కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా ఓటమి భయం పట్టుకుంది. జనంలోకి వెళ్లి తమ వాదనను వినిపించాల్సింది పోయి.. అధికార బీజేపీపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తోంది. ఏదో విధంగా బీజేపీని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తూ..చివరకు తాను ఇరకాటంలో పడిపోతోంది. తాజాగా అమిత్ షా మాట్లాడినట్లుగా వచ్చిన ఒక ఫేక్ వీడియోను కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది..
సోషల్ మీడియాలో బీజేపీ వ్యతిరేక ప్రచారం..
తిమ్మిని బొమ్మిని చేస్తూ కొందరు ఒక వీడియోను ప్రచారంలోకి తీసుకొచ్చారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతున్నట్లుగా ఆ వీడియో ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను త్వరలోనే ఆపేయ్యాల్సి వస్తుందని అమిత్ షా చెప్పినట్లుగా ఆ వీడియోలో ప్రసారమైంది. అయితే ఇదీ ఫేక్ వీడియో అని బీజేపీ కౌంటరిచ్చింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేయడంపై అమిత్ షా ఏమీ మాట్లాడలేదని బీజేపీ తెలిపింది. వైరల్ అవుతున్న వీడియో మొత్తం ఫేక్ అని వెల్లడించింది. అసలు వీడియోలో తెలంగాణలో ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లను తొలగించాలని మాత్రమే అమిత్ షా మాట్లాడారని స్పష్టం చేసింది. పూర్తిగా ఎడిట్ చేసిన వీడియోను వ్యాప్తి చేస్తున్నారని, ఇది పెద్ద ఎత్తున హింసకు దారితీసే అవకాశం ఉందని ఆరోపించారు. వెంటనే వీడియోను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌ల నుంచి డిలీట్ చేయాలని కోరారు.
దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు
రిజర్వేషన్‌ను అంతం చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోందని పేర్కొంటూ కాంగ్రెస్ ఢిల్లీ యూనిట్ల అధికారిక ఖాతాలతో సహా పలు సోషల్ మీడియా ఖాతాల్లో ఆ వీడియో షేర్ చేశారు. అమిత్‌షాకు సంబంధించిన ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హోం మంత్రిత్వ శాఖ, బీజేపీల ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సైబర్ వింగ్ ఈ వీడియోను ఏయే ఖాతాల్లో పోస్ట్ చేశారనే దానిపై విచారణ చేపట్టారు. ఈ మేరకు ఎక్స్, ఫేస్ బుక్‌లకు కూడా లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఈ నకిలీ వీడియోను వ్యాప్తి చేస్తోందని, వారు చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.
రిజర్వేషన్లకు ఆరెస్సెస్ మద్దతు…
ఈ మొత్తం వ్యవహారం బయటకు రావడంతో పాటు రిజర్వేషన్లకు ఆర్సెసెస్ వ్యతిరేకమని కాంగ్రెస్ ఆరోపించింది. దానితో ఆరెస్సెస్ సర్ సంచాలక్ మోహన్ భగవత్ స్వయంగా స్పందించారు. రిజర్వేషన్లు కొనసాగాల్సిందేనని దానికి తాము పూర్తి మద్దతు ఇస్తామని ప్రకటించారు. సమాజంలో హింస ఉన్నంత కాలం రిజర్వేషన్లు కొనసాగాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్లకు సంబంధించి ఆరెస్సెస్ పై జరుగుతున్న ప్రచారం నిజం కాదని కుండబద్దలు కొట్టారు.