పడమటి యూపీలో బీజేపీ ప్రభంజనం ఖాయమా….

మీరట్ నుంచి మథుర వరకు అన్ని స్థానాల్లో జయకేతనం ఎగురవేయాలని బీజేపీ ఆకాంక్షిస్తోంది. ఉత్తర ప్రదేశ్లోని 80 లోక్ సభా స్థానాల్లో కనిష్టంగా 99 శాతం సక్సెస్ సాధించాలనుకుంటున్న బీజేపీ.. ఆ క్రమంలో పడమటి యూపీ కీలకమవుతుందని ఎదురు చూస్తోంది. విద్యాధికులు, ఉన్నత మధ్య తరగతి ఓటర్లు ఎక్కువగా ఉండే పడమటి యూపీని తమ వైపుకు తిప్పుకోగలిగితే దాని ప్రభావం దేశంలోని ఇతర ప్రాంతాలపై కూడా ఉంటుందన్నది బీజేపీ నమ్మకం.అందుకే అక్కడ చెమటోడ్చినా ఫర్యాలేదన్నది టీమ్ మోదీ అనుకుంటున్న మాట…

మోదీ, యోగీ స్పెషల్ ఫోకస్…

ప్రధాని నరేంద్ర మోదీ .. ఉత్తర ప్రదేశ్లోని మీరట్ నుంచి ఆ రాష్ట్ర లోక్ సభా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ నెల 30(శనివారం) ఆయన మీరట్ వస్తారు. టీవీ రామాయణంలో రాముడి పాత్ర వేసిన అరుణ్ గోవిల్ ను, బీజేపీ మీరట్ నుంచి పోటీ చేయిస్తోంది. అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ట జరిగి, ఇప్పుడు రోజుకు లక్షన్నర మంది భక్తులు వస్తున్న వేళ అరుణ్ గోవిల్ పోటీ తమకు ప్రయోజనకరంగా ఉంటుందని బీజేపీ భావిస్తోంది. మోదీ ఈ సారి ఎలాంటి హామీ ఇస్తారోనని మీరట్ తో పాటు పడమటి యూపీ జనం కూడా ఎదురుచూస్తున్నారు. మోదీ వెంట తిరుగుతూనే పారలల్ గా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా పడమటి యూపీలో ఎన్నికల పర్యటనలు చేస్తారు. మార్చి 31న ఆయన ప్రభు సమ్మేళన్ పేరుతో పడమటి యూపీలో డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, వృత్తి నిపుణులతో సమావేశమై బీజేపీ విధానాలను వివరిస్తారు. మోదీ ప్రభుత్వం ప్రజల కోసం చేపట్టే కార్యక్రమాలను మరోసారి గుర్తు చేశారు. అక్కడి నుంచి అడపాదడపా వచ్చి వెళ్తారు.

బీజేపీకి కంచుకోటగా షుగర్ కేన్ బెల్ట్

పడమటి యూపీలో మొత్తం 14 లోక్ సభా నియోజకవర్గాలున్నాయి. అక్కడ చెరకు ఎక్కువ పండిస్తారు. అందుకే దాన్ని షుగర్ కేన్ బెల్ట్ అని పిలవడం ఆనవాయితీగా వస్తోంది. రైతు ఉద్యమాలు ఎక్కువగా అక్కడ జరుగుతుంటాయి. రైతు పార్టీ భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ)కేంద్ర కార్యాలయం కూడా అక్కడి సిసౌలీ పట్టణంలోనే ఉంది. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలల ఉద్యమంలో పడమటి యూపీ రైతులు కీలక భూమిక వహించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పడమటి యూపీలో దాని ప్రభావం ఎక్కువగా ఉంది. గెలుస్తామనుకున్న 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ఓడిపోవాల్సిన వచ్చింది.అందుకే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఉదాసీనంగా ఉండకుండా అదనపు శక్తిని వినియోగించి.. ప్రచారం చేస్తోంది…

ఎన్డీయేలో చేరిన జయంత్ చౌదరి….

జయంత్ చౌదరి నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) ఈసారి ఎన్డీయేలోకి వచ్చింది. పడమటి యూపీలో అది అదనపు ఆకర్షణ అవుతుంది. మాజీ ఉప ప్రధాని చౌదరి చరణ్ సింగ్ మనవడే ఆయన.మాజీ కేంద్ర మంత్రి అజిత్ సింగ్ కొడుకు కూడా అయిన జయంత్ చౌదరికి పడమటి యూపీ జాట్స్ లో మంచి పలుకుబడి ఉంది. ఎన్డీయేలో భాగంగా ఆర్ఎల్డీకి రెండు నియోజకవర్గాలు ( భాగ్ పట్, బిజ్నోర్) కేటాయించగా… జయంత్ చౌదరి పడమటి యూపీలోని బీజేపీ అభ్యర్థులందరి తరపున ప్రచారం చేస్తున్నారు. చరణ్ సింగ్ కు భారతరత్న ఇచ్చి గౌరవించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.ఎన్డీయే గెలిస్తే చెరకు మద్దతు ధరను క్వింటాలుకు రూ. 400కు పెంచుతామని జయంత్ చౌదరి హామీ ఇస్తున్నారు.ఎన్డీయేకు 400 సీట్లు రావడం ఖాయమని, చెరకుకు రూ.400 మద్దతు ధర ఇవ్వడమూ ఖాయమని జయంత్ చౌదరి విశ్వసిస్తున్నారు…