బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ ఫ్రీ హామీలు – ఓటర్లను ఓ మాదిరిగా కూడా చూడరా ?

భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ మేనిఫెస్టో ప్రకటించారు. కాంగ్రెస్ ఇంకా మేనిఫెస్టో ప్రకటించలేదు కాీ.. ఆరు గ్యారంటీల పేరుతో ప్రచారం ప్రారంభించింది. ఈ రెండు పార్టీల హామీల్ని చూసి ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. పోటీ పడి వేలకు వేలు ఇస్తామని.. లక్షలు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని హమీలు ఇస్తున్నారు.

బీఆర్ఎస్ హామీలు అమలు చేయాలంటే పన్నులు రెట్టింపు చేయాలి

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. ఆసరా పింఛన్లు రూ.5 వేలకు పెంపు, దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంపు, ‘సౌభాగ్య లక్ష్మి’ పథకం కింద అర్హులైన పేద మహిళలకు ప్రతి నెలా రూ.3 వేల భృతి. పేద మహిళలకు రూ.400కే గ్యాస్ సిలిండర్, అక్రిడేటెడ్ జర్నలిస్టులకు సైతం రూ.400కే గ్యాస్ సిలిండర్, రైతు బంధు మొత్తాన్ని రూ.16 వేలకు దశల వారీగా పెంపు. ఇంటి స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, ఆరోగ్య శ్రీ గరిష్ట పరిమితి రూ.15 లక్షలు పెంపు. ఇవే కాకుండా తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం, రైతు బీమా తరహాలోనే ఎల్ఐసీ ద్వారా రూ.5 లక్షల జీవిత బీమా, అనాథ పిల్లల కోసం ప్రత్యేక పాలసీ వంటి హామీలను సీఎం కేసీఆర్ తన మేనిఫెస్టోలో ప్రకటించారు. గత రెండు మేనిఫెస్టోలను చూస్తే కేసీఆర్ అమలు చేసింది జీరో. అయినా తగ్గడం లేదు.

కర్ణాటకలోలాగే మోసం చేస్తామని ఇప్పటికే కాంగ్రెస్ మాటలు

తెలంగాణలో మహిళలు, యువత, రైతులు, వృద్ధుల ఓట్లను కొట్టేయడమే లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ 6 హామీలను ప్రకటించింది. ‘మహాలక్ష్మి’ పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, రాష్ట్రమంతటా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ‘రైతు భరోసా’ కింద ఏటా రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15 వేల పెట్టుబడి సాయం, వ్యవసాయ కూలీలకు రూ.12 వేల ఆర్థిక సాయం, వరి పంటకు అదనంగా రూ.500 బోనస్’గృహజ్యోతి’ పథకం కింద ఇళ్లల్లో వాడే 200 యూనిట్ల కరెంట్ ఉచితం హామీలను ఇచ్చింది అలాగే ఇళ్లు లేని పేదలకు ఇంటి స్థలం సహా ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం. తెలంగాణ ద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటిస్థలం, పింఛను దారులకు నెలకు రూ.4 వేల పింఛను. ‘ఆరోగ్య శ్రీ’ కింద రూ.10 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తామని ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు. విద్యా భరోసా కార్డు కింద విద్యార్థులకు రూ.5 లక్షల పరిమితితో వడ్డీ రహిత ఆర్థిక సాయం ఇస్తామని ప్రకటించింది. ఇది పూర్తి స్థాయిలో కంగ్రెస్ మేనిఫెస్టో కాదు. ఇంకాఉంటాయని చెబుతోంది. ఈ హామీలను చూస్తే. అమలు చేసేవేనా అని చిన్న పిల్లవాడికీ డౌట్ వస్తుంది.

ప్రజల్ని ఓ మాదిరిగా చూడరా ?

ప్రజలు ఆశ పోతులని నాలుగు పథకాలు ప్రకటిస్తే ఓట్లు వేసేస్తారని అనుకుంటున్నారు. ఓటర్లను తక్కువ అంచనా వేస్తున్నారు. కానీ ప్రజలు ఇప్పుడు రాజకీయంగా చైతన్యవంతులయ్యారు. రాజకీయ నేతలు వేసే వేషాలపై వారికి స్పష్టత ఉంది. ఈ పనికి రాని.. పని చేయని హామీల్ని వారు విశ్వసించే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే తెలంగాణలో ఈ సారి ఊహించని ఫలితాలు రాబోతున్నాయని చెబుతున్నారు.