క్యాన్సర్ ని కొనుక్కుని మరీ తెచ్చుకోకండి -ఈ ఉత్పత్తులకు దూరంగా ఉండండి!

దేశంలో 2022లో 14 లక్షల మంది క్యాన్సర్ బారిన పడినట్టు తేలింది. అంటే ప్రతి 9 మందిలో ఒకరు క్యాన్సర్ బారిన పడుతున్నారని అర్థం. దీని బారిన పడకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ధూమపానం, ఆల్కహాల్ మాత్రమే కాదు మనం తీసుకునే ఆహారం, వినియోగించే కొన్ని ఉత్పత్తులలో కూడా క్యాన్సర్ కారకాలు ఉన్నాయని మీకు తెలుసా…ఆ పదార్థాలను ఎలా గుర్తించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

మసాలాలు వద్దు
వంటల్లో మసాలా వేయనిదే..ముఖ్యంగా నాన్ వెజ్ వంటకాల్లో మసాలా లేనిదే టేస్ట్ రాదు. ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పేస్ట్ పర్వాలేదు కానీ నేరుగా మార్కెట్లో కొనుగోలు చేసే మసాలా ప్యాకెట్లతోనే ప్రమాదం. బయటి మసాలాలు ఎక్కువగా వినియోగిస్తే సమస్యలో పడినట్టే…

జుట్టుకు వేసే రంగుతో జాగ్రత్త
కోల్ తార్ అనేది బొగ్గును ప్రాసెసింగ్ చేసినప్పుడు వచ్చే ఉప ఉత్పత్తి. ఇది క్యాన్సర్ కారకం. జుట్టుకు వేసే రంగులు, షాంపూలు, ఇతర సౌందర్య సాధనాలలో వీటిని వాడుతూ ఉంటారు. ఈ రసాయనానికి గురైతే ఊపిరితిత్తులు, మూత్రాశయం, మూత్రపిండాలు, జీర్ణవ్యవస్థ కు సంబంధించిన క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. మీరు కొనే ఉత్పత్తులపై కోల్ తార్ అని రాసిపెట్టి ఉంటే వాటిని కొనద్దు..

క్రీములు – పౌడర్లతోనూ ముప్పే
పారాబెన్స్ అనేవి సౌందర్య ఉత్పత్తుల్లో వాడతారు… అంటే క్రీములు, ముఖానికి రాసుకునే పౌడర్లు, సబ్బులు, షేవింగ్ ఉత్పత్తులు, అలాగే ప్రాసెస్ చేసిన కొన్ని ఆహారాల్లో కూడా వీటిని వాడడం సాధారణంగా మారిపోయింది. పారాబెన్లు హార్మోన్లకు అంతరాయం కలిగిస్తాయి. సంతాన ఉత్పత్తి పై తీవ్రంగా ప్రభావాన్ని చూపిస్తాయి. అలాగే కొన్ని రకాల క్యాన్సర్లను అభివృద్ధి చేసే ప్రమాదం కూడా ఉంది.

చెక్కతో చేసిన ఉత్పత్తులతోనూ జాగ్రత్త
ఫార్మాల్డిహైడ్ అనేది ఒక రంగులేని వాయువు. ఆటోమొబైల్ భాగాలు, వస్త్రాలు, క్రిమిసంహారకాలు వంటి వాటిల్లో వీటిని అధికంగా వినియోగిస్తారు. ఏదైనా చెక్కతో చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేసేటప్పుడు దానిలో ఫార్మాల్డిహైడ్ అనే రసాయనం వినియోగించారేమో తనిఖీ చేయండి.

సువాసనలు కావాలన్నా సమస్యే
థాలేట్స్ అనేవి సింథటిక్ సువాసనను ఎక్కువ కాలం ఉండేటట్టు చేస్తాయి. అందుకే వీటిని అధికంగా పెర్ఫ్యూమ్స్, హెయిర్ స్ప్రే, నెయిల్ పాలిష్, ఎయిర్ ఫ్రెషనర్లు ఇలా సువాసనలుండే ఉత్పత్తులలో వినియోగిస్తారు. ఇవి హార్మోన్లను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. క్యాన్సర్లకు కారణం అవుతాయి.

డీప్ ఫ్రైలు వద్దు
ధూమపానంలో ఈ రసాయనం ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతల వద్ద వంట చేస్తున్నప్పుడు నూనె పదార్థాలలో ఈ రసాయనం జనించే అవకాశం ఉంది. ఆ నూనెలో డీప్ ఫ్రై చేసే ఆహారాలను తినడం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం