మన దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా తమిళనాడులో పుణ్యక్షేత్రాల సంఖ్య చాలా ఎక్కువ. ప్రతి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. అలాంటి ఆలయాల్లో ఒకటి దారాసుర శ్రీ ఐరావతేశ్వర స్వామి ఆలయం. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తింపు పొందిన దారాసుర ఆలయం పురావస్తుశాఖ నిర్వహణలో ఉంది. తంజావూరు బృహదీశ్వరాలయం నమూనాగా తీసుకుని రెండో రాజరాజచోళుడు నిర్మించిన ఆలయం ఇది. కుంభకోణం పట్టణానికి సమీపంలో ఉన్న ఈ ఆలయం గురించి ఆసక్తి విషయాలు మీకోసం..
స్థలపురాణం
ఇంద్రుని వాహనం అయిన ఐరావతం…దూర్వాస మహర్షి ఇచ్చిన దండను నేలపై వేసి తొక్కేయడంతో శాపానికి గురవుతుంది. తెల్లటి ఏనుగు రంగు మారిపోతుంది. ఆ శాప విముక్తి కోసం ఏనుకు ఈ దేవాలయ పవిత్ర జలాల్లో మునిగి తేలిందట. ఓ యోగి ద్వారా శాపం పొందిన యమధర్మ రాజు తన శరీరం నుంచి వచ్చే మంటను చల్లార్చుకునేందుకు ఇక్కడ జలంలో మునిగి శాపవిమోచనం పొందాడట. అందుకే ఈ ఆలయంలో ఉన్న తీర్థానికి యమ తీర్థం అనే పేరొచ్చిందని చెబుతారు. ఈ సరస్సులో స్నానం చేస్తే చర్మరోగాలన్నీ పోతాయంటారు.
అద్భుతమైన శిల్పకళ
ఐరావతేశ్వరస్వామి ఆలయం శిల్పాలకు చాలా ప్రసిద్ధి. ఆలయ గోపురం 80 అడుగుల ఎత్తులో ఉంటుంది. గర్భాలయంలో పెద్ద లింగ రూపంలో శ్రీ ఐరావతేశ్వర స్వామి…దక్షిణ దిశగా అమ్మవారు శ్రీ పెరియ(దేవ)నాయకి నిలువెత్తు కొలువై ఉన్నారు. ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు శంఖ నిధి, పద్మనిధి శిల్పాలు నల్ల రాతి మీద చెక్కి ఉంటాయి. యలిస్ అనే పౌరాణిక జీవులు ఆలయ స్తంభాలు పై చెక్కి ఉంటాయి. యలిస్ రూపం అంటే… ఏనుగు యొక్క తొండం, ఎద్దు యొక్క శరీరం, సింహం తల, పొట్టేలు కొమ్ములు , పంది చెవులతో ఉంటుంది. రధం ఆకారంలో ఉండే ఆలయానికి రాతి చక్రాలు…వాటిని లాగుతున్నట్టు గుర్రాలు, ఏనుగులను మలిచారు. మండప స్థంభాల పైన చెక్కిన శివకళ్యాణ దృశ్యాలు, శివ పురాణ ఘట్టాలు కన్నులపండువగా ఉంటాయి. నాట్యకళకు చెందిన భంగిమలను అత్యద్భుతంగా చెక్కారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణం మ్యూజియంలో భద్రపరిచిన శిల్పాలను చూడొచ్చు. ఈ దేవాలయంలో సంగీతాన్ని ప్రతిధ్వనింపజేసే రాతి మెట్లు ఉన్నాయి…అదెలా సాధ్యమైందో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే…
ఐరావతేశ్వర స్వామిని భక్తితో దర్శించుకుని వేడుకుంటే సంతానానికి సంబంధించిన దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రానికి చేరుకునేందుకు కుంభకోణం నుంచి బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
గమనిక: పుస్తకాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం