు చాణక్యం – ఎప్పుడూ లేనంత అసంతృప్తి ఎందుకు ?

టిడిపి తుది జాబితా విడుదల చేసింది. దీంతో పలు చోట్ల అసమ్మతి రగులుకుంది. పెద్దఎత్తున నిరసనలు చోటుచేసుకున్నాయి. అనంతపురం అర్భన్‌ టిక్కెట్‌ను దగ్గుబాటి ప్రసాద్‌కు కేటాయించడంతో టిడిపి మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి గ్రూపునకు చెందిన వారు తీవ్రస్థాయిలో నిరసనలకు దిగారు. చంద్రబాబు , లోకేష్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ కార్యాలయంలో ఫర్నీచర్‌ను పగుల గొట్టారు. కరపత్రాలను తగులబెట్టారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

కొత్తగా వచ్చిన వారికి చాన్స్ – పాత వారికి మొండిచేయి

గుంతకల్లు టిక్కెట్‌ను మంత్రి గుమ్మనూరు జయరామ్‌కు కేటాయించడంతో అక్కడ జితేందర్‌గౌడ్‌ అనుచరులు కూడా నిరసన వ్యక్తం చేశారు. నెల్లిమర్ల అసెంబ్లీ స్థానం టికెట్‌ ఆశించి భంగపడ్డ కర్రోతు బంగార్రాజు ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. కూటమి పొత్తులో భాగంగా ఆ సీటు జనసేనకు కేటాయించడంతో భీమిలి సీటు లేదా విజయనగరం పార్లమెంట్‌ సీటు వస్తుందని ఆశించిన ఆయనకు నిరాశే ఎదురైంది. దీంతో శుక్రవారం ఆయన తన అనుచరులతో సమావేశమ్యారు. నియోజకవర్గంలో పర్యటించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చీపురుపల్లి అసెంబ్లీ టికెట్‌ ఇవ్వకపోవడంతో టిడిపి విజయనగరం
చీపురుపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదవికి రాజీనామా చేస్తున్నట్లు కిమిడి నాగార్జున ప్రకటించారు. కళా వెంకటరావుకు టిక్కెట్‌ ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆయన అనుచరులు ర్యాలీ నిర్వహించారు.

కూటమికి సీట్లిచ్చిన చోట కూడా సర్ది చెప్పలేని పరిస్థితి

అనపర్తిలోనూ ఇదే స్థితి. ఈ నియోజకవర్గాన్ని బిజెపికి ఇచ్చారు. దీంతో స్థానిక టిడిపి కార్యకర్తలు రెచ్చిపోయారు. టిడిపి అధినేత స్వయంగా రంగంలోకి దిగినప్పటికీ ఫలితం కనిపించలేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జగ్గంపేటలో ఇదే పరిస్థితి నెలకొంది. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఎన్నికల బరిలోకి దిగిన పీఠాపురం స్థానంలో కార్యకర్తల్లో ఇంకా అసంతృప్తి రగులుతూనే ఉన్నట్లు సమాచారం. నెల్లూరు జిల్లా కందుకూరులో అసంతృప్త నేతలు ఎన్నికల బరిలోకి దిగడానికి కసరత్తు చేస్తున్నారు. అనేక నియోజకవర్గాల్లో నెలకొన్న ఈ పరిస్థితులు మూడు పార్టీల్లోనూ ఆందోళన కలిగిస్తోంది. వీటిని చంద్రబాబు కవర్ చేయలేకపోతున్నారు.

గతంలో క్యాడర్ ను కంట్రోల్ చేసిన చంద్రబాబు

చంద్రబాబు గతంలో క్యాడర్ ని కంట్రోల్ చేసేవారు. ఇప్పుడు ఆయన మాట కూడా ఎవరూ వినడం లేదు. అనంతపురంలో ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఆయన ఫోటోలను చెప్పులతో కొడుతూ అవమానించారు. ఇలాంటి పరిస్తితి వస్తుందని టీడీపీ వారు కూడా ఊహించి ఉండరు. పార్టీపై చంద్రబాబు పట్టు తగ్గిపోతోందనడానికి ఇవే సంకేతాలన్న అభిప్రాయం వినిపిస్తోంది.