టిడిపిలో మరోసారి టిక్కెట్ల చిచ్చు రేగింది. ఎచ్చెర్ల సీటుపై ఆశలు పెట్టుకున్న పార్టీ సీనియర్ నాయకుడు కళా వెంకటరావుకు సైతం అధిష్టానం మొండిచేయి చూపింది. ఆ సీటును బిజెపికి కేటాయించడంతో కళా వర్గీయులు మండిపడుతున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాల్లో అసమ్మతి నాయకులకు సీట్లు ఇచ్చి ఇన్ఛార్జీలను పక్కన పెట్టడంతో అక్కడ పార్టీ శ్రేణులు కుతకుతలాడుతున్నాయి.
ఎచ్చెర్లను బీజేపీకి వెళ్లేలా చేసింది అచ్చెన్నేనా ?
ఎచ్చెర్ల స్థానానికి బిజెపి విజయనగరం జిల్లా అధ్యక్షుడు ఎన్.ఈశ్వరరావు పేరును ఖరారు చేసిన జిల్లాకు సంబంధించి కూటమి తరుప పోటీ చేసే అభ్యర్ధుల ఎవరనేది తేలిపోయింది. టిడిపి ఏడు స్థానాల్లో పోటీ చేస్తుండగా ఎచ్చెర్ల సీటును తన మిత్ర పక్షం బిజెపికి కేటాయించింది. 2019 ఎన్నికలతో పోలిస్తే టిడిపి సీట్లలో మూడు చోట్ల మార్పులు చోటు చేసుకున్నాయి. రెండు చోట్ల అభ్యర్థులను మార్చించి. ఒకచోట బిజెపికి ఇచ్చింది. శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పోటీ చేయగా, ప్రస్తుతం ఆ స్థానాన్ని పార్టీ నాయకుడు గొండు శంకర్‌కు కేటాయించింది. అదేవిధంగా 2019 ఎన్నికల్లో పాతపట్నం నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు పోటీ చేయగా, ఇప్పుడు ఆ స్థానాన్ని మామిడి గోవిందరావుకు కేటాయించింది. సీట్ల సర్దుబాటులో భాగంగా ఎచ్చెర్ల స్థానాన్ని బిజెపికి కేటాయిండచంతో గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన టిడిపి సీనియర్ నాయకుడు కళా వెంకటరావు జిల్లాలో ఏకంగా సీటే దక్కని పరిస్థితి వచ్చింది.
అచ్చెన్న వల్లే ఇదంతా ?
టిక్కెట్ల కేటాయింపులో అచ్చెన్న మార్కు రాజకీయం కనిపిస్తోందనే చర్చసాగుతోంది. తమకు నేతలకు టిక్కెట్లు రాకపోవడానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడే కారణమనే భావన మూడు నియోజవర్గాల కేడర్‌లో నెలకొంది. టిక్కెట్ల ప్రకటన తర్వాత పాతపట్నం, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో నిర్వహించిన అసమ్మతి సమావేశాల్లో పార్టీ ఇన్‌ఛార్జీలతో పాటు నాయకులు సైతం బహిరంగానే మాట్లాడటం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. తమకు టిక్కెట్ రాకపోవడానికి అచ్చెన్నాయుడే కారణమంటూ బహిరంగంగానే చెప్పారు. ఆత్మీయ సమావేశాలకు వెళ్లొద్దంటూ అచ్చెన్నాయుడు ఫోన్ చేసిన అంశాన్నీ వారు సమావేశాల్లో ప్రస్తావించారు. కళా వెంకటరావుకు సీటు కేటాయించకపోవడంతో ఆయన వర్గీయులు కుతకుతలాడుతున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి స్థానాన్ని ఆయనకు కేటాయిస్తారనే ప్రచారం సాగుతోంది. నియోజకవర్గంలో పట్టున్న తమ నేతను అక్కడకు పంపడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. నియోజకవర్గంలో ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న తమ పరిస్థితి ఏమిటని నాయకులు ప్రశ్నిస్తున్నారు.
జిల్లాపై పట్టు సాధించేందుకే అచ్చెన్న రాజకీయం ?
కళా వెంకటరావును పొరుగు జిల్లాకు పంపడం, శ్రీకాకుళం, పాతపట్నం స్థానాల్లో కొత్త అభ్యర్థులను నిలబెట్టడం అందులో భాగమని వారు చెప్తున్నారు. జిల్లాలో తన కంటూ ఒక ప్రత్యేకవర్గం సృష్టించుకోవాలన్న ఆలోచన అందులో అంతర్లీనంగా దాగుందని వారు అంటున్నారు. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, పలాస ఇన్‌ఛార్జి గౌతు శిరీష, నరసన్నపేట ఇన్‌ఛార్జి బగ్గు రమణమూర్తి మాత్రమే ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటున్నారు. ఎచ్చెర్ల, శ్రీకాకుళం, పాతపట్నం ఇన్ఛార్జీలు మాత్రం స్వతంత్య్రంగా వ్యహరించడం ఆయనకు కంటగింపుగా మారింది. దీంతో పాటు తన వెంట ఇంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పుకోవడానికీ ఉండాలనే ఉద్దేశంతో ఆయన మాటను ఖాతరు చేయని వారిని తప్పించారనే చర్చ జరుగుతోంది. ఏదేమైనా అచ్చెన్న వ్యవహారశైలితో తమ పార్టీకి నష్టం వాటిల్లే అవకాశాలు లేకపోలేదని పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.