స్టార్ హీరోలకు వెట్రిమారన్ సెట్ అవుతాడా.?

వెట్రిమారన్. తమిళ్ లో తోపు డైరెక్టర్. ఇంకా చెప్పాలంటే సినిమాల్ని బాగా నాటుగా తీసే పోటు డైరెక్టర్. మన తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియక పోవచ్చు కానీ… తమిళ్ లో వెట్రిమారన్ సినిమాలు అంటే ఆడియన్స్ పడి చచ్చిపోతారు. సినిమా తీశాడంటే అవార్డులు గ్యారంటీ. రజనీకాంత్ అల్లుడు ధనుష్ కు రెండు సార్లు ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారాలు వచ్చాయంటే అది వెట్రిమారన్ చలవే. గతంలో అరవ ఇండస్ట్రీలో ఇలాంటి ఊర నాటు సినిమాలు డైరెక్టర్ బాలా తీసేవాడు. ఇప్పుడు బాలా రేసులో వెనకబడిపోవడంతో… వెట్రిమారన్ లైన్ లోకి వచ్చాడు. లేటెస్ట్ గా వెట్రిమారన్ విడుదల అనే సినిమాను రెండు పార్ట్ లుగా తీశాడు. అందులో మొదటి పార్ట్ తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయ్యింది. వెట్రిమారన్ టేకింగ్ గురించి, ఆయన సినిమాలు ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి అరవ ఆడియన్స్ బాగానే కనెక్ట్ అయ్యారు. కానీ తెలుగు ఆడియన్స్ కు మాత్రం విడుదల పార్ట్ 1 పెద్దగా ఎక్కలేదు. రిలీజ్ కు ముందు పెద్దగా బజ్ కూడా లేదు.

హీరోల ఫేవరెట్ డైరెక్టర్
వెట్రిమారన్ హీరోల కోసం సినిమాలు తీయడు. తన కథకు ఎవరు సెట్ అవుతారో చూసుకుని వారితోనే సినిమాలు చేస్తుంటాడు. మ్యాగ్జిమమ్ తన సినిమాలు, కథలు, అందులో పాత్రలు అన్నీ చాలా నేచురల్ గా ఉండేలా చూసుకుంటాడు. ఇదే వెట్రిమారన్ ని అందరి హీరోలకు ఫేవరెట్ దర్శకుడిగా మార్చేసింది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా వెట్రిమారన్ కు అభిమానే. అవకాశం వస్తే ఆయన దర్శకత్వంలో చెయ్యాలని ఉందని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక ఎన్టీఆర్ కూడా వెట్రిమారన్ మంచి దర్శకుడు అని చాలా సార్లు చెప్పాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వెట్రిమారన్ తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడు కానీ ఇంకా ఫైనల్ అవ్వలేదు. ఇలా స్టార్ హీరోలంతా వెట్రిమారన్ కోసం, ఆయన డైరెక్షన్ చేయడం కోసం ఎదురుచూస్తుంటారు

స్టార్ హీరోలకు హిట్టవ్వగలడా?
వెట్రిమారన్ సినిమాలు అన్నీ చాలా నేచురల్ గా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే రస్టిక్ గా ఉంటాయి. దీంతో ఆయనతో సినిమాలు చేయాలని హీరోలు అంటూ ఉంటారు కానీ ఎవ్వరూ చేయరు. అటు తమిళంలో కూడా ధనుష్ తప్ప వెట్రిమారన్ తో సినిమాలు చేసిన స్టార్ హీరో లేడు. ఎందుకంటే స్టార్ ల కోసం ఈ డైరెక్టర్ కథలు రెడీ చెయ్యడు. సమాజంలో జరిగిన వాస్తవాలనే కథలుగా మారుస్తుంటాడు. ఇలాంటి కథలు స్టార్ హీరోలు అంగీకరించే పరిస్థితి ఉండదు. ఒకవేళ చేసినా… దానిలో వేలు పెట్టి, నాలుగు ఫైట్లు, మూడు పాటలు, రెండు రొమాంటిక్ సీన్లు అన్నీ మొత్తం చెడగొట్టేస్తారు. అందుకే ఈ నేచురల్ డైరెక్టర్ స్టార్ హీరోల జోలికి పోడు. అటు స్టార్ హీరోలు కూడా సూపర్బ్ డైరెక్టర్ అని వెట్రిమారన్ ని పొగిడేసి పక్కకు వెళ్లిపోతుంటారు.