మోదీ పర్యటించెన్…అయోధ్య పులకించెన్…

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ స్పీడ్ పెంచింది. వరుస సభలు, ప్రచార ర్యాలీలతో హోరెత్తిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. నిన్న ఉత్తర ప్రదేశ్లో ఆయన బిజీగా గడిపారు. సమాజ్‌వాదీ పార్టీ కంచుకోట అయిన ఇటావాలో జరిగిన ర్యాలీలో ప్రధాని ప్రసగించారు. యూపీలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎస్పీ కంచుకోటలైన మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ కుటుంబ సభ్యులు పోటీ చేస్తున్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ ప్రచారం కొనసాగుతోంది.ములాయం సింగ్ యాదవ్ కుటుంబానికి చెందిన అయిదురుగు సభ్యులు లోక్ సభ ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారంటూ మోదీ ప్రశ్నిస్తున్నారు.ఆ తర్వాత ప్రధాని అయోధ్య వెళ్లారు….

ప్రాణప్రతిష్ఠ తర్వాత తొలిసారి…..

భవ్య రామ మందిరాన్ని ప్రధాని మోదీ ఆదివారం సందర్శించి రామ్ లల్లాకు పూజలు చేశారు. జనవరి 22న అట్టహాసంగా జరిగిన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత మోదీ అయోధ్య రామాలయాన్ని సందర్శించడం ఇదే మొదటి సారి. మోదీ రాక సందర్భంగా వీహెచ్పీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆలయ ప్రధాన ద్వారాలకు పుష్పాలంకరణ చేశారు. ఓం ఆకారంలో అవి కనిపించాయి. రాముడి విల్లు, బాణాల రూపంలో కూడా పూలను అలంకరించారు.

140 కోట్ల మంది సంక్షేమం కోసమే…

రామాలయంలో పూజల తర్వాత అయోధ్య నగరిలో ప్రధాని మోదీ భారీ రోడ్ షో నిర్వహించారు. మూడు గంటలకు పైగా జరిగిన రోడ్ షోలో మోదీని చూసేందుకు లక్షలాదిగా జనం తరలి వచ్చారు. రోడ్డుకిరువైపులా నిల్చుని ఆయనకు అభివాదం చేశారు. బిజీ షెడ్యూల్ లో సైతం రామాలయానికి వచ్చినందుకు వారంతా మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. రామాలయ సందర్శనపై ప్రధాని మోదీ ఎక్స్ లో (మునుపటి ట్విట్టర్) ఒక పోస్టు పెట్టారు. రామ్ లల్లా గుడిని సందర్శించి 140 కోట్ల మంది భారతీయుల సంక్షేమం కోసం ప్రార్థించానని మోదీ అందులో ప్రస్తావించారు…మరో మారు ఆలయానికి రావడం తన అదృష్టమని ఆయన చెప్పుకున్నారు..

ఆయన మళ్లీ ప్రధాని కావాలి….

మోదీ అయోధ్య పర్యటనను రామ జన్మభూమి – బాబ్రీ మసీదు కేసు కక్షిదారుడైన ఇక్బాల్ అన్సారీ ఆహ్వానించారు. మోదీ పదేళ్ల పాలనలో దేశం అభివృద్ధి చెందిందని, మరోసారి ఆయన ప్రధాని కావాలని తాను ఆకాంక్షిస్తున్నానని అన్సారీ వెల్లడించారు.రామాలయం నగరం నుంచి ఆయన ఎన్నికల శంఖారావం పూరించినట్లుగా ఉందని ఇక్బాల్ అన్సారీ వ్యాఖ్యానించారు. రామాలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి అన్సారీని కూడా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. 2020లో జరిగిన భూమి పూజ కార్యక్రమానికి కూడా ఆయన హాజరయ్యారు…