ఎన్నికలొస్తే ఎంత వ్యాపారమో – పలు వర్గాలకు పెరిగిన వ్యాపారం !

సార్వత్రిక ఎన్నికల నగరా పలు రంగాల వారికి ఉపాధి కల్పిస్తోంది. ఈ వ్యాపారం ఐదేళ్లకోసారి మాత్రమే లభిస్తుంది. ఎన్నికల ప్రచారంలో ప్రధాన పాత్ర పోషించే వివిధ వత్తుల వారికి డిమాండ్‌ పెరిగింది. ఎన్నికల రాకతో వారి పంట పండుతోంది. కాసుల వర్షం కురుస్తోంది. ఇందుకు కావలసిన సంరజామాను ముందస్తుగానే సమకూర్చుకునే పనిలో పడ్డారు. సీట్లు ఖరారు కాక ముందు నుంచే అభ్యర్థులు ప్రచారానికి, ఏర్పాట్లు, ఎన్నికల సామగ్రి కోసం ఉరుకులు పరుగులు పెట్టారు.

ఎన్నికల సమయంలో బోలెడంత పని

బ్యానర్ల ప్రింటింగ్‌ మొదలు.. వాటిని కట్టేవారి నుంచి ప్రచార రథాలు నడిపే డ్రైవర్లు, వంట మాస్టర్లు, క్యాటరింగ్‌లు, హౌటళ్లు, సప్లయి చేసేవారు ఇలా ప్రతీ ఒక్కరికి చేతి నిండా పనే. వీరి వ్యాపారం మూడు ఆర్డర్లు, ఆరు అడ్వాన్సులుగా సాగుతోంది. దాదాపు రెండు నెలల పాటు తమ వ్యాపారానికి ఢోకా లేదన్న ధీమాతో ఉత్సాహంగా ఉన్నారు.ఆటోనగర్‌లలో ప్రచార రధాలు తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాలను చుట్టి రావడానికి అభ్యర్థులు ప్రచార రథాలను నమ్ముకోవడంతో వాటిని తయారు చేసేవారికి యమ డిమాండ్‌ పెరిగింది. ఆయా పార్టీల అభ్యర్థులు వాటిని తయారు చేసేవారి వద్దకు పరుగులు పెడుతున్నారు. ఆకర్శణీయమైన ప్రచార రథాలు చేయించుకునేందుకు అభ్యర్థులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఖర్చుకు వెనకాడడం లేదు. టెక్నాలజీ పెరగడంతో ఈ రథాల రూపు రేఖలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. డిజిటల్‌ ఫ్లెక్సీలను రథాలకు అమర్చుతున్నారు. ఇందుకోసం తయారీదారులు ఇదే అవకాశంగా భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు.

కళాకారులకూ ఫుల్ డిమాండ్

కళాకారులు ఊరూరా తిరుగుతూ పాట, మాటలతో సందడి చేసి రోజుకు రూ.10వేల వరకు పొందుతున్నారు. గాయకులతో పాటలు పాడించి, సీడీలను రూపొందించడం ద్వారా రూ.వేలల్లో ఆర్జిస్తున్నారు.విందు.. పసందు ప్రచారానికి వచ్చే వారికి ఉదయం అల్పాహారం, సాయంత్రం, రాత్రి భోజనం వసతి కల్పిస్తున్నారు. వ్యక్తికి అల్పాహారం మధ్యాహ్నం, రాత్రి భోజనానికి ఏర్పాట్లు చేస్తుండడంతో వంట వాళ్లకు, క్యాటరింగ్‌కు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. అభ్యర్థులు ప్రచారంలో పాల్గొనే ఒక్కో వ్యక్తికి రోజుకు రూ.100నుంచి 180 పైగా ఖర్చు చేస్తున్నారు.

ఫోటో గ్రాఫర్లు, వీడియోలు తీసేవారికీ ఫుల్ డిమాండ్

ఎన్నికల ప్రచారం పూర్తయ్యే వరకు ఒక్కో ఫొటోగ్రాఫర్‌ రూ.30 వేల నుంచి రూ.50వేలు, వీడియోగ్రాఫర్‌కు రూ.50వేల నుంచి 75వేల వరకు చార్జీలు తీసుకుంటున్నారు. .టెంటు యజమానులకు గిరాకీ టెంట్‌హౌస్‌ యజమానులు కుర్చీకి రూ.10, టెంట్‌ సైజ్‌ను బట్టి రూ.వెయ్యి నుంచి రూ.3వేల వరకు వసూలు చేస్తున్నారు. స్టేజీ నిర్మాణం రూ.2వేల నుంచి రూ.5వేలు డిమాండ్‌ చేస్తున్నారు. కరపత్రాలు, ప్లెక్సీల దుకాణాలు కళకళలాడుతున్నాయి. ఒక్కో అభ్యర్థికి వేలాదిగా కరపత్రాలు, ఫ్లెక్సీల అవసరం. ఒక్కో కరపత్రానికి రూ.3 నుంచి 5, ఫ్లెక్సీకి సైజును బట్టి రూ.200 నుంచి రూ.వేలల్లో ఖర్చు చేస్తున్నారు. ఈ లెక్కన అభ్యర్థికి రూ.లక్షల్లో ఖర్చు కానున్నది. ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చే అభ్యర్థులకు, ప్రధాన నాయకులను స్వాగతం చెప్పే క్రమంలో స్థానిక నాయకులు పూలు, పూలదండలతో సన్మానిస్తున్నారు. పూల వ్యాపారులకు ఉపాధి లభిస్తోంది. నియోజకవర్గాల్లో కూలీలతో ప్రచారం చేపడుతున్నారు. పట్టణాల్లో రోజుకు రూ.500 నుంచి రూ.600 వరకు చెల్లిస్తున్నారు.