ద్వితీయ శ్రేణి నేతలకు డబ్బుల పండగ – భారీ ఆఫర్లు ఇస్తున్నపార్టీలు

ఎన్నికలు వస్తే వివిధ పార్టీల నేతలు అటూ ఇటూ చేరిపోతూంటారు. ఎందుకో చాలా మందికి అర్థం కాదు. ఆ చేరికల వెనుక అసలు రాజకీయం ఉంది. అదే ప్యాకేజ్. ఎవరు ఎక్కువగా డబ్బులు ఇస్తే ఆ పార్టీలో చేరిపోతున్నారు నేతులు. ప్రధానంగా టిడిపి, వైసిపిలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకుల కొనుగోలు జోరుగా సాగుతోంది. అప్పటి వరకు ఒక పార్టీలో ఉన్న ఒక చోటా నాయకుడు తెల్లారే సరికి ప్రత్యర్థి పార్టీలో కండువా కప్పుకుంటున్నారు.

వైసీపీ నుంచి కూటమి నేతలకు భారీ ఆఫర్లు

100 ఓట్లు ప్రభావితం చేయగలిగిన ప్రత్యర్థి పార్టీల నాయకులకు రూ.లక్షల తాయిలాలిస్తున్నారు. వీరిలో కొంతమంది చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న వారు, ఆయా పార్టీల్లో ఎదో ఒక హోదాతో ఉంటూనే మొక్కుబడిగా పనిచేస్తున్న వారికి ఇప్పుడు మంచి డిమాండ్‌ వస్తోంది. ప్రధానంగా వివిధ సామాజిక తరగతులను ఎక్కువగా ఆకట్టుకోగలిగితే తాము గెలిచినట్టే అన్న భావనతో భారీగా చేరికలను ప్రోత్సహిస్తున్నారు. వీరి కొనుగోలుకు నాయకులు కృషి చేస్తున్నారు. అసంతృప్తిగా ఉన్నవారిని ఆహ్వానిస్తున్నారు. రాజకీయాలకు దూరంగా ఉండి తటస్టులుగా ఉన్నవారిని సైతం పార్టీలోకి చేర్చుకుంటున్నారు.

గెలిచి తీరాలన్న పట్టుదలతో పార్టీలు

ప్రధాన పార్టీలకు ఈ ఎన్నికలు జీవనర్మణ సమస్యగా మారడంతో ఎట్టిపరిస్థితుల్లో గెలవాలన్న తాపత్రాయంతో ఓటర్ల కంటే ముందు ప్రత్యర్థి పార్టీలోని వివిధ స్థాయి నాయకులకు, కార్యకర్తలకు రెడ్‌ కార్పేట్‌ వేస్తున్నారు. సామాజిక తరగతులతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి ఇతర పార్టీల్లోని ఆయా సామాజిక తరగతుల వారిని ఆకట్టుకుంటున్నారు. నేరుగా పార్టీలో చేరకున్నా ఆయా సామాజిక తరగతులకు సంబంధించిన నాయకులను కలిసి ఈసారికి మీరుమాకు చేయండి… మా ప్రభుత్వం వచ్చిన తరువాత మీకు ఇలా చేస్తాం…అలాచేస్తాం.. మీ సమస్యలను తీరుస్తామని భరోసా ఇస్తున్నారు. కొన్ని సంఘాల నాయకులకు తక్షణం భవన నిర్మాణాలు, ఇతర అవసరాల కోసం కొంత విరాళం కోరుతుండగా వెంటనే ఇచ్చే ప్రక్రియను కూడా చేపట్టారు. గత ఎన్నికల్లో తమకు ఎవరు మద్దతు ఇవ్వలోదో ఆ సామాజిక తరగతులను ఆకట్టుకునేందుకు ఈ సారి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆయాగ్రామాల్లో, పట్టణాల్లోని వార్డుల్లో ఎక్కువ మందిని ప్రభావితం చేయకల్గిన వారిని పిలిపించి తమకు ఈ ఎన్నికల్లో మాకు సాయంచేయండి… గత ఐదేళ్ల కాలంలో మా పార్టీ స్థానిక ప్రజా ప్రతినిధులు, సీటు దక్కని సిట్టింగ్‌ల వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదురైతే పెద్ద మనస్సుతో క్షమించండి అంటూ కాళ్లబేరానికి దిగుతున్నారు.

అన్ని పార్టీల నేతలదీ అదే వ్యూహం

ఈ తరహాలో వైసిపి, టిడిపి అభ్యర్థులు, వారి అనుచరలు, బంధువులు ద్వితీయ శ్రేణి నాయకులను, పార్టీ కార్యకర్తలను ఆకట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. వ్యక్తిగత అంశాలతో పాటు సామాజిక అంశాలపై కూడా టిడిపి వైసిపి నేతలు హామీలు గుప్పిస్గున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జిలు వ్యాపారులను గత ఐదేళ్ల కాలంలో వివిధ రూపాల్లో వేధించారు. వీరు టిడిపి వైపు దృష్టి సారిస్తున్నారని తెలియడంతో వ్యాపారులను వివిద రూపాల్లో మచ్చిక చేసుకుని గతంలో జరిగిన ఘటనలను పునరావృత్తం కాకుండా చూస్తామని పలువురు వైసిపి అభ్యర్ధులు ప్రస్తావిస్తున్నారు. గతంలో తమకు అనుకూలంగా పనిచేయని సామాజిక తరగతులను ఆకట్టుకునేందుకు టిడిపి కూడా తమ పార్టీ అధికారంలోకి వస్తే అది చేస్తాం…ఇది చేస్తాం అని హామీలు గుప్పిస్తున్నారు.