బీజేపీలోకి యువరాజ్ సింగ్…?

ఆయన ఒకే ఓవర్లో ఆరు సిక్సులు కొట్టిన సంచలన క్రికెటర్. మైదానంలోకి దిగాడంటే పరుగుల వరద పారించగల క్రీఢా ధీరుడు. కేన్సర్ ను సైతం జయించి ఆయన నిలదొక్కుకున్నాడు. ఇప్పటికీ అవకాశం ఇస్తే అలవోకగా సెంచురీలు చేయగల దిట్ట.దేశం మొత్తం అభిమానజనం ఉన్న బహుకొద్దిమంది క్రికెటర్లలో ఆయన కూడా ఒకరు. రిటైరై చాలా రోజులైనా ఇప్పటికీ ఆయన పట్ల జనంలో అభిమానం తగ్గలేదు. ఇప్పుడాయన రాజకీయాల వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయనే పంజాబ్ క్రికెటర్ యువరాజ్ సింగ్….

బీజేపీలో చేరే ప్రయత్నం

యువరాజ్ సింగ్ కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. వారం పది రోజుల్లోనే దానిపై క్లారిటీ వస్తుందని అనుకుంటున్నారు. ఇద్దరు ముగ్గురు బీజేపీ నేతలతో ఆయన టచ్ లో ఉన్నట్లు ఢిల్లీ, పంజాబ్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ పంజాబ్ అధ్యక్షుడు సునీల్ జాఖర్, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తో ఆయన ఇప్పటికే మాట్లాడారని వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం కేంద్ర రవాణా మంత్రి నితీన్ గడ్కరీతో కూడా యువరాజ్ భేటీ అయ్యారు. అప్పుడు దేశ రాజకీయాలు చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు…

గుర్దాస్పూర్ నుంచి పోటీచేసే అవకాశం

యువరాజ్ సింగ్ ను పార్టీలో చేర్చుకుని లోక్ సభకు పోటీ చేయించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఆయనకు గుర్దాస్పూర్ స్థానాన్ని కేటాయించేందుకు అభ్యంతరం ఉండదని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అక్కడ ప్రస్తుతం ధర్మేంద్ర కుమారుడైన నటుడు సన్ని డియోల్ , బీజేపీ ఎంపీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి చూపడం లేదు. పైగా నియోజకవర్గాన్ని పట్టించుకోలేదన్న అపవాదు సన్ని డియోల్ పై ఉంది. సినిమాలపై దృష్టి పెట్టి ఆయన ప్రజా సేవను వదిలేశారు…

అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్..

బీజేపీకి పంజాబ్ లో దీర్ఘకాలిక ప్రణాళికలున్నాయి. ఇప్పటికే రైతు ఉద్యమాల కారణంగా పంజాబ్ లో బీజేపీ కొంత దెబ్బతిన్నదన్న చర్చ జరుగుతోంది. దానితో రైతులను మళ్లీ చర్చలకు పిలిచింది. వారిని సమాధానపరిచేందుకు ఎన్ని సార్లయినా చర్చలు జరుపుతామని కేంద్ర ప్రభుత్వం అంటోంది. ఈ నేపథ్యంలోనే పంజాబ్ లో నూతన, యువ నాయకత్వం కోసం పార్టీ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. యువరాజ్ ను చేర్చుకుంటే రాష్ట్రమంతా ప్రయోజనం ఉంటుందని ప్రస్తుతానికి ఎంపీ పదవి ఇచ్చి తర్వాత రాష్ట్ర పర్యటనకు పంపే వీలుంటుందని లెక్కలేసుకుంటున్నారు..అసెంబ్లీ ఎన్నికల వ్యూహంలో ఆయన్ను కూడా భాగస్వామిని చేసే వీలుంటుందని కూడా అంచనా వేసుకుంటున్నారు…