టీడీపీ ఏపీ మాజీ అధ్యక్షుడికి టిక్కెట్ గండం – కళా వెంకట్రావుకు ఈ సారి హ్యాండిస్తారా ?

టీడీపీలో సీనియర్లకు ఈ సారి గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కళా వెంకట్రావు వంటి నేతలకు సమస్యలు ఎదురవుతున్నాయి ఉత్తరాంధ్రలో కిమిడి కళా వెంకట్రావు సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు. 2024 ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే దీనికి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మోకాలు అడ్డుతున్నారు. అటు హై కమాండ్ సైతం ఎచ్చెర్లలో కొత్తవారిని బరిలో దించాలని ఆలోచిస్తోంది.

ఓ సారి ప్రజారాజ్యంలో చేరి… మళ్లీ టీడీపీలోకి వచ్చిన కళా

2009 నుంచి ఎచ్చెర్ల నుంచి కళా వెంకట్రావు బరిలో దిగుతున్నారు. ఇందులో 2014లో మాత్రమే ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009 ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. 2014లో టిడిపి అభ్యర్థిగా బరిలో దిగి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. టిడిపి రాష్ట్ర పగ్గాలతో పాటు మంత్రి పదవిని సైతం చేపట్టారు. 2019 ఎన్నికల్లో మాత్రం వైసిపి అభ్యర్థి గొర్లె కిరణ్ కుమార్ చేతిలో ఓడిపోయారు. 2024లో తనకు కానీ.. తన కుమారుడు కానీ టికెట్ ఇవ్వాలని హై కమాండ్ ను కోరుతున్నారు. కానీ హై కమాండ్ మాత్రం కొత్త అభ్యర్థి వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

ఎంపీగా చాన్సిస్తారా ?

కళా వెంకట్రావును విజయనగరం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించే యోచనలో చంద్రబాబు ఉన్నారు. వైసిపి సిట్టింగ్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ను మరోసారి బరిలో దింపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. విజయనగరం పార్లమెంటరీ పరిధిలో తూర్పు కాపులు అధికం. సామాజిక సమీకరణల దృష్ట్యా కళా వెంకట్రావు అయితేనే సరైన అభ్యర్థి అవుతారని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో కళా వెంకట్రావు ఒక షరతు పెడుతున్నట్లు తెలుస్తోంది. తనకు ఎంపీ సీటు తో పాటు కుమారుడు రాం మల్లిక్ నాయుడుకు ఎచ్చెర్ల అసెంబ్లీ సీటు కేటాయించాలని కోరుతున్నారు. కానీ బొత్సపైనా కిమిడి కుటుంబానికి చెందిన నాగార్జునకే టిక్కెట్ ఇస్తున్నందున… చాన్సిచ్చే అవకాశం లేదంటున్నారు.

ఎచ్చెర్ల నుంచి కలిశెట్టి అప్పల్నాయుడుకి టిక్కెట్

ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానం సీటును కలిశెట్టి అప్పలనాయుడు అనే సీనియర్ నాయకుడు ఆశిస్తున్నారు. ఆయన అచ్చెన్నాయుడు వర్గంగా కొనసాగుతున్నారు. గత కొంతకాలంగా నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఇవే నాకు చివరి ఎన్నికలు అంటూ కళా వెంకట్రావు సెంటిమెంట్ అస్త్రాన్ని సంధిస్తున్నారు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో జైలు నుంచి వచ్చిన తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.