తెలంగాణలోని ఎస్టీ నియోజకవర్గమైన ఆదిలాబాద్ లో బీజేపీ గెలుస్తుందని ఎవరూ అనుకోలేదు. కానీ ఇప్పుడా నియోజకవర్గం బీజేపీకి కంచుకోట. ఏపీలోని అరకు కూడా అలా మారే అవకాశం కనిపిస్తోంది. పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు, అరకు, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాలు అరకు పరిధిలో ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్లతో కూడి ఉన్న ఈ ఎంపి నియోజకవర్గం భౌగోళికంగా చాలా పెద్దది.
బీజేపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీత
అభ్యర్థుల విషయానికొస్తే.. వైసిపి ఎంపి అభ్యర్థిగా గుమ్మ తనూజరాణి, బిజెపి అభ్యర్థిగా కొత్తపల్లి గీత బరిలో ఉన్నారు. టిడిపి, జనసేన బిజెపి కూటమి నుంచి పోటీ చేస్తున్న కొత్తపల్లి గీతపై గిరిజనుల్లో సానుకూత ఉంది. మాజీ ఎంపీగా ఉన్నప్పుడు సేవలు చేశారు. వైసిపి నుంచి అరకు ప్రస్తుత ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ కోడలు డాక్టర్ గుమ్మ తనూజరాణి బరిలో ఉన్నారు. ఆమె రాజకీయాలకు పూర్తిగా కొత్త. పరిచయమైన నియోజకవర్గం కావడంతో కొత్తపల్లి గీత ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
బలంగా వైసీపీ
అల్లూరి జిల్లాలో అరకు, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గతంలో వీటిని వైసిపి కైవసం చేసుకుంది. ప్రస్తుతం అరకు అసెంబ్లీ నుంచి వైసిపి అభ్యర్థిగా రేగం మత్స్యలింగం, కూటమి అభ్యర్థిగా బిజెపి నుంచి పాంగి రాజారావు బరిలో ఉన్నారు. బిజెపి అభ్యర్థికి టిడిపి శ్రేణులు సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. తొలుత ఈ సీటును టిడిపి ఎస్టి సెల్ రాష్ట్ర నాయకులు దొన్ను దొరకు కేటాయించారు. ఆయన రెండు నెలలు పాటు ప్రచారం కూడా చేసుకున్నారు. తర్వాత సీట్ల కేటాయింపులో బిజెపి అభ్యర్థి పాంగి రాజారావును కూటమి తరఫున ప్రకటించారు. వైసిపి అభ్యర్థి రేగం మత్స్యలింగం పార్టీలో గ్రూపుల పోరుతో సతమతమవుతున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమైన సివేరి అబ్రహం కూడా ప్రభావం చూపుతారు. ఆయన మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుమారుడు.
టీడీపీలో కుమ్ములాటలు బీజేపీకి నష్టం చేస్తాయా ?
పాడేరు నియోజకవర్గానికి సంబంధించి వైసిపి అభ్యర్థిగా మత్స్యరాస విశ్వేశ్వరరాజు, టిడిపి అభ్యర్థిగా కిల్లు వెంకట రమేష్ నాయుడు పోటీ చేయనున్నారు. ఈ ముగ్గురు ముమ్మర ప్రచారంలో వారున్నారు. మాజీ ఎమ్మెల్యే, టిడిపి నియోజకవర్గ ఇన్ఛార్జి గిడ్డి ఈశ్వరికి టికెట్ దక్కకపోవడంతో ఆమె ఇండిపెండెంటుగా పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. అదే జరిగితే కూటమి అభ్యర్థికి తలనొప్పి తప్పదు. రంపచోడవరం నియోజకవర్గానికి సంబంధించి టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా మిరియాల శిరీషా దేవిని టిడిపి అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఆమె రాజకీయాలకు పూర్తిగా కొత్త. పార్టీ కోసం ఐదేళ్లపాటు కష్టపడిన మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిని కాదని కొత్త వ్యక్తికి సీటు ఎలా కేటాయిస్తారని రాజేశ్వరి మద్దతుదారులు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద నిరసన వ్యక్తం చేశారు.