ఒక్క సీటు కోసం కర్ణాటక కాంగ్రెస్ లో కుమ్ములాట….

కాంగ్రెస్ అంటే ముఠాలు, కాంగ్రెస్ అంటే గ్రూపులు, కాంగ్రెస్ అంటే 24 గంటలూ గ్రూపు తగాదాలు. టికెట్ ఇవ్వలేదని అలిగి పార్టీ ప్రతిష్టను బజారుకు ఈడ్వటాలు. కాంగ్రెస్ అంటే క్రమశిక్షణా రాహిత్యాలు. ఇప్పుడు కర్ణాటకలో అదే జరుగుతోంది. ఒకరికి టికెట్ ఇస్తే మేము ఉండబోం అంటూ పదిమంది హెచ్చరికలు చేస్తున్నారు. ఆ పని కూడా పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో జరుగుతోంది…

కీలక నియోజకవర్గంపై పేచీ…

లోక్ సభ ఎన్నికల వేళ కోలార్ స్థానంపై కాంగ్రెస్ లో గొడవలు మొదలయ్యాయి. వాళ్లకి టికెట్ ఇస్తే మేము రాజీనామా చేస్తామని ఏకంగా ఐదుగురు కీలక నేతలు బెదిరిస్తున్నారంటే అంతర్గత ఫ్యాక్షనలిజం పార్టీలో ఎంతగా పేరుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. గత లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలోని 28 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఒకటి మినహా అన్ని చోట్ల పరాజయం పాలైంది. ఇప్పుడు పార్టీలో వివాదమైన కోలార్ ను కూడా చేజార్చుకుంది. నిజానికి 2019 వరకు కోలార్ నియోజకవర్గం కాంగ్రెస్ ఖాతాలోనే ఉండేది. 1991 నుంచి కెహెచ్ మునియప్ప ఆ నియోజకవర్గానికి వరుసగా ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్రమంత్రిగా పనిచేశారు. 2019లో ఆయన ఓడిపోయారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సిద్ధరామయ్య కేబినెట్లో మంత్రిగా ఉన్నారు.

అల్లుడి కోసం మునియప్ప తాపత్రయం

మునియప్ప ప్రస్తుతం కర్ణాటక ఆహార, పౌరసరఫరాల శాఖామంత్రిగా ఉన్నారు. కోలార్ తన ఇలాకా అని చెప్పుకునే మునియప్ప ఈ సారి తన అల్లుడు చిక్కా పెడ్డన్నకు కోలార్ లోక్ సభ టికెట్ ఇప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా విషయం బయటకు పొక్కడంతో కోలార్ జిల్లాకు చెందిన ముగ్గురు రాష్ట్ర మంత్రులు ఇద్దరు ఎమ్మెల్సీలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. పెడ్డన్నకు టికెట్ ఇస్తే తాము పదవులకు రాజీనామా చేస్తామని హెచ్చరిస్తున్నారు. కోలార్ ఎమ్మెల్యే జి. మంజూనాథ, మాలూర్ ప్రతినిధి కేఎన్ నంజేగౌడ, చింతామణి నియోజకవర్గం ఎమ్మెల్యే ఎంసీ సుధాకర్ తో పాటు ఎమ్మెల్సీలు అనిల్ కుమార్, నసీర్ అహ్మద్ రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. అందులో సుధాకర్, నసీర్ అహ్మద్ రాష్ట్రమంత్రులుగా ఉన్నారు…

ప్రస్తుతానికి బుజ్జగించిన సిద్దరామయ్య…

నిజానికి ఎమ్మెల్సీలు ఇద్దరూ కౌన్సిల్ చైర్మన్ దగ్గరకు వెళ్లి తమ రాజీనామాను సమర్పించారు. రాజీనామా పత్రాలను మీడియాకు కూడా చూపించారు. అయితే సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రంగప్రవేశం చేసి వారితో మాట్లాడారు. ఇంకా అభ్యర్థుల ఎంపిక జరగనందున తొందరపడవద్దని కోరారు. అన్ని సమస్యలు సర్దుకుంటాయని చెప్పారు. దానితో ప్రస్తుతానికి వారు ఐదుగురు మెత్తబడినట్లుగా తెలుస్తోంది. ఐనా సరే నివురు గప్పిన నిప్పులా అసమ్మతి రాజుకుంటూనే ఉంది. ఇది నిజంగా మునియప్పపై కోపమా లేక వేరే రాజకీయం ఏమైనా ఉందా అన్న కోణంలోనూ మీడియా కథనాలు వస్తున్నాయి…