తెలంగాణ కాంగ్రెస్‌లో అంతే.. ఆలూ లేదు చూలూ లేదు దళిత సీఎం నినాదం !

అసలు గెలుస్తారో లేదో తేలియదు కానీ.. పదవుల కోసం తాములో కొట్లాడుకోవడంలో ముందు ఉంటారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే ఆ పార్టీలో ఎన్ని వర్గాలున్నాయో తెలియదు కానీ ఇప్పుడు కొత్తగా దళిత సీఎం అనే వాదన తీసుకు వచ్చారు. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేందుకు చాలాకాలంగా ప్రయత్నిస్తున్న సీనియర్లు ఇప్పుడీ వాదన తెరపైకి తీసుకు రావడంతో మరో చిచ్చుపెట్టినట్లయింది.

రేవంత్‌కు పోటీగా మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర

రేవంత్ రెడ్డితో పాటు మల్లు భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేస్తున్నారు. ‘ పీపుల్స్‌ మార్చ్‌ ‘ పాదయాత్రలో భాగంగా మంచిర్యాలలో బహిరంగ సభ నిర్వహించారు ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలంతా దళిత వాదం పైనే మాట్లాడారు. దళిత సీఎం హామీ, మూడు ఎకరాల భూ పంపిణీ ఏమైంది..? పోడు భూముల సమస్యతో పాటు కేసీఆర్‌ మంత్రి వర్గంలో సామాజిక న్యాయం కొరవడిందంటూ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నాయకులు తీవ్ర విమర్శలు చేయడం కనిపించింది. తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే మొదటి సీఎం దళితుడేనని హామీ ఇచ్చి దళిత వర్గాలను మోసం చేశారని విమర్శిస్తున్నామని, అదే కాంగ్రెస్‌లో దళిత సీఎం నినాదం తీసుకుంటే దళిత ఓటు బ్యాంక్‌ ఏకపక్షంగా పడుతుందని ఖర్గేకు సీనియర్లు చెప్పినట్లుగా తెలుస్తోంది.

రేవంత్ రెడ్డికి చెక్ పెట్టే వ్యూహమేనా ?

రేవంత్ రెడ్డితో సరిపడని కాంగ్రెస్ నేతలు… చాలా మంది ఈ సభకు హాజరయ్యారు. వారంతా భట్టి పాదయాత్రను వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి యాత్రతో పోల్చారు. ‘ భట్టిని చూస్తే వైఎస్‌ను చూస్తున్నట్లే అనిపిస్తోంది. వైఎస్‌ మాదిరిగానే భట్టి కూడ మండే ఎండలో పాదయాత్ర చేస్తున్నారు. ప్రజల కష్టాలను తెలుసుకుని ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం ” అని చెప్పుకొచ్చారు. అంటే ఎలాంటి పాజిటివ్ రిజల్ట్ వచ్చినా భట్టి ఖాతాలో వేసి రేవంత్ కు చెక్ పెట్టాలని ప్లాన్ చేసుకున్నారని
ఆయన వర్గీయులు అనుమానపడుతున్నారు.

దళిత సీఎం వాదనకు మద్దతుగా ఢిల్లీలో లాబీయింగ్ చేస్తారా ?

రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇతర సీనియర్లందరు ఒకటిగా జట్టు కట్టారు. వీరందరూ దళిత సీఎం నినాదాన్ని మేనిఫెస్టోలో పెడితే బాగుంటుందని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారని చెబుతున్నారు. రేవంత్ రెడ్డికి చెక్ పెట్టడానికి ఇంత కన్నా గొప్ప అవకాశం దొరకదని అనుకుంటున్నారు. అసలు ఎన్నికల్లో గెలుస్తారో లేదో ఎవరికీ తెలియదు కానీ వీరి హడావుడి చూసి మాత్రం.. కాంగ్రెస్ ఎప్పటికీ మారదని క్యాడర్ గొణుక్కుంటోంది.