కాంగ్రెస్ దుస్సాహసం, బీజేపీ దూకుడు….

దేశంలో బీజేపీ ఇప్పుడు తిరుగులేని పార్టీగా అవతరించింది. మోదీని చూసి ఓటేస్తే చాలు.. వేరే ఏ విషయాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని కమలం నేతలు చెబుతున్నారు. మోదీ చేసిన పనులు, మోదీ సిద్ధాంతాలు, మోదీ సంక్షేమం, మోదీ విదేశీ నీతి వీటిని మాత్రం జనం పరిగణిస్తే 400 లోక్ సభా స్థానాలు వస్తాయని బీజేపీ అంచనా వేసుకుంటోంది. ఈ దిశగా మోదీ కూడా రోజుకు మూడు మీటింగుల్లో మాట్లాడుతూ ఓటరు దేవుళ్లను ఆకర్షిస్తున్నారు. అయితే అక్కడే ఒక ట్విస్ట్ ఉంది. పార్టీ వర్సెస్ పార్టీ కాకుండా.. మోదీ వర్సెస్ రాహుల్ అంటూ కాంగ్రెస్ కొత్త చర్చకు తెరతీసే ప్రయత్నంలో ఉంది. అది నిజంగా వైఫల్యం చెందే ప్రయత్నమైనా సరే చావో రేవో అన్నట్లుగా కాంగ్రెస్ ముందుకు కదులుతుంది…

నాడు చౌకీదార్ చోర్ హై నినాదం…

2014 నుంచి రాహుల్ గాంధీ ప్రధాని మోదీని నేరుగా మోదేందుకు ప్రయత్నించి ఫెయిలవుతూనే ఉన్నారు. ఐనా సరే గజనీ మొహ్మద్ లాగే మళ్లీ జనంలోకి వస్తున్నారు. ఆ రోజుల్లో రాహుల్ గాంధీ తరచూ చౌకీదార్ చోర్ హై అనేవారు.. ప్రధాని మోదీ తాను ప్రజలకు కావలిగా ఉన్నానని చెప్పుకున్న తరుణంలో రాహుల్ అలాంటి నినాదాన్ని నెత్తికెత్తుకుని ఫెయిల్ అయ్యారు. చౌకీదార్ అంటే తప్పులేదని.. ప్రజలకు మంచి చేసే ఒక ఉద్యోగమని బీజేపీ జనంలో ప్రచారం చేడయంతో కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో పడిపోక తప్పలేదు. అప్పట్లో రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండి కూడా ప్రభావం చూపలేకపోయారు. పైగా ఆయన తరచూ నవ్వుల పాలయ్యేవారు..

కమలానికి మేలు చేసిన రాహుల్…

రాహుల్ గాంధీ ఏదైనా మాట్లాడినప్పుడల్లా బీజేపీకి వంద ఓట్లు ఎక్కవగా వస్తాయని ఆ పార్టీ నేతలు చెప్పుకునేవారు. కాంగ్రెస్ పార్టీని ముందుకు నడపాల్సిన రాహుల్ గాంధీ తిరోగమన మార్గంలోకి తీసుకువెళ్లారనే చెప్పక తప్పదు. పైగా మోదీని డైరెక్టుగా అటాక్ చేస్తే ఏదో మైలేజీ వచ్చేస్తుందని కాంగ్రెస్ నేతలు భావించడం వల్లే ప్రచారాన్ని మోదీ వర్సెస్ రాహుల్ గా మార్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో 2019 అమేథీ ఎన్నికల్లో రాహుల్ ఓడిపోవడం ఆ పార్టీకి చావు దెబ్బగా మారింది.

మూడో ఎన్నికలో కూడా అదే తంతు…

మోదీ జాతీయ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మూడో ఎన్నిక ఇది. ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా కురువృథుడు మల్లికార్జున్ ఖర్గే ఉన్నారు. ఐనా సరే ప్రచారం మొత్తం రాహుల్ చుట్టూ తిరిగాలనే కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. రెండు దశల ఎన్నికల్లో అదే జరిగింది. మరో ఐదు దశల్లోనూ అదే జరగబోతోంది. మోదీ ప్రచారం చేసిన సబ్కా సాత్, సబ్కా వికాస్ కు తిరుగులేదని తెలిసినా కూడా దానితో రంద్రాన్వేషణకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించి ఫెయిల్ అయ్యింది. మోదీకి రాహుల్ మాత్రమే పోటీ అని చెప్పేందుకు వీలుగా ప్రధాని ప్రసంగించిన ప్రతీ చోట..రెండు మూడు రోజుల్లో రాహుల్ ప్రత్యక్షమై బీజేపీని విమర్శిస్తున్నారు. కాకపోతే రాహుల్ ఏం మాట్లాడుతున్నారో జనానికి అర్థం కావడం లేదు. చివరకు ఇండియా గ్రూపు పార్టీలు కూడా రాహుల్ ను నాయకుడిగా అంగీకరించనప్పుడు.. మోదీతో ఆయనకు పోటీ ఏమిటన్నది ఒక ప్రశ్న..