అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్లోని 80 నియోజకవర్గాల్లో బరేలీ ఒకటి. అక్కడ చాలా వరకు కమలం పార్టీ జయకేతనం ఎగురవేస్తూ ఉంటుంది. బరేలీ లోక్ సభ పరిధిలోకి ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లు వస్తాయి. బీజేపీకి చెందిన సంతోష్ గంగ్వార్.. ఎనిమిది సార్లు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అయితే ఈ సారి ఆయనకు విశ్రాంతినిచ్చి ఛత్రపాల్ గంగ్వార్ కు పార్టీ నామినేషన్ ఇచ్చారు. సమాజ్ వాదీ పార్టీకి చెందిన ప్రవీణ్ సింగ్ అరోన్ ఆయనపై పోటీ పడుతున్నారు. ఇండియా గ్రూపులో భాగంగా కాంగ్రెస్ మద్దతు ఎస్పీకి ఉంది. ఐనా సరే ప్రయోజనమేమీ లేదని, బీజేపీ పైచేయిగా ఉంటుందని స్థానిక ప్రజలు చెబుతున్నారు…
1989 నుంచి కంచుకోట…
నిజానికి బరేలీ 1989 నుంచి బీజేపీకి కంచుకోటగా ఉంది. వరసగా ఆరు సార్లు గెలిచిన సంతోష్ గంగ్వార్ 2009లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అప్పట్లో గెలిచిన ప్రవీణ్ సింగ్ అరోన్ అప్పుడు సమాజ్ వాదీ పార్టీలో ఉన్నారు. 2014లో మళ్లీ సంతోష్ గంగ్వార్ గెలిచారు. బరేలీని బీజేపీ కంచుకోటగా మార్చడంలో ఆయనదీ కీలక పాత్ర . ఈ సారి బరేలీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి నామినేషన్లో టెక్నికల్ సమస్యలు ఉండటంతో దాన్ని తిరస్కరించారు. దానితో బీజేపీ, సమాజ్ వాదీ మధ్య ముఖాముఖి పోటీ నెలకొంది. ఈ సారి మరో లక్ష మెజార్టీ ఖాయమని బీజేపీ ఎదురుచూస్తోంది.
బీజేపీకే దళిత ఓట్లు…
బీఎస్పీ పోటీలో ఉన్నంత కాలం దళిత ఓట్లు చీలిపోతాయని, తాము విజయం సాధిస్తామని ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ ఎదురుచూశారు. ఇప్పుడు బీఎస్పీ తప్పుకోవడంతో దళితులంతా బీజేపీకి మద్దతిస్తారని తెలిసి ఆయన తలపట్టుకుంటున్నారు. పైగా అనేక మంది సమాజ్ వాదీ పార్టీ నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. ఇక్కడ మరో అంశాన్ని పరిగణించాలి. బీజేపీ అభ్యర్థి ఛత్రపాల్ కంటే ప్రధాని మోదీ పరపతి మీదే ఓట్లు పడతాయని బీజేపీ ఎదురుచూస్తోంది. సగటు ఓటరు కూడా మోదీ గెలుస్తారని చెబుతూ.. బరేలీలో బీజేపీకి ఓటు వేస్తామని అంటున్నారు. రామాలయ అంశం కూడా కొంతమేర పనిచేసే వీలుంది…
అభివృద్ధికే బరేలీ జనం పట్టం
మోదీ చేసిన అభివృద్ధిని చూసి ఓటెయ్యండని బీజేపీ కోరుతోంది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన సంపద పునర్విభజనపై మోదీ ఒక రేంజ్ లో విరుచుకుపడిన తరుణంలో బరేలీలో కూడా అదే అంశం అందరినోళ్లలో నలుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఆలోచనా విధానాన్ని యూపీ ఓటర్లు ఆమోదించడం లేదు. ఆ నియోజకవర్గంలో 30 శాతం ముస్లిం ఓట్లున్నప్పటికీ వారిలో అధికపక్షం ఈ సారి బీజేపీ వైపే ఉన్నట్లు తాజా సర్వేలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ఎంపీగా ఉన్న సంతోష్ గంగ్వార్.. నిత్యం ముస్లింలతో టచ్ లో ఉంటూ వారి సంక్షేమానికి కృషి చేశారు. అక్కడ చెరకు వ్యవసాయం ఎక్కువ. ఇప్పుడు చెరకకు మద్దతు ధర, పంటల బీమా, బోనస్ లాంటి అంశాల్లో బీజేపీ హామీలను రైతులు విశ్వసిస్తున్నారని వార్తలు వచ్చాయి. మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేసినప్పుడు బరేలీ రైతులు సంబరాలు జరుపుకున్నారు.