రాష్ట్రంలో చారిత్రాత్మక ప్రాధాన్యత గల అసెంబ్లీ నియోజకవర్గాల్లో విశాఖ జిల్లా భీమిలికి ప్రత్యేక గుర్తింపు ఉంది. డచ్, బ్రిటిష్ ప్రభుత్వాలకు ప్రధాన వ్యాపార కేంద్రంగా ఇది విలసిల్లింది. అంతేకాక పాండవులు వనవాస కాలంలో ఈ ప్రాంతంలో కొంతకాలం తలదాచుకున్నట్లు పురాణ కథలు చెబుతున్నాయి. విశాఖ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో భీమిలిలోనే అత్యధికంగా 3.61 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఆనందపురం, పద్మనాభం, భీమునిపట్నం, మధురవాడ ప్రాంతాలు ఈ పరిధిలోకి వస్తాయి.
టీడీపీ కంచుకోట భీమిలీ
1983 నుండి 1999 వరకూ 5 దఫాలు టిడిపి ఇక్కడ విజయ కేతనం ఎగరేసింది. పూసపాటి ఆనందగజపతిరాజు ఒకసారి, ఆర్ఎస్డిపి అప్పలనరసింహరాజు నాలుగుసార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2004లో కాంగ్రెస్ గెలిచింది. 2009లో ప్రజారాజ్యం నుంచి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, 2014లో టిడిపి నుంచి గంటా శ్రీనివాసరావు, 2019లో వైసిపి నుండి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గెలిచారు. తాజా ఎన్నికల్లో ముత్తంశెట్టి శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు పోటీపడుతున్నారు. 2019లో విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుండి ఎన్నికైన గంటా….ఇప్పుడు భీమిలికి మారి…. ముత్తంశెట్టితో తలపడుతున్నారు.
భీమిలీలో రెండో సారి పోటీ చేస్తున్న గంటా
పోటీచేసిన నియోజకవర్గంలో స్థానికంగా గంటా ఉండరు. ఒకవేళ అక్కడ గెలిచినా సరే ఇంకోసారి అక్కడ సీటు కోరుకోరు. ఎందుకంటే ఆయనది ప్రత్యేక మంత్రాంగం. భీమిలి నియోజకవర్గంలో ఆలస్యంగా గంటా వచ్చినా వైసిపి అభ్యర్థి ముత్తంశెట్టి వెనుక ఉండే కొద్దిమందిని తనవైపు ఇలాగే లాక్కొన్నారనే విమర్శలు ఎదుర్కొటున్నారు. ఎన్నికల మేనేజ్మెంట్ బాగా తెలిసిన అతి కొద్దిమందిలో గంటా ఒకరు. ఒకే చోట రెండు మూడుసార్లు గంటా మంత్రాంగం చెల్లదు కాబట్టి ఎన్నిక, ఎన్నికకూ వేరొక చోటకి సునాయాసంగా వెళ్లిపోతారు. ఇప్పటికే భీమిలిలో 8వేల మందిని తనవైపు తిప్పుకున్నట్లు గంటా సొంత సోషల్మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. గతంలో అనకాపల్లి ఎంపీగాను, తర్వాత భీమిలి, ఉత్తరంలో ఎంఎల్ఏగా కూడా ఈ మంత్రాంగమే గంటాను గట్టెక్కించిందని అనుచరులు చెప్పుకుంటూంటారు. .
గట్టి పోటీ ఇచ్చేందుకు ముత్తంశెట్టి ప్రయత్నం
స్థానిక శాసనసభ్యునిగా ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు మెరుగైన పరిచయాలున్నాయి. గంటాతో పోల్చితే అంగబలంలో ముత్తంశెట్టి తక్కువ వ్యక్తేమీ కాదు. కానీ ఆయనపై వ్యతిరేకత.. ప్రభుత్వ వ్యతిరేకత.. కూటమి బలం కలిసి ఆయనను వెనక్కు నెడుతున్నాయి. పార్టీ నేతలంతా గంటా ఆకర్ష్ కు పడిపోవడంతో ఆయనకు ఇబ్బందికరంగా మారింది.