ఏపీ కాంగ్రెస్ టిక్కెట్ల కోసం భారీ పోటీ ఉన్నట్లుగా ప్రచారం చేస్తున్న షర్మిలకు.. టిక్కెట్లు ఇచ్చిన వారు వద్దంటున్నారు. టిక్కెట్ ఎవరడిగారని ప్రశ్నిస్తున్నారు. ఈ జాబితాలో కీలక నేతలు కూడా ఉన్నారు. ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తనకు టిక్కెట్ అవసరం లేదని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కామెడీ అయిపోయింది.
పోటీ చేసేది లేదన్న సుంకర పద్మశ్రీ
విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి సుంకర పద్మశ్రీ కి టిక్కెట్ ప్రకటించారు. ఆమె ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. తాను విజయవాడ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా పోటీ చేయాలని ఆశించాననని.. కొన్ని కారణాలతో అధిష్టానం అవకాశం కల్పించలేక పోయిందన్నారు. నన్ను సంప్రదించకుండానే విజయవాడ తూర్పు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థినిగా ప్రకటించిందని.. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచన లేదని ప్రకటించారు. నేను తీసుకున్న నిర్ణయానికి అధిష్టానం సహృదయంతో సహకరిస్తుందని భావిస్తున్నానన్నారు.
షర్మిలపై అసంతృప్తితోనే !
షర్మిల పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత తన సొంత పార్టీ అన్నట్లుగా ఆమె వ్యవహరిస్తూండటంతో సుంక పద్మశ్రీ ఫీలయినట్లుగా చెబుతున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పటికీ పద్మశ్రీనిని షర్మిల పరిగణనలోకి తీసుకోలేదు. ఆమెను దూరం పెట్టారు. ఈ కారణంగా పద్మశ్రీ కూడా పెద్దగా కాంగ్రెస్ వ్యవహారాల్లో కనిపించడం లేదు. విజయవాడ పార్లమెంట్ టిక్కెట్ కూడా పద్మశ్రీకి ఇవ్వకపోవడం మరింత దూరం పెంచింది. పెద్ద లీడర్లు ఎవరూ లేకపోయినా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అడిగిన టిక్కెట్ ఇవ్వకపోవడం ఏమిటన్న చర్చ ఆ పార్టీలోనే నడుస్తోంది.
ఎంతో కొంత నిధులు ఇస్తారనే మిగిలిన అభ్యర్థులు బరిలో !
కాంగ్రెస్ పార్టీకి లీడర్, క్యాడర్ లేదు. కానీ కొంత మంది పోటీ చేసేందుకు టికెట్లు అడిగారు. వారికి ఇచ్చారు. అయితే వారు ఇప్పుడు ప్రచారం చేయడం లేదు. పార్టీ నుంచి ఫండ్ వస్తుందని ఎదురు చూస్తున్నారు. నిజానికి ఇలా పోటీ చేసే వాళ్లు అంతా ఎంతో కొంత ఫండ్ వస్తుందని వెనుకేసుకోవచ్చన్న ఉద్దేశంతోనే పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ ఉనికి కనిపించే అవకాశం మాత్రం లేదు.