కేసీఆర్‌ది పర్సంటేజీల ప్రభుత్వమా ? పొంగులేటి బయట పెట్టేశాడా ?

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బడా కాంట్రాక్టర్. తెలంగాణలోఉన్న బలమైన .. ధనవంతులైన రాజకీయ నేతల్లో ఆయన ఒకరు. వైసీపీలో గెలిచి టీఆర్ఎస్‌లో చేరి.. ఆ పార్టీ బీఆర్ఎస్ మారాక కూడా.. విధేయంగా ఉన్నా.. హఠాత్తుగా ఇటీవల ప్లేటు ఫిరాయించారు. ఇంకా ఏ పార్టీలో చేరకపోయినా కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తాను కేసీఆర్‌కు ఆరు శాతం పర్సంటేజీ ఇచ్చానని చెప్పారు. అదే ఇంటర్యూలో 2900 కోట్లు పనులు ఇచ్చానని చెప్పారు. అంటే ఈ మొత్తంలో ఆరు శాతం కేసీఆర్‌కు కమిషన్‌గా ఇచ్చారన్నమాట.

పర్సంటేజీలతోనే దేశ రాజకయాలను కేసీఆర్ మలుపు తిప్పాలనుకుంటున్నారా ?

కేసీఆర్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి ఆ సొమ్ముతోనే దేశ వ్యాప్తంగా రాజకీయం చేయాలనుకుంటున్నారన్న ఆరోపణల్ని బలపరిచేలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్లు చేస్తున్నారు. తనకు కేసీఆర్ వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారని.. వాటిలో ఆరు శాతం పర్సంటేజీలు ఆయనకు ఇచ్చానని దానికి ఆధారాలు ఉన్నాయని పొంగులేటి నేరుగానే చెప్పారు. కేసీఆర్ తెలంగాణ ఏర్పడిన తర్వాత లక్ష కోట్లకుపైగా ఖర్చు పెట్టి కాళేశ్వరం నిర్వహించారు. ఈ ప్రాజెక్టుతోపాటు అనేక కాంట్రాక్టులు మేఘా సంస్థకే దక్కాయి. ఆయా సంస్థలే కేసీఆర్ కు ప్రధాన ఆదాయ వనరు అనే ప్రచారం ఉంది. జగన్ కు సన్నిహితుడుగా ముద్రపడిన పొంగులేటి. .. జగన్ సూచనతోనే బీఆర్ఎస్ లో చేరారు. అయితే ఆయన కు ఎలాంటి పదవులు ఇవ్వడానికి కేసీఆర్ ఆసక్తి చూపలేదు. చివరికి టిక్కెట్లు కూడా ఇవ్వలేదు. చివరికి పార్టీ మారాలని డిసైడయ్యారు.

తెలంగాణ ప్రభుత్వంలో పనులు పొందుతున్న వారంతా కమిషన్లు ఇవ్వాల్సిందేనా ?

పొంగులేటి వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో విస్తృత చ్రచకు కారణం అవుతోంది. తాను కూడా పర్సంటేజీలు ఇచ్చానని అందరి దగ్గరగా తీసుకుంటారని పొంగులేటి చెబుతున్నారు. అంటే.. తెలంగాణలో జరుగుతున్న పనుల న్నింటికీ కేసీఆర్ పర్సంటేజీలు తీసుకున్నట్లే అనుకోవచ్చు. అసలు కేసీఆర్, పొంగులేటి మధ్య ఆర్థిక లావాదేవీల మధ్యనే తేడాలు వచ్చాయని.. పనులుచేసినా బిల్లులు ఇవ్వకపోవడం వల్లనే పొంగులేటి అసంతృప్తికి గురయ్యారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు పర్సంటేజీలు తీసుకున్నారని కానీ బిల్లులు మాత్రం పెండింగ్ లో పెట్టారని అంటున్నారు.

కేంద్రదర్యాప్తు సంస్థలు ఈ అంశంపై దృష్టి పెడతాయా ?

తెలంగాణలో వేల కోట్ల ప్రాజెక్టులు పనుల్లో ఉన్నాయి. వాటన్నింటిలో పర్సంటేజీలు తీసుకుని ఉంటే.. ఖచ్చితంగా మనీలాండరింగ్ లాంటి ఇష్యూ ఉంటుంది. పొంగులేటి ఆరోపణలపై బీజేపీ దృష్టి పెడితే… కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే తెలంగాణ ప్రభుత్వ పెద్దలు మరిన్నిచిక్కుల్లో ఇరుక్కుంటారు. కొసమెరుపేమిటంటే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి.. ఏపీలో వరుస కాంట్రాక్టులు దక్కుతున్నాయి. కరెంట్ మీటర్లు పెట్టే కాంట్రాక్టు .. మైనింగ్ సీవరేజీ వసూలు… ఉత్తారంధ్రలో ప్రాజెక్టుల కాంట్రాక్టులు కూడా ఆయనకు చెందిన రాఘవ కన్ స్ట్రక్షన్స్ కు వచ్చాయి. తెలంగాణలో మాత్రం సీతారామ ప్రాజెక్టు కోసం అర్హతలు ఉన్నా ప్రభుత్వం ఇవ్వలేదని ఆయన చెబుతున్నారు.