తన విజయాన్ని వర్మ చేతుల్లో పెట్టినట్లుగా పవన్ ప్రకటించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచినా పెత్తనం వర్మ దగ్గరే ఉంటుందన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. పిఠాపురం నా ఒక్కడి విజయం మాత్రమే కాదు వర్మ విజయం, కూటమి విజయం, మనందరి సమిష్టి విజయం అంటూ చెబుతూ వస్తున్నారు. ఇలా మొత్తంగా పూర్తిగా వర్మపైనే తన గెలుపు భారాన్ని వేసి పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారు.
వర్మకు ఉన్న ఆదరణ పవన్‌కు ఉపయోగపడుతుందా ?
కాపు నేతలే గతంలో ఎంఎల్ఎగా వద్దంటూ వర్మను వ్యతిరేకించారు. అయితే ఆయనకు బిసిల్లో మంచి పట్టు ఉందన్న అభిప్రాయం జనసేనాని మనసులో ఉంది. దానికి తగ్గట్టుగానే కాపు ఓట్లు తనను చూసి వేసినప్పటికీ బిసి ఓట్లు సమీకరించాలంటే వర్మ మద్దతు తనకు అత్యవసరమని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే వర్మను ప్రసన్నం చేసుకునేదుకు ఆయన పెద్ద స్థాయిలోనే ప్రయత్నం చేస్తున్నారు. అనూహ్యంగా పవన్ కళ్యాణ్ రెండో రోజుకే తన పర్యటనను వాయిదా వేయడం కీలక పరిణామంగా కనిపిస్తుంది.
ఒడిదుడుకుల మధ్య పవన్ పిఠాపురం పర్యటన
ఆయన నాలుగు రోజులపాటు పిఠాపురంలోనే ఉండేందుకు పూర్తిస్థాయి షెడ్యూల్ ఖరారు చేశారు. మొదటిరోజు చేబ్రోలు బహిరంగ సభ, రెండో రోజు ఆత్మీయ సమావేశం, మూడో రోజు బూత్ కమిటీ నాయకులతో సమావేశం, నాలుగో రోజు నియోజకవర్గానికి చెందిన నాయకులతో ఆయన మాట్లాడి పార్టీకి దిశ నిర్దేశం చేయాల్సి ఉంది. దానికి భిన్నంగా తనకు అనారోగ్య సమస్య పేరుతో పవన్ కళ్యాణ్ అనూహ్యంగా వెనుతిరగడం జనసేన శ్రేణులను సైతం ఆశ్చర్యపడేలా చేసింది. ఆయన 4 రోజులు పర్యటన పేరుతో ముందుగా షెడ్యూల్ ఖరారు చేసుకుని ఒకరోజు తర్వాత రెండో రోజుకే మధ్యాహ్నం తర్వాత వెనుదిరికి వెళ్లిపోవడం పట్ల అందరూ భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అధికారికంగా ఆయనకు గొంతు నొప్పి ఉండడంతో వెళ్లాల్సి వచ్చిందని అంటున్నారు. కానీ ఆయన వెళ్లకుండా ఉండాల్సిందన్నది ఎక్కువ మంది అభిప్రాయం.
పిఠాపురానికి సరైన సమయం కేటాయించగలరా ?
పవన్ కళ్యాణ్ పిఠాపురానికి ఎన్నికలకు ముందే సరైన సమయాన్ని కేటాయించకపోతే ఎన్నికల తర్వాత పిఠాపురం వైపు చూస్తారా? లేదా? అనే ప్రశ్నలు ప్రత్యర్థుల నుంచి ప్రారంభం అయ్యాయి. ఎంపీ వంగా గీత లాంటి వారు కూడా ఇదే రీతిలో విమర్శలు ఎక్కు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ రీ షెడ్యూల్ చేసుకుని పూర్తిస్థాయిలో మూడు మండలాల్లోనూ ఏ మేరకు పర్యటిస్తారు? ఎన్ని గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు? ఓటర్లను ఏ రకంగా ప్రసన్నం చేసుకుంటారు? అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజల అభిమానాన్ని ఆయనకు అనుకూలంగా మార్చడంలో వర్మ ఏ మేరకు కృషి చేస్తారన్నది కీలకంగా మారింది.