వలస ఓటర్లకు బంపర్ ఆఫర్లు – ఈ సారి ఓటింగ్ శాతం పెరగనుందా ?

వచ్చే నెల 13న జరగనున్న శాసనసభ, లోక్‌ సభ ఎన్నికల్లో గెలిచేందుకు పోటీలో ఉన్న అభ్యర్థులు శత విధాలా ప్రయాత్నాలు చేస్తున్నారు. వలస పోయిన వారి అడ్రస్‌ తెలుసుకుంటూ ఫోన్లు చేస్తున్నారు. పోలింగ్‌ కల్లా వచ్చి ఓటేస్తే రానుపోను ఖర్చులు భరిస్తామంటూ చెబుతున్నారు. వారు వచ్చేలా స్థానికంగా ఉన్న బంధువులతో మాట్లాడుతున్నారు. మున్సిపాలిటీ, నగర పంచాయతీ, గ్రామ పంచాయితీ ఆయా వార్డుల్లో ఓటు ఉండి వలస పోయిన ఓటర్లకు గాలం వేస్తున్నారు.

వలస వెళ్లిన వారి జాబితాలతో ప్రయత్నాలు

రెండు, మూడు నెలల కింద ఇతర ప్రాంతాలు, పట్టణాలకు వలస వెళ్లిన వారి వివరాలను ఓటరు లిస్ట్‌లతో సేకరిస్తున్నారు. 13న జరిగే పోలింగ్‌ కోసం రావాలంటూ అభ్యర్థులు ఫోన్లు చేస్తున్నారు. రాను పోను ఛార్జీలు తామే భరిస్తామని హామీలు గుప్పిస్తూ ఎంతకైనా ఖర్చుకు వేనకాడేది లేంటూ ప్రచారం కొనసాగిస్తున్నారు. తాను గుర్తింపు పొందిన పార్టీ నుంచే బరిలో ఉన్నామంటూ వారి బంధువుల ద్వారా ఫోన్‌ చేయించి వివరాలు సేకరిస్తున్నారు. ఒక్కో ఓటుకు రూ.2000 ఖర్చు చేసేందుకు కూడా వెనకాడడం లేదు. తమ బంధువుల ద్వారా ఫోన్‌ వివరాలు సేకరిస్తూ ఎవరు చెపితే ఓటు వేస్తారో వారితో చెప్పించి మరీ ఫోన్‌లు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న వలస ఓటర్లను రప్పించేందుకు కొంత డబ్బును వారి ఇంట్లో ముట్టజెపుతూ ఓటు వేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రత్యేక టీముల్ని ఏర్పాటు చేసుకున్న అభ్యర్థులు

పార్టీల అభ్యర్థులు ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 5 ఓట్లకు పైబడి ఉంటే ప్రత్యేక వాహనం కూడా ఏర్పాటు చేస్తామని వచ్చి ఓటు వేయాలంటూ వేడుకుంటున్నారు. వలస వెళ్లిన వారి ఓటు తీసేయకుండా జాగ్రత్త పడుతూ ఓట్లు తొలగించకుండా తానే చూసానని, తప్పకుండా తనకు ఓటు వేయాలని ఫోన్‌ చేసి అర్ధిస్తున్నారు. కుల పెద్దల వారికి ఫోన్‌లు చేయించి కుల కట్టుబాటు దాట వద్దంటూ సూచిస్తున్నారు. ఎన్నికలకు ముందు రోజు రావాలని వెడుకుండున్నారు. ఆయా వార్డులో ఒక్కోక్క ఓటు కీలకం కావడంతో ఓటరు జాబితా సేకరించి ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయో సమాచారాన్ని సేకరిస్తున్నారు.

ఎక్కువగా హైదరాబాద్ నుంచే ఓటర్లు రాక !

విద్య, ఉద్యోగం, ఉపాధి కోసం చాలామంది తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలకు వెళ్లారు. ఎక్కువ మంది హైదరాబాద్ లో ఉన్నారు. అక్కడి నుంచి వచ్చేందుకు ప్రత్యేకమైన వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు. రెండు పార్టీల నేతలు ఈ విషయంలో పోటాపోటీగా ఉంటున్నారు. అందుకే ఈ సారి ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.