నిన్నటి యూపీఏ, నేటి ఇండియా గ్రూపు పార్టీలు చేయని అవకతవకలు లేవు. అడ్డదారుల్లో గెలవాలన్న ప్రయత్నం తప్పితే ప్రజాబలంతో విజయం సాధించాలన్న కోరిక వారికి లేదు. ఎన్నికల్లో ఎన్ని రకాల అక్రమాలు చేసే వీలుంటుందో అన్నింటినీ వాళ్లు చేసి చూపిస్తుంటారు. ఐనా సరే జనం వారిని విశ్వసించడం లేదు….
లక్షల ఓట్లు మాయం…
తమిళనాడులోని అన్ని 39 లోక్ సభా నియోజకవర్గాల్లో శుక్రవారం పోలింగ్ జరిగింది. దాదాపు 63 శాతం ఓటింగ్ నమోదైనట్లు చెబుతున్నారు.ఉదయం ఆరున్నరకే ఓటు వేసేందుకు లైన్లో నిల్చున్న వారికి షాకులు తగిలాయి. చాలా మంది పేర్లు ఓటర్ల జాబితా నుంచి మాయమయ్యాయి. బీజేపీ సానుభూతిపరులుగా అనుమానించిన వారి అందరి ఓట్లను నిర్మోహమాటంగా తీసేశారు. అలా ప్రతీ నియోజకవర్గంలోనూ వేలాది ఓట్లు గల్లంతయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్రం మొత్తం మీద లక్షలాది ఓట్లు మాయమైనట్లు బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై లెక్క చెబుతున్నారు.
ముమ్మాటికీ రాజకీయ జోక్యమే…
అన్నామలై కోయంబత్తూరు నియోజకవర్గంలో పోటీ చేశారు. అక్కడ ఆయన టఫ్ ఫైట్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. రాజకీయ పార్టీల ప్రమేయంతోనే ఓటర్ల జాబితా నుంచి బీజేపీ సానుభూతిపరుల పేర్లు తొలగించినట్లు అన్నామలై ఆరోపించారు. అధికార డీఎంకే వైపు ఆయన వెలెత్తి చూపించారు. ఎన్నికల ముందు గుట్టు చప్పుడు కాకుండా ఓట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగిందని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.ఇలాంటి చర్యల్లో డీఎంకే నేతలు సిద్ధహస్తులని, గతంలో కూడా అనేక దుష్టాంతాలు ఉన్నాయని ఆయన విశ్లేషించారు…
రీపోలింగ్ నిర్వహించాలంటున్న బీజేపీ
దక్షిణాదిపై ప్రత్యేక దండయాత్ర నిర్వహించిన బీజేపీ పెద్దలు తమిళనాడులోని తాజా పరిణామాలపై దృష్టి పెట్టారు. బీజేపీకి రాష్ట్రంలో పాపులారిటీ పెరగడంతో ఓర్వలేక ఓటమి భయంతో డీఎంకే నేతలు దొంగదెబ్బ తీస్తున్నారని వారు ఆరోపించారు. అసలు ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అనుమానిత ప్రదేశాలను గుర్తించి అక్కడ నియోజకవర్గాల వారీగా రీపోలింగ్ నిర్వహించాలని అన్నామలై అంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం అప్పాయింట్ మెంట్ తీసుకుని కలుస్తామని అప్పుడు జరిగిన అన్ని అవకతవకల మీద ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు. డీఎంకే ఎన్ని కుయుక్తులు చేసినా.. మెజార్టీ ఓట్ షేర్ తమకే వస్తుందని బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారు…