ఎదురులేని బెంగళూరు సూరీడు

బెంగళూరు సౌత్ లో వార్ వన్ సైడ్ అవుతోంది. అక్కడ బీజేపీ జైత్రయాత్ర ఖాయమనిపిస్తోంది. నారాయణ మూర్తి, సుధా మూర్తి, కిచ్చా సుదీప్, నందన్ నీలేకని లాంటి హై ప్రొఫోల్ ఓటర్లున్న బెంగళూరు సౌత్ లో ప్రచారం కూడా హై వోల్టేజీగానే సాగుతోంది. సిట్టింగ్ ఎంపీ తేజస్వీ సూర్యకు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యా రెడ్డి పోటీ కాబోరని తాజా సర్వేలు సైతం చెబుతున్నాయి…..

సూర్య విస్తృత ప్రచారం

బీజేపీ అభ్యర్థి తేజస్వీ సూర్య విస్తృత ప్రచారం చేస్తున్నారు.వీధివీధినా తిరుగుతూ ప్రతీ ఓటరును పలుకరిస్తున్నారు. కాంగ్రెస్ ఐదు గ్యారెంటీలకు, మోదీ గ్యారెంటీకి మధ్య పోటీ అని విశ్లేషణలు వినిపిస్తున్నా… సూర్య ఆ వాదనను అంగీకరించడం లేదు. జనం మోదీ నాయకత్వానికే ఓటేస్తారని ఆయన చెబుతున్నారు. దేశం శక్తిమంతమైన ప్రధానమంత్రిని కోరుకుంటోందని, బెంగళూరు సౌత్ ఓటర్లు కూడా అదే ధోరణిలో ఆలోచిస్తున్నారని సూర్య అంటున్నారు. తనకు ఓటు వేయడమంటే మోదీని ఎన్నుకోవడం లాంటిదని సూర్య ప్రకటించేశారు….

ప్రభుత్వంలో కాంగ్రెస్, ప్రజల్లో బీజేపీ…

ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రాజధాని బెంగళూరులోనే ఆ పార్టీ సరిగ్గా పనిచేయడం లేదు. బెంగళూరులో సౌత్ లో మాత్రం అధికార పార్టీ దయాదాక్షిణ్యాలతో సంబంధం లేకుండా బీజేపీ ప్రజల కోసం పనిచేసుకుంటూ పోతోంది. తేజస్వీ సూర్య దగ్గరుండి మరీ సీనియర్ సిటిజెన్స్ కోసం జనఔషధీ కేంద్రాలను ప్రారంభించారు.. 2019లో 14 కేంద్రాలతో ప్రారంభమైన ఈ వ్యవస్థ ఇప్పుడు 132 కేంద్రాలుగా విస్తరించింది. బెంగళూరు సౌత్లోని అందరు పెద్దలు దీన్ని వినియోగించుకుంటున్నారని తేజస్వీ సూర్య గుర్తుచేస్తున్నారు. ప్రతీ నెల రెండు లక్షల మంది ఈ జన ఔషధీ కేంద్రాలను వినియోగించుకుంటున్నారు. జనం వాటిని మోదీ మెడికల్స్ అని పిలుస్తున్నారు. తన నియోజకవర్గంలో రెండు లక్షల మంది ఆయుష్మాన్ భారత్ కార్డుదారులున్నారని సూర్య గుర్తు చేశారు. గత ఐదేళ్లలో రూ.431 కోట్ల మేర ఉచిత వైద్య సేవలు అందించారు….

కర్ణాటకకు అదనపు నిధులిచ్చిన కేంద్రం…

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తన నియోజకవర్గానికి మాత్రమే కాకుండా కర్ణాటక రాష్ట్రం మొత్తానికి అదనపు నిధులు కేటాయించిందని తేజస్వీ సూర్య చెబుతున్నారు. అన్ని అంతర్జాతీయ ప్రాజెక్టులకు కేంద్రం గ్యారెంటీగా ఉందని ఆయన గుర్తుచేస్తున్నారు. గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం .. కర్ణాటకకు 258 శాతం అదనపు నిధులిచ్చిందని ఆయన చెప్పారు. గత ఆర్థిక సంఘం కంటే ప్రస్తుత ఆర్థిక సంఘం .. కర్ణాటకకు ఎక్కువ నిధులు కేటాయించిందని ఆయన చెప్పుకొచ్చారు. కరువు నివారణ చర్యలకు కేంద్ర ప్రభుత్వం రూ. 650 కోట్లు కేటాయిస్తే వాటిని వినియోగించుకోవడం సిద్దరామయ్య ప్రభుత్వం వల్ల కావడం లేదని సూర్య ఆరోపించారు. బెంగళూరు సబర్బన్ రైలు ప్రాజెక్టు జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని సూర్య అంటున్నారు. దాని కోసం సాంకేతిక నిపుణుల సేవలను వినియోగించుకోవడం లేదన్నారు. ప్రాజెక్టును భారతీయ రైల్వేకు అప్పగిస్తే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు..