పంతం నెగ్గించుకున్న చంద్రబాబు – చీపురుపల్లిలోనే గంటా పోటీ

చీపురుపల్లి.. ప్రస్తుతం జిల్లాతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన అసెంబ్లీ నియోజకవర్గమిది. టిడిపి, వైసిపి శ్రేణుల్లోనైతే హాట్‌టాపిక్‌గా మారింది. అందుకు కారణం లేకపోలేదు. ఈ నియోజకవర్గంలో వైసిపి నుంచి ఎమ్మెల్యే బరిలో మంత్రి బొత్స సత్యనారాయణ దిగడం ఖాయమైంది. అటు టిడిపి నుంచి ‘బలమైన అభ్యర్థి’ అంటూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును పోటీకి సిద్ధం చేస్తున్నారనే ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా చక్కర్లు కొడుతోంది. గంటా కూడా ఎక్కడా సీటు దొరక్కపోతే ఇక్కడి నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు.

గంటాకు ఒకే ఆప్షన్ ఇచ్చిన చంద్రబాబు

అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసిన టిడిపి, జనసేన కూటమి.. చీపురుపల్లి, శృంగవరపుకోటలో మాత్రం ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతోంది. శృంగవరపుకోటలో పరిస్థితి వేరు. కానీ చీపురుపల్లిలో మాజీమంత్రి గంటా శ్రీనివాసరావును బరిలో దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగింది. భీమిలి లేదా విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ఏదో ఒక నియోజకవర్గంలో అవకాశం దక్కకపోతే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చీపురుపల్లి నుంచే అనివార్యంగా పోటీచేయనున్నట్లు తెలిసింది. ఇంతవరకు ఉమ్మడి విశాఖ జిల్లాలో మాత్రమే పోటీచేశానని, చీపురుపల్లిలో అయితే నాన్‌ లోకల్‌ సమస్య, సామాజిక పరంగా ప్రతికూల వాతావరణం ఉంటుందని అధిష్టానం ఎదుట చెప్తున్నారట. కానీ చంద్రబాబు అంగీకరించడం లేదు.

చీపురుపల్లి కాకపోతే మొదటి జాబితాలోనే గంటాకు సీటు

వాస్తవానికి గంటా ఇంత వరకు తాను కోరుకున్న స్థానం తొలి జాబితాలోనే వచ్చేసేది. మారిన రాజకీయ పరిస్థితుల రీత్యా ఎంతటివారైనా కోరుకున్న చోట కాకుండా, అధిష్టానం ఆదేశించిన చోట నుంచే బరిలో దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకు గంటా కూడా మినహాయింపు కాకపోవడంతో చివరి వరకు ప్రయత్నించి, ఫలించకపోతే అధిష్టానం చెప్పిన విధంగా చీపురుపల్లి వైపు దారి చూసుకునే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఓడినా, గెలిచినా… అధికారంలోకి వచ్చినా, ప్రతిపక్షంలో ఉన్నా పార్టీలో గానీ, ప్రభుత్వంలో గానీ తన స్థానాన్ని ఎప్పటి మాదిరిగా పదిలం చేసుకునేందుకే గంటా శ్రీనివాసరావు తుదిపోరాటం సాగుతోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

చంద్రబాబు నుంచి హామీ కోరుతున్న గంటా

ఎమ్మెల్యేగా ఓడినా ప్రభుత్వం ఏర్పడితే మంత్రి వర్గంలో స్థానం ఉండే విధంగా హామీ పొందేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా అర్థమౌతోంది. చీపురుపల్లి నుంచి పోటీచేయడం అనివార్యమైతే ఆలస్యంగా పనిలో దిగామనే పరిస్థితి లేకుండా గంటా తన సొంత మనుషులతో అంతర్గత సర్వేలు చేసుకుంటున్నట్టు సమాచారం. బొత్సతో ఢకొీంటే గట్టి పోటీ ఉంటుందని, పరిస్థితులను అనుకూలంగా మలుచుకోగలిగితే సానుకూలంగా ఉంటాయని ఆయన సొంత సర్వే రిపోర్టుల్లో వచ్చిందట. అందుకే చివరి క్షణాల్లో అనివార్యంగా వెళ్లాల్సి వస్తే అప్పటికప్పుడు ఇబ్బంది పడకుండా గంటా చాపకింద నీరులా తన వ్యూహానికి పదును పెట్టినట్టుగా తెలుస్తోంది.