అమిత్ షా ఫేక్ వీడియో – అసలు నిందితులు జార్ఖండ్ కాంగ్రెస్ ?

కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను ఆపేస్తామంటూ హోంమంత్రి అమిత్ షా చెప్పినట్లుగా ఉన్న ఫేక్ వీడియో ఇంకా సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. ఈ డీప్ ఫేక్ మార్ఫడ్ వీడియో ఎవరు తయారు చేశారనేదానిపై ఢిల్లీ పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురికి సమన్లు కూడా వెళ్లాయి. అయితే ఇప్పుడు మొత్తం వ్యవహారం జార్ఖండ్ కాంగ్రెస్ వైపు తిరుగుతోంది…

ఖాతాను విత్ హెల్డ్ చేసిన ఎక్స్…

జార్ఖండ్ కాంగ్రెస్ కూడా డీప్ ఫేక్ వీడియోలో ఇన్వాల్వ్ అయినట్లు తెలియడంతో సామాజిక మాధ్యమం ఎక్స్ (మునుపటి ట్విటర్) ఆ రాజకీయ సంస్థ ఖాతాను విత్ హెల్డ్ చేసి ఉంచింది. చట్టపరమైన చర్యలకు దిగిన ఢిల్లీ పోలీసులు ఎక్స్ లో వస్తున్న వార్తలపై కూడా దృష్టి పెట్టడంతో తక్షణమే చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. ఎక్స్ వైపు నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినా ఖాతాను పరిశీలించినప్పుడు విత్ హెల్డ్ అని కనిపిస్తోంది.

హారజయ్యేందుకు వెనుకాడుతున్న రాజేష్ ఠాకూర్..

ఫేక్ వీడియోకు సంబంధించి జార్ఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్ కు ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ సమన్లు పంపింది. తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. అయితే ఎన్నికల ప్రచారాన్ని సాకుగా చూపి ఆయన హాజరు కావడం లేదు. ఆయన ఎక్స్ ఖాతా నుంచి ఆ వీడియో షేర్ అయినట్లు కనిపించినా…ఆయన పోలీసుల ముందుకు రావడం లేదు. పైగా తన ల్యాప్ టాప్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తో వాళ్లకు ఏం పని అని ఎదురు ప్రశ్న వేస్తున్నారు. అసలు మొత్తం వ్యవహారం వాటిలోనే ఉంటుందన్న సంగతి ఆయనకు తెలియనట్లుగా ఉంది. అరెస్టు చేస్తారన్న భయంతో ఆయన తప్పించుకు తిరుగుతున్నారని భావిస్తున్నారు…

ఇద్దరిపై జార్ఖండ్ బీజేపీ ఫిర్యాదు…

అమిత్ షా ఫేక్ వీడియో ఇతర రాష్ట్రాల కంటే జార్ఖండ్ లో ఎక్కువగా సర్క్యులేట్ అయినట్లుగా ఢిల్లీ పోలీసులు, బీజేపీ నేతలు గుర్తించారు. దానితో ఆ పనిచేసిన వారెవ్వరన్న దర్యాప్తు కూడా జరుగుతోంది. ఇప్పటి వరకు నలుగురైదుగురు కాంగ్రెస్ నేతలను గుర్తించారు. అందులోనూ జార్ఖండ్ పీసీసీ చీఫ్ రాజేష్ ఠాకూర్ కు ఇప్పటికే ఢిల్లీ పోలీసుల సమన్లు అందాయి. మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలపై రాంచీ పోలీసులకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. వారికి స్థానికంగానే సమన్లు అందే అవకాశం ఉంది.