ఈ పూలు కిందపడితేనే దేవుడికి సమర్పిస్తారు ఎందుకు!

సాధారణంగా దేవుడికి చెట్టునుంచి ఏరిన పూలను సమర్పిస్తారు. కిందపడిన పూలను అస్సలు పూజకు వినియోగించరు. కానీ పారిజాత పుష్పం మాత్రం కిందపడినవి మాత్రేమే ఏరి దేవుడికి సమర్పిస్తారు. చెట్టునుంచి అస్సలు నేరుగా కోయరు, కోయకూడదు కూడా. దీనివెనుక కారణం కూడా చెబుతారు పండితులు..

అమృతం కోసం దేవతలు-రాక్షసులు క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు ఉద్భవించిన పారిజాత వృక్షాన్ని శ్రీ మహావిష్ణువు స్వర్గానికి తీసుకెళ్లాడు. ఈ పూల పరిమళం స్వర్గలోకం మొత్త విరజిమ్మేదట. ద్వాపర యుగంలో సత్యభామ కోరిక మేరకు ఈ వృక్షాన్ని కృష్ణుడు భూలోకానికి తీసుకొచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. స్వర్గం నుంచి తీసుకురావడం వల్ల పారిజాత వృక్షాన్ని దేవతా వృక్షం అంటారు. అయితే పారిజాత పూలు అనగానే ఎర్రటి కాడ..తెల్లటి పూలు మాత్రమే తెలుసుకానీ ఇందులో తొమ్మిది రంగుల పూలుంటాయి. వీటని చెట్టునుంచి కోయకూడదు, ఎవ్వరి దగ్గరా తీసుకోకూడదు. నేలరాలిన పూలు మాత్రమే దేవుడికి సమర్పించాలి

నేలరాలిన పూలే ఎందుకు
సాధారణంగా దేవుడికి పూజ చేసే పూలు నేలరాలినవి తీసుకోం. చెట్టునుంచి కోసుకున్నపూలనే తీసుకొచ్చి భగవంతుడికి నివేదిస్తాం. ఎందుకంటే పూల మొక్కలన్నీ భూమ్మీద పుట్టినవే కానీ పారిజాత చెట్టు మాత్రం స్వర్గం నుంచి తీసుకొచ్చాడు శ్రీకృష్ణుడు. అందుకే ఈ దేవతా వృక్షం నుంచి పూలు కిందకు పడినప్పుడే అవి భూమికి సొంతమవుతాయట. చెట్టున ఉన్నంతసేపూ అవి దేవలోకంలో ఉన్నట్టే అని..అందుకే అవి నేలరాలిన తర్వాతే ఏరుకోవాలని చెబుతారు పండితులు. దేవేంద్రుడి శాపం కారణంగా ఈ పూలు రాత్రివేళలో మాత్రమే వికసిస్తాయి. ఉదయానికి రాలిపోయి చెట్టు కింద తెల్లని తివాచీ పరచినట్లుగా పడతాయి. కిందపడ్డ పూలనే జాగ్రత్తగా ఏరి దేవుడి సేవలో వినియోగిస్తారు. చాలా మంది ఈ చెట్లను దేవాలయాల్లోనే పెట్టాలి అంటార కానీ అదేం లేదు ఇళ్లలో పెంచుకోవచ్చంటున్నారు వాస్తు నిపుణులు. పారిజాతం వృక్షం ఉన్న ఇంట్లో సిరుల వర్షం కురుస్తుందని చెబుతారు.

గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.