కోనసీమలో కూటమికే అడ్వాంటేజ్ – కలసి వస్తున్న పొత్తులు

డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో పట్టు కోసం పార్టీలు కష్టపడుతున్నాయి. పరిస్థితి బాగోలేకపోవడంతో అధికార వైసిపి ఇప్పటికే పలుచోట్ల అభ్యర్థులను మార్చింది. జిల్లాలో మొత్తం 7 అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానం ఉంది. 2014 ఎన్నికల్లో టిడిపి మొత్త ఏడు స్థానాలను, పార్లమెంటు స్థానాన్ని కైవశం చేసుకుంది. వైసిపి ఘోర పరాభవం పొందింది. అనంతరం 2019 ఎన్నికల్లో వైసిపి విజయఢంకా మోగించింది. ఐదు అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానాన్ని గెలుచుకుంది. టిడిపిని ఒకే అసెంబ్లీ స్థానానికి పరిమితం చేసింది. అంతటి ఫ్యాన్‌ గాలిలోనూ మండపేట నుంచి వేగుళ్ల జోగేశ్వరరావు టిడిపి నుంచి గెలుపొందారు. రాజోలులో అనూహ్యంగా జనసేన పార్టీ విజయం సాధించి రాష్ట్రంలో ఒకే ఒక్క సీటును తన ఖాతాలో వేసుకుంది. రాజోలు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన రాపాక వరప్రసాదరావు అనంతర కాలంలో వైసిపి గూటికి చేరారు.

కోనసీమ అల్లర్ల వల్ల వైసీపీపై తీవ్ర వ్యతిరేకత

అమలాపురం పార్లమెంటు స్థానానికి వైసిపి నుంచి రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, టిడిపి నుంచి లోక్‌సభ మాజీ స్పీకరు బాలయోగి కుమారుడు హరీష్‌మాథూర్‌ బరిలో ఉన్నారు. హరీష్‌మాథూర్‌ గతంలో పోటీ చేసి ఓడిపోయారు. అమలాపురం అసెంబ్లీ స్థానానికి వైసిపి నుంచి మంత్రి పినిపే విశ్వరూప్‌, టిడిపి నుంచి మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పోటీలో ఉన్నారు. కోనసీమ అల్లర్లు, అనంతరం కేసుల ఎత్తివేత నేపథ్యంలో విశ్వరూప్‌ పట్ల దళితుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ముమ్మిడివరంలో వైసిపి నుంచి సిట్టింగు ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌, టిడిపి నుంచి దాట్ల సుబ్బరాజు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి మాజీ జడ్‌పిటిసి పాలెపు ధర్మారావు పోటీలో ఉన్నారు. ధర్మారావు తాళ్లరేవు నియోజకవర్గంలో పట్టున్న వ్యక్తి. కొత్తపేట అసెంబ్లీ స్థానానికి వైసిపి నుంచి ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, టిడిపి నుంచి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పోటీలో ఉన్నారు. ఎమ్మెల్యే జగ్గిరెడ్డిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయనపై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి.

పలు చోట్ల సిట్టింగ్‌లకు వ్యతిరేకత

రాజోలు అసెంబ్లీ స్థానానికి వైసిపి నుంచి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, జనసేన నుంచి మాజీ ఐఎఎస్‌ దేవ వరప్రసాదరావు బరిలో ఉన్నారు. పి గన్నవరం అసెంబ్లీ స్థానానికి వైసిపి నుంచి జడ్‌పి ఛైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు, జనసేన నుంచి గిడ్డి సత్యనారాయణ పోటీలో ఉన్నారు. ఇక్కడ టిడిపి టికెట్‌ను తొలుత మహాసేన రాజేష్‌కు కేటాయించారు. ఆయన బరిలో నుంచి తప్పుకోవడంతో టికెట్‌ను జనసేకు ఇచ్చారు. టికెట్‌ను స్థానికులకు ఇవ్వకుండా జనసేనకు కేటాయించడంతో టిడిపి శ్రేణుల్లో అసంతృప్తి ఉంది. మండపేటలో వైసిపి నుంచి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, టిడిపి నుంచి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పోటీలో ఉన్నారు. తోట త్రిమూర్తులు స్థానికేతరుడు, పట్టు లేదు. శిరోముండనం కేసు నేపథ్యంలో ఆయన పట్ల దళితుల్లో వ్యతిరేకత ఉంది. మచంద్రపురం అసెంబ్లీకి వైసిపి నుంచి ఎంపి పిల్లి బోసు కుమారుడు పిల్లి సూర్యప్రకాష్‌ బరిలో ఉన్నారు. టిడిపి నుంచి వాసంశెట్టి సుభాష్‌ పోటీలో ఉన్నారు. సుభాష్‌ తొలిసారి పోటీలో ఉన్నారు.

తోటను కొనసాగిస్తే దళితుల్లో తీవ్ర వ్యతిరేకత

శిరోముండనం కేసులో వైసిపి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు 18 నెలల జైలుశిక్షను విధిస్తూ విశాఖలోని ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసులో ప్రత్యేక న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో కోనసీమ జిల్లాలో వైసిపికి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే దళిత యువకుని హత్యచేసి డోర్‌ డెలివరీ చేశారనే ఆరోపనలతో వైసిపి ఎమ్మెల్సీ అనంత ఉదరుభాస్కర్‌ వ్యవహారంతో కొంత మంది దళితులు వైసిపికి దూరమయ్యారు. తాజాగా తోట ఉదంతంతో వైసిపి మరింత చిక్కుల్లో పడింది. తోట త్రిమూర్తులుకు ప్రస్తుతం మండపేట ఎమ్మెల్యే టికెట్‌ను వైసిపి అధిష్టానం కేటాయించింది. తీర్పు నేపథ్యంలో అధిష్టానం తోటకు సీటును కేటాయిస్తుందా? లేదా వేటు వేస్తుందా? అనే చర్చ సర్వత్రా సాగుతోంది. తోట త్రిమూర్తులుకు సంబంధించిన ఎమ్మెల్సీ ఫైలును గవర్నరు తిప్పి పంపినా, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు.