ఆ రెండు నినాదాలే గెలిపిస్తాయంటున్న బీజేపీ

బీజేపీ అంటే ప్రజాసంక్షేమం. బీజేపీ అంటే నిశబ్ద విప్లవం. బీజేపీ అంటే మోదీ నాయకత్వంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం. బీజేపీ అంటే నూతన భారతావనిని ఆవిష్కరించడం. ఇప్పుడు జరుగుతున్న పనులు అవే. దేశం కోసం వచ్చే ఐదేళ్లలో చేయబోయేదేమిటో బీజేపీ కళ్లకు కట్టినట్లు చెబుతోంది. ప్రతీ ఎన్నికల ప్రచార సభలోనూ పార్టీ ఆలోచనా విధానం ఆవిష్కృతమవుతోంది…

ఏప్రిల్ 6న పార్టీ వ్యవస్థాపక దినోత్సవం

బీజేపీ 44వ వ్యవస్థాపక దినోత్సవానికి దగ్గరవుతోంది. ఏప్రిల్ 6న పార్టీ పుట్టినరోజు జరుపుకుంటోంది. 1980లో పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నో ఒడుదొడుకులను, ఆటుపోట్లను ఎదుర్కొని పార్టీ ముందుకు సాగింది. ప్రస్తుతానికి ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పార్టీగా అవతరించింది. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించేందుకు అవసరమైన వ్యూహరచనను కూడా చేసుకుంది. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కారు (మరో సారి మోదీ ప్రభుత్వం), అబ్కీ బార్ 400 పార్ ( ఈసారి 400 దాటాలి) లాంటి రెండు నినాదాలను మారు మూల ప్రాంతాలకు కూడా విస్తృతంగా తీసుకు వెళ్లాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు అందాయి.జనంలోకి ఈ నినాదాలను తీసుకు వెళ్లగలిగితే ఎన్డీయేకు 400 సీట్లు రావడం ఖాయమని బీజేపీ విశ్వసిస్తోంది.

క్షేత్రస్థాయి కార్యకర్తలకు ఆదేశాలు

వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలనుకుంటున్న తరుణంలో బీజేపీ అధినాయకత్వం క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులకు ప్రత్యేక ఆదేశాలు అందించింది. ఎవరు ఎక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలో చెప్పేందుకు ఒక జాబితాను రూపొందించి పంపింది. జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర, జిల్లా, బూత్ లెవెల్ వరకు కార్యక్రమాలు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు తమ నివాసాల్లో సైతం బీజేపీ పతాకాన్ని ఎగురవేయాలని ఆదేశించారు. బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించాలని కూడా సూచించారు…

మేథావులకు వివరించండి..

పార్టీ విధానాలు, బీజేపీ ఇంతవరకు నిర్వహించిన కార్యక్రమాలు వివరాలను మేధావులు, తటస్థులకు విస్తృతంగా వివరించాలని పార్టీ నేతలకు ఆదేశాలు అందాయి. విద్యా, సాంకేతిక విజ్ఞానం, సాంస్కృతిక రంగాల్లో మోదీ ప్రభుత్వం చేసిన పనులను వివరించాలని కూడా వారికి సూచించారు. కేంద్రమంత్రులు కూడా కార్యకర్తలతో కలిసి వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకోవాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పారు. జూన్ 1న ఆఖరి దశ ఎన్నికలు ముగిసే వరకు ఎక్కడా ఉదాసీనతకు తావివ్వకూడదని పార్టీ పెద్దలు అంటున్నారు. గెలుపు ఖాయమని, 400 స్థానాలు పొందడమే ఇప్పుడు ముఖ్యమైన అంశమని విశ్లేషిస్తున్నారు.