కాంగ్రెస్ కు ప్రతిపక్ష నాయకుడి హోదా దక్కేనా ?

ఇండియా గ్రూపు ఏర్పాటు చేసి అధికార ఎన్డీయేకు సవాళ్లు విసురుతున్న కాంగ్రెస్ పార్టీకి నిజంగా అంత సీన్ ఉందా. లోక్ సభ ఎన్నికలు నెలరోజుల్లో జరుగుతున్న వేళ.. అసలా పార్టీకి కనీస స్థానాలైనా వస్తాయా… ప్రధాన ప్రతిపక్ష హోదాతో పాటు ప్రతిపక్ష నాయకుడి స్థానంలో కాంగ్రెస్ పక్ష నేత కూర్చోవాలంటే కనీసం 54 స్థానాలు రావాల్సిన అనివార్యత ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ఏ మేరకు బలం పుంజుకుంది. పార్టీకి 125 స్థానాల వరకు ఖాయమని ఆ పార్టీ శ్రేయోభిలాషులు వాదిస్తున్నప్పటికీ గత మూడు ఎన్నికలు ఇస్తున్న సందేశం అందుకు భిన్నంగా ఉంది.

2019లో జరిగిందేమిటి..?

గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 261 స్థానాల్లో పోటీ చేసింది. 52 చోట్ల మాత్రమే గెలిచింది. 209 నియోజకవర్గాల్లో రెండో స్థానంతో సరిపెట్టుకుంది. కేరళ, తమిళనాడు, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో పొత్తు భాగస్వాముల చలవతోనే కాంగ్రెస్ కొన్ని స్థానాలు గెలుచుకోగలిగింది. గెలిచిన వాటిల్లో 51 స్థానాలు వరుసగా రెండుమూడు సార్లు విజయం సాధించినవే. అందులో 24 దక్షిణాది రాష్ట్రాల్లో ఉంటే, 13 తూర్పున, 12 ఉత్తరాన, ఒకటి మాత్రమే పడమట ఉన్నాయి. 183 స్థానాలను పరిశీలిస్తే గత మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సారి మాత్రమే విజయం సాధించింది.అక్కడ పార్టీ చాలా బలహీనంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి…గత మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ అసలు గెలవని స్థానాలు 309 ఉన్నాయి. అందులో 67 శాతం కాంగ్రెస్ కు బలహీన నియోజకవర్గాలుగా నిగ్గు తేల్చారు….

126 నియోజకవర్గాల్లో పది శాతం లోపే..

కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. 19 నియోజకవర్గాల్లో ఆ పార్టీకి 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అక్కడ కూడా మిత్రపక్షాల ఓట్లు కలిసొచ్చాయి. 76 నియోజకవర్గాల్లో 40 నుంచి 50 శాతం ఓట్లు రాగా, అందులో కొన్ని చోట్ల స్వల్ప మార్జిన్ తో ఓడిపోయింది
. 113 నియోజకవర్గాల్లో ఆ పార్టీ 30 నుంచి 40 శాతం ఓట్లు పొందింది. ఇక 126 లోక్ సభా నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఓట్ షేర్ పది శాతం లోపే ఉందని చెప్పక తప్పదు. గుజరాత్, గోవా, హరియాణా.. ఈ సారి ఉత్తర ప్రదేశ్లో ఆ పార్టీ పొత్తులు నామమాత్రంగా మిగిలిపోతున్నాయి. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ ఆ పార్టీని వెళ్లగొట్టగా, మహారాష్ట్రపై మాత్రం ఆ పార్టీకి ఈ సారి భారీ ఆశలున్నాయి.

బీజేపీతో డైరెక్ట్ ఫైట్ కష్టమే…

2019లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య 190 నియోజకవర్గాల్లో డైరెక్ట్ పైట్ జరిగింది. 175 చోట్ల బీజేపీ గెలిచింది. 15 నియోజకవర్గాల్లో మాత్రం కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ 190 స్థానాల్లో బీజేపీకి సగటున 56 శాతం ఓట్లు వస్తే, కాంగ్రెస్ 35 శాతంతో సరిపెట్టుకుంది. పైగా 135 చోట్ల బీజేపీకి 50 శాతం కంటే ఎక్కువ ఓట్ షేర్ సాధ్యమైంది. గత ఎన్నికల ట్రెండ్ తో పాటు తాజా సర్వేలను పరిశీలిస్తే గత ఎన్నికల కంటే బీజేపీ ఇప్పుడు మరికాస్త పుంజుకునే అవకాశం ఉంది. అప్పుడు కాంగ్రెస్ కు వంద సీట్లు రావడం దేవుడెరుగు..కనీసం యాభై కూడా కష్టమేనని తేలిపోయింది. అదే జరిగితే కాంగ్రెస్ కు వరుసగా మూడో సారి ప్రతిపక్ష హోదా దక్కని పరిస్థితి ఉంటుంది…