మీ ఆలోచనల పదను తగ్గించే అలవాట్లు ఇవి – వీటికి దూరంగా ఉంటే బెటర్!

చిన్న విషయాలకే చిరాకు పడిపోతారు..అప్పటికప్పుడే మర్చిపోతుంటారు…నిర్ణయాలు తీసుకోవడంతో తడబడతారు..దీనికి కారణం మీ ఆలోచనా విధానమే. అంటే మీ మెదడు పనితీరు సరిగా లేకపోవడమే. ఇందుకు కారణాలేంటో తెలుసా..మీరు అనుసరించే కొన్ని అలావాట్లే..

సరిపడా నిద్రలేకపోవడం
సరైన నిద్రలేకపోవడం మెదడుకి నష్టం కలిగించే మొదటి సమస్య. తగినంత నిద్ర అంటే రోజుకి దాదాపు 8 గంటలు ఉండాలి. ముఖ్యంగా రాత్రి సమయంలో నిద్రపోవాలి…చాలామంది లేట్ నైట్ వరకూ ఫోన్లు, టీవీల్లో కాలక్షేపం చేసి ఏ తెల్లవారుజామునో నిద్రపోతారు. ఫలితంగా ఆలస్యంగా నిద్రలేస్తారు. ఆ ప్రభాలం ఆ రోజులో చేసే పనులపై పడుతుంది…బ్రెయిన్లో చికాకు మొదలవుతుంది. సరైన సమయంలో సరిపడా నిద్రలేకపోతే అల్జీమర్స్ ముప్పు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు..

బ్రేక్ ఫాస్ట్ మానేయవద్దు
రాత్రి లేటుగా నిద్రపోయి ఉదయం లేటుగా నిద్రలేచి..టిఫిన్ స్కిప్ చేస్తుంటారు చాలామంది. కానీ ఇది అస్సలు సరైంది కాదు. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ టైమ్ కి తీసుకున్నప్పుడే కావాల్సిన శక్తి అందుతుంది. పైగా డిన్నర్ – బ్రేక్ ఫాస్ట్ కి మధ్య చాలా గ్యాప్ ఉంటుంది కదా.. అందుకే అస్సలు బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయకూడదు. రక్తంలో చక్కెర స్థాయిలో పడిపోతే ఆ ప్రభావం బ్రెయిన్ పై పడుతుంది.

నీరు తాగాలి
మెదడు సమర్థవంతంగా పనిచేయాలంటే తగినంత నీటితో హైడ్రేటెడ్ గా ఉంచడం చాలా అవసరం. సరిపడా నీరు తాగకపోతే కణాల పనీతీరు క్షీణిస్తుంది. ఫలితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. మీ వయస్సు, బరువు, వాతావరణ పరిస్థితులు, జీవన విధానం బట్టి తగినంత నీరు తాగాలి.

ఒత్తిడికి దూరంగా ఉండండి
దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల మెదడు కణాల పనితీరు మందగిస్తుంది. మెదడు ముందు భాగం కుంచించుకుపోతుంది. ఇది జ్ణాపక శక్తి, ఆలోచన శక్తిని కోల్పోయేలా చేస్తుంది. అందుకే అనారోగ్యంగా ఉన్నప్పుడు బలవంతంగా పనిచేయవద్దు..అనారోగ్యాన్ని సరిచేసే పని మెదడుదే కాబట్టి అదనపు ఒత్తిడికి గురిచేయవద్దు.

ఏకాంతం వేరు ఒంటరితనం వేరు
ఏకాంతంగా ఉండాలి అనుకుంటే ప్రశాంతత పెరుగుతుంది…ఒంటరిగా ఉండాలి అనుకుంటే మెదడుపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ఒంటరిగా ఉండాలి అనుకోవద్దు. ఏదైనా సమస్య ఉంటే మీ సన్నిహితులతో చర్చించి ఓపరిష్కారానికి రండి. పైగా ఒంటరి తనం వల్ల డిప్రెషన్, యాంగ్జైటీ , అల్జీమర్స్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.