అంబటి రాంబాబు మరోసారి గెలుస్తారా? సత్తెనపల్లిలో ఇదీ పరిస్థితి

పల్నాడు జిల్లా సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో తాజా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ), మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. మిగతా అభ్యర్ధులు రంగంలో ఉన్నా.. ప్రధాన పోటీ వీరి మద్యే జరగనుంది. ఇద్దరూ బలమైన నాయకులే కావడంతో పోటీ హోరాహోరీగా ఉంది.

తొలి సారి సత్తెనపల్లి నుంచి కన్నా పోటీ

కన్నా లక్ష్మీనారాయణ 1989 నుంచి 2009 వరకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా, 14 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజనానంతరం ..2014లో.ఆయన గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత 2018లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి… బిజెపిలో చేరి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. 2019 ఎన్నికల్లో బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తూనే నర్సరావుపేట లోక్‌సభ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2020లో బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి కన్నాను తప్పించారు. తరువాత టిడిపిలో చేరారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు జనసేన సానుభూతిపరుల ఓట్లు ఎక్కువగా లభిస్తాయని టిడిపి నాయకులు ధీమాగా ఉన్నారు. వైసిపి ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు నియోజకవర్గంలో తనకు ఉన్న పట్టు వల్ల విజయం లభిస్తుందని కన్నా ధీమా వ్యక్తం చేశారు.

విజయంపై అంబటి రాంబాబు ధీమా

మంత్రి అంబటి రాంబాబు 1989లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి రేపల్లే ఎమ్మెల్యేగా గెలిచారు. 1994లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఓడిపోయారు. 2004లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత ఎపిఐఐసి చైర్మన్‌గా పనిచేశారు. 2009లో వైఎస్‌ మృతి తరువాత ఏర్పడిన వైసిపిలో చేరారు. వైసిపి నుంచి 2014లో మాజీ స్పీకర్‌ కోడెల శివ ప్రసాదరావు చేతిలో ఓడి….. 2019లో ఆయనపైనే గెలుపొందారు. 2022 ఏప్రిల్‌లో జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా శాఖాపరంగా పెద్దగా పట్టు సాధించకపోగా, నియోజకవర్గంలో కూడా చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు జరగలేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. రాజకీయంగా ప్రత్యర్థులపై మాటల దాడి చేయడంలో చురుకుగా వ్యవహరిస్తున్నారనే అపఖ్యాతిని మూటకట్టుకున్నారు.

క్యాడర్ లో అసంతృప్తి

స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వకుండా అధికారాలకు కత్తెర వేయడంతో ప్రజాప్రతినిధుల అసంతృప్తి, సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత, అంబటి నాయకత్వం పట్ల అసమ్మతి ప్రభావం కనిపిస్తోంది. అయినా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని, సిఎం జగన్‌పై ప్రజల్లో విశ్వాసం తగ్గలేదని అంబటి చెపుతున్నారు.