బీజేపీపై తప్పుడు ప్రచారాలు – ఆఖరి రాగం పాడేస్తున్న కాంగ్రెస్

మోడీ సర్కారు అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని, రిజర్వేషన్లు ఉండబోవని ప్రతిపక్షాలు ఫేక్ ప్రచారాలతో ప్రయత్నాలు చేస్తున్నాయి. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని బిజెపి మార్చబోదని, రిజర్వేషన్లను రద్దు చేయబోదని బీజేపీ స్పష్టంగా చెప్పింది. అయితే కాంగ్రెస్ నేతలు అదే ఆరోపణలు చేస్తున్నారు. రిజర్వేషన్లుకూడా రద్దు చేస్తారంటూ తప్పుడు ప్రచారాల్ని ప్రారంభించారు.

బీజేపీని దెబ్బతీయడానికి తప్పుడు మార్గాల్లో కుట్ర

‘రిజర్వేషన్లకు స్వస్తి చెప్పే ప్రసక్తే లేదు. రిజర్వేషన్లు అవసరమని నేను గట్టిగా నమ్ముతున్నాను. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చాల్సిన అవసరమున్నదని కూడా మేము ఎప్పుడూ భావించలేదు’ అని బీజేపీ అగ్రనేతలు స్పష్టత ఇచ్చారు. ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి రిజర్వేషన్లు రద్దు అయ్యే ప్రశ్నే ఉండదన్నారు. అయినా ఎందుకు ఇలా తప్పుడు ప్రచారాలు కొనసాగిస్తున్నారంటే.. బీజేపీ ఓటు బ్యాంకును దెబ్బతీయడానికి చేస్తున్న ప్రయత్నమని సులువుగా అర్థం చేసుకోవచ్చు.

ఓబీసీ చాంపియన్ గా బీజేపీ

2009 నుండి బిజెపి ఒబిసీ ప్రజల్లో ఆదరణ చూరగొన్నది. 2009 ఎన్నికల్లో ఒబిసి ఓట్లలో బిజెపి 17% వాటాను పొందింది. 2019 నాటికి అది 47%కి పెరిగింది. అంటే బీజేపీని ఓబీసీలందరూ ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు వారిని దూరం చేస్తేనే తమకు కొన్ని సీట్లు వస్తాయని కాంగ్రెస్ తో పాటు విపక్షాలు అనుకంటున్నాయి. అందుకే ఉద్ధృతంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎవరెవరో మాట్లాడిన మాటలను బీజేపీకి అన్వయించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.

కాంగ్రెస్ ఆఖరి ప్రయత్నం

బీజేపీని దెబ్బ కొట్టడానికి.. మోదీ ఇమేజ్ ను మసక బార్చడానికి కాంగ్రెస్ చేయని ప్రయత్నం లేదు. కానీ ఈ సారి కూడా బీజేపీ గెలిస్తే… కాంగ్రెస్ ముక్త భారత్ ఏర్పడుతుంది . అంటే కాంగ్రెస్ అంతర్థానమైపోతుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ కంగారు పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తప్పుడు ప్రచారాలతో అయినా బీజేపీ ఓటు బ్యాంకుకు గండికొట్టి ఎంతో కొంత ఓట్లు.. కొన్ని సీట్లు సాధించాలనుకుంటోంది. కానీ ఆ పార్టీ మాటలపై ప్రజల్లో విశ్వసం లేదని ఎన్నో సార్లు తేలింది. అందుకే కాంగ్రెస్ ఆఖరి రాగం పాడుతోందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.