Abdullahpurmet Case: తెలంగాణలోని అబ్దుల్లాపూర్‌మేట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రియురాలి కోసం స్నేహితుడిని అత్యంత దారుణంగా హతమార్చిన ఘటనతో రాష్ట్రం ఉలిక్కిపడింది. ఈ హత్య కేసులో ఇప్పటి వరకూ ప్రతిరోజూ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. నిందితుడు హరిహరకృష్ణ, అతని స్నేహితుడు హసన్, నిహారికను పోలీసులు విచారించారు. అయితే ఒక్కరంటే ఒక్కరూ విచారణకు సహకరించకట్లేదని పోలీసులు చెబుతున్నారు. బుధవారం నాడు నవీన్ హత్య దర్యాప్తులో పోలీసులు విస్తుపోయే నిజాలను వెలుగులోకి తెచ్చారు. హత్య తరువాత నిందితుడు తన స్నేహితుడు హసన్, స్నేహితురాలు నిహారిక, తండ్రికి ఘటన గురించి చెప్పాడని పోలీసులు తేల్చారు.
నవీన్ హత్య కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లోని కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. ఈ కాపీని హయత్‌నగర్ కోర్టుకు సమర్పించారు. దాని ప్రకారం.. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఐడియల్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదివే సమయంలో నవీన్, ఓ యువతి ప్రేమించుకున్నారు. ఇద్దరూ సన్నిహితంగా మెలిగేవారు. ఆ తర్వాత గొడవలు జరగడంతో.. రెండేళ్ల కిందట విడిపోయారు. ఈ సమయంలో హరిహరకృష్ణ ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. తర్వాత నవీన్, ఆ అమ్మాయికి తరచూ ఫోన్లు, మెసేజ్‌లు చేస్తుండేవాడు. దీంతో నిందితుడు నవీన్‌పై కక్ష పెంచుకుని.. అతణ్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడని హయత్‌నగర్ కోర్టుకు సమర్పించిన ఎఫ్‌ఐఆర్ కాపీలో అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు పేర్కొన్నారు. నవీన్‌ను హరిహరకృష్ణ హత్య చేసిన తీరు గురించి కూడా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో వివరించారు.
నిందితుడు హరిహర కృష్ణను ఏడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి 9 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. చర్లపల్లి జైలులో వున్న నిందితుడిని మరికాసేపట్లో పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. హత్య జరిగిన ప్రదేశంలో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయడంతో పాటు నవీన్ హత్యలో ఒక్కడే పాల్గొన్నాడా ? హత్యకు ఎవరైనా పరోక్షంగా సహకరించారా ? అని హరిహర కృష్ణ నుండి సమాచారాన్ని పోలీసులు సేకరించనున్నారు. కస్టడీ విచారణలో హరిహర కృష్ణ ఇచ్చే వివరాల ఆధారంగా…అతని స్నేహితుడు హసన్, స్నేహితురాలు నిహారికను మరోసారి ప్రశ్నించనున్నారు. హత్య జరిగాక.. ఎవరెవరికి హత్య విషయం చెప్పాడు అన్నది తెలిస్తే…వారు పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని పోలీసులు తెలుసుకోనున్నారు. హత్య విషయం తెలిసి కూడా చెప్పని వారిపై న్యాయపరమైన చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు. నవీన్‌ను అంత దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఏముందని పోలీసులు ఆలోచిస్తు్న్నారు. తన ప్రియురాలి కోసమే ఈ హత్య చేశానని హరిహర కృష్ణ అంటున్నాడు.