ఏపీ బీజేపీలో కొత్త కమిటీలు వేసిన తర్వాత పరిస్థితి స్తబ్దుగా మారిపోయింది. చివరికి తమ పార్టీ అధ్యక్షురాలిపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నా ఖండించలేకపోతున్నారు. ఎన్నికల సమయంలో దున్నేయడానికి ఏర్పాటు చేసిన కమిటీలోని నేతలు అందరూ సైలెంట్ గా ఉంటున్నారు. ప్రధాన కార్యదర్శలు ఎవరికీ ఫేస్ వాల్యూ లేకపోవడంతో… వారు ప్రెస్ మీట్ పెడతామన్నా పట్టించుకునేవారు లేకుండా పోయారు. దీంతో పురందేశ్వరిపై వైసీపీ నేతలు మరింతగా విమర్శిస్తున్నారు.
పురందేశ్వరిపై వరుసగా విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలు
వైసీపీ నేతలు పురందేశ్వరిని టీడీపీ ఏజెంట్, కోవర్టు అని విమర్శించడం ప్రారంభించారు. నిజానికి చంద్రబాబు తో దగ్గుబాటి కుటుంబానికి సత్సంబంధాలు లేవు. చంద్రబాబుకు వ్యతిరేకంగా దగ్గుబాటి చాలా కాలం వైసీపీలో పని చేశారు. ఇప్పుడు దగ్గుబాటి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ పురందేశ్వరి బీజేపీ తరపున యాక్టివ్ గా ఉన్నారు. ప్రభుత్వం పై పోరాడుతున్నందున ఇప్పుడు మళ్లీ టీడీపీ కోవర్టు, ఏజెంట్ అనే ఆరోపణలు ప్రారంభించారు. వైసీపీపై ఎదురుదాడి చేయాల్సిన బీజేపీ నేతలు సైలెంట్ అయిపోయారు. కొత్త కమిటీలో పదవులు పొందిన వారు… పనితీరుతో కాకుండా వివిధ సమీకరణాలతో పదవులు పొందడంతో ఆ పదవులతో ఏం చేయాలా అని ఆలోచిస్తూనే ఉన్నారు కానీ… రాజకీయంగా అడుగు ముందుకు వేయలేకపోతున్నారు.
పాత కమిటీ ఉన్నప్పుడు గట్టిగా జవాబిచ్చిన నేతలు
హైకమాండ్ ఆదేశాలతోనే తాను ప్రభుత్వ అక్రమాలపై పోరాడుతున్నానని పురందేశ్వరి చెబుతున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీ నేతలంతా ఏకతాటిపైన ఉండి పురందేశ్వరిపై మరోసారి విమర్శలు చేయకుండా ఎదురుదాడి చేయాల్సి ఉంది. పురందేశ్వరి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆర్థిక అక్రమాలపై ప్రశ్నించినప్పుడు ఇలాగే ఎదురుదాడి చేశారు. ఆ సమయంలో విష్ణువర్ధన్ రెడ్డి వంటి నేతలు.. వైసీపీపై విరుచుకుపడ్డారు. గుడివాడ అమర్నాథ్ తో పాటు ఇతరులకూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఎవరూ మాట్లాడలేని పరిస్థితికి వెళ్లిపోయారు.
సాఫీగా సాగిపోయే బీజేపీ పనితీరు దెబ్బతినిందా ?
గతంలో బీజేపీ పని తీరు సాఫీగా ఉండేది. ప్రణాళిక ప్రకారం అనుకున్న పనులు చేసేవారు. ప్రజల్లోకి వెళ్లేవారు. ఇప్పుడు పూర్తిగా ఆ వ్యవస్థ దెబ్బతిన్నట్లుగా కనిపిస్తోంది . పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే వారు పెద్దగా కనిపించడం లేదు. ప్రజల్లో పలుకుబడి లేని వారికి ప్రాధాన్యం ఇవ్వడం… విపక్షాలు బీజేపీ నేతలపై చేసే ప్రచారాలకు ప్రభావితం కావడంతోనే అసలు సమస్య వచ్చిందని భావిస్తున్నారు. చివరికి తమ పార్టీ అధ్యక్షురాలిపై వస్తున్న విమర్శల్ని తిప్పికొట్టే వారు కూడా పెద్దగా బయటకు రావడం లేదు.