ఏలూరు పార్లమెంట్ పరిధిలో కూటమి దూకుడు – క్లీన్ స్వీప్ చేస్తుందా ?

ఏలూరు జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలు, ఒక ఎంపీ స్థానం ఉన్నాయి. ఈ స్థానాల్లో గత ఎన్నికల్లో వైసిపి ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంట్‌ స్థానాన్ని కైవసం చేసుకుని క్లీన్‌స్వీప్‌ చేసింది. ఈసారి ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమిగా ఎన్నికల బరిలోదిగాయి. వైసిపి ఒంటరిగా ముందుకు సాగుతోంది. ఇరుపార్టీలు అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయడంతో ఎన్నికల బరిలో నువ్వానేనా అన్నట్లు అంతా తలపడుతున్నారు.

అభ్యర్థుల బలం కన్నా పార్టీల బలాలే కీలకం

ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి గెలిచారు. మరోసారి వైసిపి నుంచి ప్రస్తుత ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి ఆళ్ల నాని పోటీ చేస్తున్నారు. టిడిపి నుంచి మాజీ ఎంఎల్‌ఎ బడేటి బుజ్జి సోదరుడు చంటి ఇక్కడ పోటీ చేస్తున్నారు. పార్టీబలంతోపాటు కుటుంబపరంగా సొంత బలం ఉన్న వ్యక్తి. దెందులూరులో 2019లో వైసిపి అభ్యర్ధి గెలుపొందారు. ప్రస్తుత ఎంఎల్‌ఎ కొఠారు అబ్బాయిచౌదరి మరోసారి పోటీ చేస్తున్నారు. టిడిపి నుంచి మాజీ ఎంఎల్‌ఎ చింతమనేని ప్రభాకర్‌ పోటీచేస్తున్నారు. గతంలో ఈయన ఇదే నియోజకవర్గంలో రెండుసార్లు ఎంఎల్‌ఎగా పని చేశారు. ఉంగుటూరులో గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైసిపి అభ్యర్ధి గెలుపొందారు. ప్రస్తుత ఎంఎల్‌ఎ పుప్పాల వాసుబాబు మరోసారి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. పార్టీబలంపైనే ఎక్కువగా ఆధార పడాల్సిన పరిస్థితి ఉంది. పొత్తులో భాగంగా ఈస్థానం జనసేనకు కేటాయించారు. జనసేన అభ్యర్థిగా పత్సమట్ల ధర్మరాజు పోటీ చేస్తున్నారు. రాజకీయాల్లో కొత్తగా ప్రవేశించిన వ్యక్తి. ఆర్థిక బలంతోపాటు జనసేనకు బలమైన ఓటుబ్యాంకుగా ఉన్న ఒక సామాజిక తరగతి ఇక్కడ ఎక్కువగా ఉండటం కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. ఎస్‌సి రిజర్వ్‌డ్‌గా ఉన్న చింతలపూడిలో గత ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా రవాణాశాఖ అధికారిగా పనిచేసిన కంభంపాటి విజయరాజు పోటీ చేస్తున్నారు. పార్టీబలంపైనే ఆధాపడటం తప్ప సొంత బలం పెద్దగా లేదు. టిడిపి నుంచి ఎన్‌ఆర్‌ఐ సొంగా రోషన్‌కుమార్‌ పోటీ చేస్తున్నారు. ఈయన పార్టీబలంపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఎక్కువగా ఉంది. కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రస్తుత వైసిపి ఎంఎల్‌ఎగా ఉన్న ఎలిజా పోటీ చేస్తున్నారు. ఇటీవలే ఆయన కాంగ్రెస్‌లో చేరి టిక్కెట్‌ దక్కించుకున్నారు. ఎస్‌టి నియోజకవర్గంగా ఉన్న పోలవరంలో గత ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధి గెలుపొందారు. ఈసారి ఎన్నికల్లో వైసిపి నుంచి ప్రస్తుత ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు భార్య తెల్లం రాజ్యలక్ష్మి పోటీచేస్తున్నారు. సొంత బలంతోపాటు, పార్టీ బలం ఇక్కడ ఉంది. పొత్తులో భాగంగా ఈస్థానం జనసేనకు కేటాయించారు. జనసేన అభ్యర్ధిగా చిర్రిబాలరాజు పోటీచేస్తున్నారు. 2019లోనూ జనసేన నుంచి పోటీచేసి ఓటమిచెందారు.

సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసంతృప్తి

కైకలూరు నియోజకవర్గంనుంచి గత ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధి గెలుపొందారు. ఈసారి ఎన్నికల్లో ప్రస్తుత ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావు మరోసారి పోటీలో ఉన్నారు. అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. పొత్తులో భాగంగా ఈ స్థానం బిజెపికి కేటాయించారు. మాజీ ఎంఎల్‌ఎ కామినేని శ్రీనివాస్‌ ఇక్కడ నుంచి బిజెపి అభ్యర్ధిగా పోటీచేస్తున్నారు. గతంలో బిజెపి ఎంఎల్‌ఎగా, మంత్రిగా పని చేశారు. కాంగ్రెస్‌ నుంచి బడ్డు నోబుల్‌ పోటీ చేస్తున్నారు. నూజివీడులో గత ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధి గెలుపొందారు. ఈసారి ఎన్నికల్లో ప్రస్తుత ఎంఎల్‌ఎగా ఉన్న మేకా వెంకటప్రతాప్‌ అప్పారావు మరోసారి పోటీ చేస్తున్నారు. అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. టిడిపి అభ్యర్ధిగా వైసిపి నుంచి ఇటీవలే టిడిపిలో చేరిన పెనమలూరు ఎంఎల్‌ఎ కొలుసు పార్థసారధి పోటీచేస్తున్నారు. సామాజిక తరగతి బలంగా ఉండటం ఈయనకు కలిసొచ్చే అంశంగా అంచనా వేస్తున్నారు. టిడిపి నుంచి టిక్కెట్‌ ఆశించి భంగపడిన మాజీ ఎంఎల్‌ఎ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు రెబల్‌గా పోటీ చేస్తానని చెప్పడం టిడిపికి ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంది.

లోక్‌సభలో సోషల్‌ ఇంజనీరింగ్‌పై ఆశలు

గత ఎన్నికల్లో ఏలూరు ఎంపీగా వైసిపి అభ్యర్ధి గెలుపొందారు. ఈ సారి ఎన్నికలో వైసిపి నుంచి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్‌కుమార్‌ యాదవ్‌ పోటీ చేస్తున్నారు. సొంతబలం ఏమీలేదు. పార్టీబలంతోనే ముందుకు సాగుతున్నారు. టిడిపి అభ్యర్ధిగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేష్‌యాదవ్‌ పోటీచేస్తున్నారు. ఇయనకు వ్యక్తిగత బలం లేదు. పార్టీబలంపైనే ఆధాపడాల్సిన పరిస్థితి. ఈపార్లమెంట్‌ స్థానంలో ఒక సామాజిక తరగతి ఓట్లు ఎక్కువగా ఉండటంతో రెండుపార్టీలు అదే సామాజిక తరగతికి చెందిన అభ్యర్ధులకు టిక్కెట్‌ కేటాయించారు.