ఒక్క రాత్రి ఈ ఆలయంలో నిద్రిస్తే సకల సమస్యలు తీరిపోతాయట!

నెల్లూరు నుంచి 15 కిలోమీటర్ల దూరంలో వున్న జొన్నవాడలో శాంతస్వరూపిణిగా కామాక్షిదేవి కొలువై ఉంది. కామాక్షిదేవి సన్నిధిలో తమ సమస్యలను చెప్పుకుని మొరపెట్టుకునే భక్తులు ఆ ఆలయంలో నిద్రిస్తే వారి సమస్యలు తీరిపోతాయని భక్తుల విశ్వాసం.

అమ్మవారి ఆలయ గోపురం లోపలికి ప్రవేశించగానే ఎడమవైపు ఉన్న మార్గంలో పినాకిని నదికి చేరుకోవచ్చు. ఆలయ ప్రవేశ ద్వారంలో దేవి కామాక్షి సన్నిధి వైపు వెళ్లే మార్గంలో రెండు వైపులా శూలం పట్టుకున్న మహిళా ద్వారపాలకుల విగ్రహాలు కనిపిస్తాయి. లోపలకు అడుగుపెట్టాక విశాలమైన లోగిలి…దాన్ని దాటుకుని వెళితే ముందుగా కల్యాణ మండపం ఉంటాయి. కల్యాణ మండపానికి కుడివైపు కామాక్షిదేవి గర్భగుడికి వెళ్లే దారిలో బలిపీఠం, ధ్వజస్థంభం..దాని ముందు పెద్ద నంది, దానిపక్కనే చిన్న నంది ఉంటాయి. లోపలికి వెళ్లగానే అర్ధమండపంలో చాలా స్తంభాలుంటాయి. ఆలయ పురాణం శిల్పాల రూపంలో తెలిసేలా అమర్చారు. అర్ధమండపం తర్వాత వరసగా గర్భగుడులు ఉంటాయి. మొదటి గర్భగుడిలో లక్ష్మీగణపతి, ఎడమవైపున చిన్న మహలక్ష్మి విగ్రహం ఉంటాయి. గర్భగుడిలో మల్లికార్జునస్వామి కొలువై ఉంటారు. చిన్న లింగం, వల్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కొలువై ఉన్నారు.

సర్వాలంకారాలతో కామాక్షి దేవి
అఖిల జగత్తును కాపాడే కామాక్షిదేవి ఈ క్షేత్రంలో నిల్చున్నట్టు మనకు దర్శనమిస్తుంది. చిరునవ్వుతో ఉన్న ముఖారవిందం, కరుణ భరితమైన నయనాలతో సర్వాలంకారాలతో దర్శనిమిస్తుంది. నాలుగు హస్తాలతో ఉన్న అఖిలాండేశ్వరి పై రెండు చేతులలో అంకుశం, పాశము ఉంటాయి. కింది రెండు చేతులలో ఒకటి అభయ హస్తంగా , మరొకటి శరణాగతి పొందమని చూపినట్టు ఉంటాయి. ఆ తల్లిని చూడడానికి రెండు కళ్లు చాలవు. ఆ దేవి ఎదుట శ్రీ చక్రం స్థాపించిన ఆది శంకరుడు చేత ఒక దండంతో దర్శనమిస్తాడు. బయటి ప్రాకారంలో గణపతి, వల్లి, దేవసేన సమేతుడైన సుబ్రహ్మణ్యస్వామి, పసుపు రాసిన ముఖారవిందంతో దుర్గాదేవి చిన్న మండపాలలో దర్శనమిస్తారు. దుర్గాదేవి పక్కనే నవగ్రహాలున్నాయి.

వైశాఖ మాసంలో ఉత్సవాలు
ఇక్కడ ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో జరిగే కామాక్షి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధికసంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ప్రతి శుక్రవారం అమ్మవారి సన్నిధిలో భారీ ఎత్తున పూజలు జరుగుతాయి. ఈ ఆలయంలో ఒక రోజు రాత్రి నిద్రిస్తే సకల సమస్యలు…ముఖ్యంగా సంతాన సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అందుకే సంతానం లేనివారు చాలామంది ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.

గమనిక: పుస్తకాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం..