కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడు వారాలే ఉన్న నేపథ్యంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికార బీజేపీ నుంచి కొందరు నేతలు నిష్క్రమించినప్పటికీ ఆ పార్టీకి పెద్ద దెబ్బ తగిలిందని చెప్పలేం. కేడర్ బేస్ట్ పార్టీగా ఉన్న బీజేపీ ఈ సారి కూడా సత్తా చాటుతుందంటున్నారు. కాకపోతే ఎన్ని సీట్లు వస్తాయో చెప్పడం కష్టమేనని ఎన్నికల విశ్లేషకులు వాదిస్తున్నారు..
హంగ్ ఖాయమా…
ఈ సారి కూడా హంగ్ ఖాయమని తాజా సర్వేలు తేల్చాయి. రెండు నెలల క్రితం కాంగ్రెస్ కు స్వల్ప మెజార్టీ ఇచ్చిన సర్వేలు ఇప్పుడు మాత్రం టఫ్ ఫైట్ అని చెబుతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీతో పాటు జేడీఎస్ మధ్య ముక్కోణ పోరు ఉంది. ఉప ప్రాంతీయ పార్టీగా ఉన్న జేడీఎస్ దక్షిణ కర్ణాటకలోని ఒక్కళిగ ఓటర్లపైనే నమ్మకం పెట్టుకుంది. గత వారం నిర్వహించిన సర్వేల సగటు చూస్తే 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీలకు అటు ఇటుగా చెరి 95 నుంచి 100 స్థానాలు రావచ్చు. జేడీఎస్ 25 నుంచి 35 స్థానాలకు చేరుకుంటోంది. అంటే ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాదనే చెప్పాలి.
మిషన్ 123
ఎన్నికల్లో కనీసం 123 స్థానాలు సాధించి సొంత బలంపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జేడీఎస్ అంటోంది.కన్నడ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడే ఏకైక పార్టీ తమదేనని అంటూ ఈ సారి విజయం తథ్యమని చెప్పుకుంటోంది. నిజానికి 2002 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి 58 స్థానాలు వచ్చాయి. అదే అత్యధిక కౌంట్. గత ఎన్నికల్లో ఆ పార్టీ 37 స్థానాలతో సరిపెట్టుకుంది. జేడీఎస్ కు కుటుంబ పార్టీ అన్న పేరు ఉంది. మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన ఇద్దరు కుమారులు, కోడళ్లు…వారి పిల్లలు ఏదోక పదవిని పట్టుకుని వేలాడుతుంటారు.
జేడీఎస్ ను చేర్చుకోవాల్సిందే…
హంగ్ అసెంబ్లీ ఏర్పడిన పక్షంలో కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ కీలక భూమిక పోషించే అవకాశం ఉంది. ఆ పార్టీ మద్దతు తీసుకుంటేనే ప్రభుత్వం ఏర్పాటవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అవసరాన్ని బట్టి కుమారస్వామి కింగ్ మేకరా, కింగా అన్న సంగతి తెలుస్తుంది. పైగా గత అనుభవాలు కూడా కుమారస్వామి తీరుపై అనుమానాలకు తావిస్తున్నాయి. అతి తక్కువ సీట్లు ఉన్నప్పటికీ ఇతరుల ఇబ్బందులను ఆసరాగా తీసుకుని ఆయన ముఖ్యమంత్రి అవుతుంటారు. ఒకసారి బీజేపీతో మరో సారి కాంగ్రెస్ తో కలుస్తుంటారు. గత ఎన్నికల్లోనూ బీజేపీని అధికారానికి దూరంగా ఉంచాలనుకున్న కాంగ్రెస్ .. కుమారస్వామిని సీఎంను చేసింది. తర్వాత అనివార్య కారణాలతో రాజీనామా చేయాల్సి వచ్చిందనుకోండి..
ఈసారి కాలం కలిసిరాకపోవచ్చు…
జేడీఎస్ కు ప్రతిసారీ పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. పైగా ఆ పార్టీ పట్ల జనంలో క్రమంగా మద్దతు తగ్గుతోంది. ఒక్కళిక సామాజిక వర్గం కూడా దూరం జరుగుతున్నట్లుగా భావిస్తున్నారు ఓల్డ్ మైసూరు దాటి జేడీఎస్ ప్రాబల్యం విస్తరించడం లేదు. దేవెగౌడకు వయసైపోయింది. పిల్లలకు అంత ఛరిస్మా లేదు. దానితో ఇప్పుడు సీఎం సీటుపై కుమారస్వామి గతంలో లాగ కన్నేసే అవకాశాలు తక్కువగానే ఉంటాయి. కాకపోతే ఆ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్నదే పెద్ద ప్రశ్న. అదీ పోలింగ్ సరళి, ఓటింగ్ శాతాన్ని బట్టి ఉంటుందని చెప్పుకోవాల్సి వస్తుంది. 25 స్థానాలు దాటకపోతే మాత్రం కుమారస్వామి కింగ్ కాదు.. కింగ్ మేకర్ మాత్రమే అనుకోవాలి. 35 స్థానాలు దాటితే రాజకీయం రంజుగా ఉంటుంది..