సిక్కోలు బరిలో రామ్మోహన్ నాయుడుకు ఎదురుగాలి – వ్యూహాత్మక తప్పిదాలే కారణం !

శ్రీకాకుళం లోక్ సభ పరిధిలో టీడీపీ వ్యూహాత్మక తప్పిదాలు ఆ పార్టీలు శాపంగా మారాయి. శ్రీకాకుళం ఎంపి స్థానానికి టిడిపి తరపున సిట్టింగ్‌ ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, వైసిపి నుంచి పేరాడ తిలక్‌ బరిలో ఉన్నారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎంపిగా కింజరాపు రామ్మోహన్‌నాయుడు వరుసగా విజయం సాధించారు. మూడోసారి గెలిచి హ్యాట్రిక్‌ సాధించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈసారి టిడిపి పరిస్థితి అంత సానుకూలంగా కనిపించడం లేదు. అభ్యర్థుల ఎంపికలో టిడిపి తీసుకున్న నిర్ణయాలు, గ్రూపుల పోరు గెలుపు అవకాశాలను కొంతమేర కష్టంగా మారతాయనే అభిప్రాయం వినిపిస్తోంది.

శ్రీకాకుళం, పాతపట్నంలో కలసి రాని పరిస్థితులు

ముఖ్యంగా శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాల్లో టిడిపి ఇన్‌ఛార్జులు గుండ లకీëదేవి, కలమట వెంకటరమణకు పార్టీ టికెట్లు నిరాకరించడంతో వారి అనుచరులు, అభిమానుల్లో ఆగ్రహం చల్లారలేదు. టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌, ఎంపి రామ్మోహన్‌నాయుడు గుండ అనుచరులు, కేడర్‌తో చర్చలు జరిపిన తర్వాత అభ్యర్థి గుండ శంకర్‌తో కలిసి పనిచేసేందుకు అంగీకరించినా, ప్రచారంలో అన్యమనస్కంగానే పాల్గొంటున్నారు. టిడిపి ఇన్‌ఛార్జి గుండ లకీëదేవికి పట్టున్న గార, శ్రీకాకుళంలోని అరసవల్లి తదితర ప్రాంతాలకు చెందిన నాయకులు వైసిపి గూటికి చేరిపోయారు. శ్రీకాకుళం నగరంలో వైసిపిలో కీలకంగా ఉన్న అంధవరపు వరహానరసింహం కుటుంబానికి శ్రీకాకుళం మేయర్‌ పదవి ఇస్తామనే ప్రతిపాదనతో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆ కుటుంబాన్ని పార్టీలోకి తీసుకున్నారు. దీంతో మేయర్‌ పదవిపై ఆశలు పెట్టుకున్న టిడిపి నాయకులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఎన్నికల్లో ఇది కొంతమేర ప్రభావం చూపుతుందనే చర్చ నడుస్తోంది. ఇటీవల చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంలో పాతపట్నం టిడిపి ఇన్‌ఛార్జి కలమట వెంకటరమణను పిలిచి బుజ్జగించారు. ఆయనకు టిడిపి జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. అయినా అక్కడ కలమట గ్రూపు సరిగ్గా పనిచేయడం లేదు.

చెమటోడ్చుతున్న సిట్టింగ్‌ ఎంపి రామ్మోహన్‌నాయుడు

వైసిపి కూడా ఎలాగైనా ఈ సీటును దక్కించుకోవాలని అన్ని రకాల ప్రయత్నాలూ సాగిస్తోంది. 2019 ఎన్నికల్లో పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు గానూ ఐదు చోట్ల అభ్యర్థులు ఘన విజయం సాధించినా వైసిపి ఎంపి సీటును కోల్పోయింది. నరసన్నపేట, పలాస, పాతపట్నం స్థానాల నుంచి వైసిపి అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు. అక్కడ మాత్రం టిడిపి ఎంపి అభ్యర్థికి మెజార్టీ వచ్చింది. దీంతో ఈసారి క్రాస్‌ ఓటింగ్‌ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. వేర్వేరు రాజకీయ పార్టీల్లో ఉంటున్నా ధర్మాన, కింజరాపు కుటుంబాల మధ్య రాజకీయ అవినాభావ సంబంధం ఇటీవల వరకు కొనసాగుతూ వస్తోంది. శ్రీకాకుళం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్‌కు సీటు ఇప్పించి, గెలిపించే బాధ్యతను తీసుకున్న టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తాజాగా వైసిపి కేడర్‌ను ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారు. ఇది ధర్మాన వర్గానికి తీవ్ర ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం, నరసన్నపేట నియోజకవర్గాల నుంచి ఎంపి అభ్యర్థి రామ్మోహన్‌నాయుడుకు సహకారం ఉండకపోవచ్చన్న చర్చ నడుస్తోంది.

రామ్మోహన్ కు ఈ సారి క్రాస్ ఓటింగ్ జరగదా ?

పలాస నియోజకవర్గం నుంచి కూడా గత ఎన్నికల్లో టిడిపికి భారీగానే క్రాస్‌ ఓటింగ్‌ జరిగింది. పలాస నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మంత్రి సీదిరి అప్పలరాజు ఎంపి అభ్యర్థి గెలుపుపై పెద్దగా పట్టించుకోలేదని విమర్శలు ఎదుర్కొన్నారు. మంత్రి అప్పలరాజు, టిడిపి ఎంపి అభ్యర్థి రామ్మోహన్‌నాయుడు మధ్య గత కొంతకాలంగా మాటల యుద్ధం కొనసాగుతోంది. అది ఇప్పుడు తీవ్రస్థాయికి చేరింది. దీంతో అక్కడ్నుంచి టిడిపి ఎంపి అభ్యర్థికి ఒక్క ఓటు కూడా క్రాస్‌ ఓటింగ్‌ జరగకుండా మంత్రి అప్పలరాజు పట్టుదలతో పనిచేస్తున్నట్లు తెలిసింది.