కొత్త సెక్రటేరియట్‌లో తెలంగాణ వారిపై వివక్ష ! నిజమేనా ?

తెలంగాణ కొత్త సెక్రటేరియట్‌లో తెలంగాణ వారిపై వివక్ష చూపిస్తున్నారనే విమర్శలు సంచలన అవుతున్నాయి. తెలంగాణ సెక్రటేరియట్ .. తెలంగాణకు గర్వకారణం అని చెబుతున్నారు కానీ.. దాన్ని చూసేందుకు తెలంగాణ ప్రజలకు అవకాశం దక్కడం లేదు. ప్రారంభించిన ఒకటి , రెండు రోజులు వంద మంది సందర్శకులకు చాన్స్ ఇచ్చారు. తర్వాత సాంకేతిక కారణాలతో ఆపపేశారు. ఇంకా అనుమతి ఇవ్వడం లేదు. అలాగని ఎవరూ రావడం లేదా అంటే.. చాలా మంది వస్తున్నారు. వారెవరూ తెలంగాణ వారు కాదు. ఇతర రాష్ట్రాల వారికి బస్సులేసి మరీ తీసుకొచ్చి చూపిస్తున్నారు.

తెలంగాణ వాసులకు దక్కని విజిటర్స్ పాస్‌లు

తెలంగాణ సచివాలయాన్ని చూసేందుకు వస్తున్న వారితో కిక్కిరిసిపోతోంది. వందల మంది వస్తున్నారు. వారిలో విదేశీ డెలిగేట్స్ ఉంటున్నారు… ఇతర రాష్ట్రాల వారు ఉంటున్నారు. వారంతా.. ఆహా ఓహో అని పొగిడిపోతున్నారు. కేసీఆర్ గొప్పదనం గురించి వ్యాఖ్యానిస్తున్నారు. అదంతా సరే కానీ.. మరి ఆ గడీలోకి తెలంగాణ ప్రజల్ని, ప్రతిపక్ష నేతల్ని ఎందుకు ఆహ్వానించడం లేదన్న ప్రశ్న కూడా విపక్షాల నుంచి వస్తోంది. సీఎస్ ను కలిసేందుకు వెళ్తున్న రేవంత్ రెడ్డిని .. సెక్రటేరియట్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో అడ్డుకుని వెనక్కి పంపేశారు. రాజాసింగ్ కు ఆహ్వానం ఉన్నా గేటు దగ్గరే ఆపేసి అవమానించారు. బీఆర్ఎస్ నేతలకే సెక్రటేరియట్ పాస్ దక్కడం గగనంగా మారింది. ఇతర పార్టీల నేతలకు అయితే అసలు చాన్స్ లేదు.

ప్రగతి భవన్‌లో ఇతర రాష్ట్రాల వాళ్లకు ఫ్రీ ఎంట్రీ కానీ ప్రజలకు నో చాన్స్

ప్రగతి భవన్ వ్యవహారంపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ప్రజలకు అందులో ఎంట్రీ లేదని.. ఇతరులకు మాత్రమే ఉంటుని విపక్షాలు విమర్శిస్తూ ఉంటయి. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టాలనుకున్న తర్వాత ఇతర రాష్ట్రాల్లో ఎందుకూ పనికి రాని నేతలకు ప్రత్యేక విమానాలు పంపి మరీ హైదరాబాద్ తీసుకు వస్తున్నారు. వారిని గౌరవంగా ప్రగతిభవన్ లోకి తీసుకు వెళ్లి పొట్టేలు మాంసంతో విందులు ఇచ్చి పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇదంతా ప్రజల సొమ్మే. సెక్రటేరియట్ లోనూ అదే పరిస్థితి. తెలంగాణ ప్రజలసొమ్ముతో నిర్మించిన సెక్రటేరియట్ లోకి ఇతర రాష్ట్రాల వారు వెళ్లి క్యాంటీన్‌లో మంచి విందు ఆరగిస్తున్నారు కానీ తెలంగాణ వారికి చోటు లేదనే విమర్శలు ఈ కారణంగానే వస్తున్నాయి.

తెలంగాణ ప్రజల్ని కేసీఆర్ కించ పరుస్తున్నారా ?

తెలంగాణ ఉద్యమం పేరుతో .. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్.. చివరి ఆయన … ఆయన కుటుంబమే అన్ని విలాసాలు అనుభవిస్తోందన్న ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇది అబద్దమని కేసీఆర్ చేతతో సమాధానం ఇవ్వాల్సి ఉంది. కానీ ఆయన ఆరోపణలు నిజమేనన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ప్రజల్ని దూరం దూరం గా ఉంచుతున్నారన్న ఆరోపణలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.