టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వెనుక పెద్దలు ? ఈడీ విచారణను ఎందుకు అడ్డుకుంటున్నారు ?

టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీక్ కేసులో ప్రభుత్వపెద్దల ప్రమేయం ఉందని సీబీఐ విచారణ జరిపించాల్సిందేనని విపక్షాలు కోర్టుల్లో సైతం పోరాడుతున్నాయి. ఇప్పుడు ఆ అనుమానాలకు బలం చేకూర్చేలా ఘటనలు జరుగుతున్నాయి. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ కు వివరాలు ఇవ్వడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం నిరాకరిస్తోంది. కానీ ఇదే సిట్… రాజకీయ ఆరోపణలు చేసిన బండి సంజయ్ కు.. రేవంత్ రెడ్డికి సాక్ష్యాలు కావాలని నోటీసులు జారీ చేసింది. పేపర్ల లీక్ కేసులో పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగిందనే సాక్ష్యాలు ఉన్నాయని.. సిట్ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదని నాంపల్లి కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది.

ఈడీ దర్యాప్తును ఎందుకు తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటోంది ?

కేసు సమాచారం ఇవ్వాలని సిట్‌ను ఈడీ కోరింది. కానీ సిట్ పట్టించుకోలేదు. ESIR నమోదు చేసిన తరువాత కేసులో ఆర్థిక లావాదేవీలపై ఈడీ దృష్టి పెట్టింది. టీఎస్‌పీఎస్‌సీ నిందితుల వద్ద నుంచి సిట్ 7లక్షలు సేకరించింది. 40లక్షలు డబ్బులు చేతులు మారాయని గుర్తించింది. ఆ డీటైల్స్ ఇవ్వడానికి కూడా నిరాకరిస్తున్నారు. అసలు నిందితులు వేరే ఉన్నారని కింది స్థాయి ఉద్యోగుల్ని బలి చేస్తున్నారన్న అనుమానాలు ప్రజల్లోనూ బలంగా ఉన్నాయి. అసలు శంకరలక్ష్మి అనే కాన్ఫిడెన్షియల్ డెస్క్ ఇంచార్జ్ కంప్యూటర్‌ నుంచే ప్రశ్నపత్రాలు లీక్‌ అయ్యాయి. కానీ ఆమెను సాక్షిగానే పెట్టారు.

నిజాలు బయటకు వస్తే ఎవరికి ప్రమాదం ?

ఈ కేసులో ఇతర విషయాలకు సంబంధించిన వివరాలను కూడా తమకు అప్పగించాలని ఈడీ లేఖ రాసింది. గ్రూప్‌-1 పరీక్ష పత్రాన్ని ముందుగానే అందుకొని, విదేశాల నుంచి వచ్చి పరీక్ష రాయడం, లక్షల్లో డబ్బులు చేతులు మారాయనే అనుమానంతో ఈడీ ఈ కేసులోకి ఎంట్రీ ఇచ్చింది. టీఎస్‌పీఎస్సీ వ్యవహారంలో ఇప్పటి వరకు 17 మందిని సిట్‌ అరెస్టు చేసింది. ఇంకా అధికమొత్తంలో డబ్బులు చేతులు మారి ఉంటాయోమోనని ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈడీని అడ్డుకుని ఎవర్ని కాపాడాలనుకుంటున్నారు ?

ఈడీ విచారణ ప్రారంభిస్తే.. సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయని విపక్షాలు చెబుతున్నాయి. ఇది చిన్న స్కాం కాదని 30 లక్షల మంది తెలంగాణ నిరుద్యోగుల్ని బలి పశువులు చేసి.. వందలకోట్లు దోచుకునే ప్రణాళిక అని అంటున్నారు. సీబీఐ దర్యాప్తు వద్దని సిట్ కోర్టులో గట్టిగా వాదిస్తోంది. అదే సమయంలో ఈడీకి వివరాలు ఇవ్వడం లేదు. అంటే.. ఇక్కడే అసలు నిందితులెవరో తెలిసిపోతోందన్నమాట.