ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరిన్ని అరెస్టులు తప్పవా ?

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక నిందితులు అరవింద్ కేజ్రీవాల్, కల్వకుంట్ల కవిత ఇద్దరూ తీహార్ జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు. కేజ్రీవాల్ ఎంత సహాయ నిరాకరణ నటించినా… ఈడీ ఆయన నుంచి అనేక అంశాలను రాబడుతోంది. ఈ క్రమంలో కొత్త పేర్లు వినిపించడం, వారిని కూడా ప్రశ్నించాల్సి వస్తుందన్న చర్చ జరుగుతోంది. కేజ్రీవాల్ ఒక్కో విషయం చెబుతుంటే విస్తుపోవడం ఈడీ అధికారుల వంతు అవుతోంది….

ఆ ఇద్దరూ కీలకమే…

కస్టడీలో ఉన్న కేజ్రీవాల్…. ఇప్పుడున్న నిందితులు కాకుండా మరో ఇద్దరి పేర్లు చెప్పినట్లుగా ఈడీ తరపు న్యాయవాది ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రకటించారు. కేజ్రీవాల్ అరెస్టు జరుగుతున్న తరుణంలో తీవ్ర హడావుడి చేసిన ఢిల్లీ మంత్రి అతిషి కూడా అనుమానితురాలేనా అన్న చర్చ మొదలైంది. తనకేమీ తేలీదని అన్ని పనులు అతిషి, సౌరభ్ భరద్వాజ్ చూసుకునేవారని కేజ్రీవాల్ తన విచారణలో వెల్లడించినట్లు సమాచారం. నిందితుడిగా ఉంటూ తర్వాత అప్రూవర్ గా మారిన విజయ్ నాయర్ అన్ని అంశాలను అతిషికి చెప్పేవాడని కేజ్రీవాల్ వెల్లడించారు. నిజానికి విజయ్ నాయర్ , ఆమ్ ఆద్మీ పార్టీలో సాధారణ కార్యకర్త అని చెప్పడానికి వీల్లేదు. ఆయన ఆప్ మీడియా సెల్ ఇంచార్జీగా ఉండేవారు.

కేజ్రీవాల్ ఆఫీసు నుంచే పనులు…

విజయ్ నాయర్ వ్యవహారం తనకు తెలీదని కేజ్రీవాల్ తప్పించుకోవాడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. ఆయన సీఎం క్యాంపు ఆఫీసు నుంచే పనిచేసే వారు. మీడియా సెల్ కార్యాలయం సీఎం ఆఫీసులో ఎందుకు ఏర్పాటు చేశారన్న ప్రశ్నకు కేజ్రీవాల్ సమాధానం ఇవ్వకపోవడంతో ఈడీకి మరిన్ని అనుమానాలు వస్తున్నాయి.విజయ్ నాయర్ కు, ఆప్ నేతలకు మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలను చూపించిన తర్వాత కూడా కేజ్రీవాల్ మౌన వ్రతం వీడలేదు. తన డిజిటల్ పరికరాల పాస్ వర్డ్స్ అధికారులకు చెప్పేందుకు కూడా ఆయన నిరాకరించారు. దానితో అతిషి, సౌరభ్ భరద్వాజ్ ను అరెస్టు చేసి కేజ్రీవాల్ ఎదుట కూర్చోబెడతారన్న అనుమానాలు వస్తున్నాయి….

రాజీనామాకు బీజేపీ డిమాండ్

తాజా పరిణామాల నేపథ్యంలో ఆప్ మంత్రి అతిషి ఒక ప్రకటన చేశారు. మరో రెండు నెలల కాలంలో తమను అరెస్టు చేస్తారని ఆమె చెప్పుకున్నారు. ఒకటి రెండు రోజుల్లో తన నివాసంపైనా, తన కుటుంబ సభ్యులు, బంధువుల నివాసాలపైనా దాడులు జరగడం ఖాయమని ఆమె అన్నారు. అయితే ఇలాంటి ఆరోపణల్లో పసలేదని, తప్పుచేయని వారికి భయమెందుకని బీజేపీ ప్రశ్నిస్తోంది. కేజ్రీవాల్ కంటే లాలూ నయమని, అరెస్టు నేపథ్యంలో పదవికి రాజీనామా చేశారని, కేజ్రీవాల్ ఇంకా సిగ్గు లేకుండా పదవిని అంటిపెట్టుకుని ఉన్నారని బీజేపీ నిలదీస్తోంది….