కోయంబత్తూరు నుంచే అన్నామలై ఎందుకు..?

దక్షిణాదిలో బీజేపీ అభ్యర్థుల పేర్లు కూడా ఒకటొకటిగా ప్రకటిస్తున్నారు. తమిళనాడులో పోటీపై ఆసక్తి నెలకొన్న తరుణంలో కీలక నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు. ఇంతకాలం తెలంగాణ గవర్నర్ గా పనిచేసిన తమిళిసై సౌందరరాజన్ తమ పదవికి రాజీనామా చేసి మళ్లీ రాజకీయాల్లోకి వచ్చారు. దానితో ఆమెకు దక్షిణ చెన్నై నియోజకవర్గాన్ని కేటాయించారు. అంతకంటే ముఖ్యమైన ఘటన మరోటి ఉంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఈ ఎన్నికల్లో కోయంబత్తూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. అందుకు చాలా కారణాలే ఉన్నాయి..

దుకుడున్న నాయకుడాయన…

అన్నామలై మాజీ ఐపీఎస్ అధికారి. 2019లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఆయన 2020లో బీజేపీలో చేరారు. మూడు సంవత్సరాల క్రితం ఆయన్ను తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టినప్పుడు ఆయన వయసు 37 సంవత్సరాలు. అప్పటి నుంచి దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. డీఎంకేను విమర్శిస్తూ ప్రతీ అంశంలో ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తప్పుచేస్తే ఎవరినీ వదిలేది లేదన్నట్లుగా ఆయన తీరు ఉంటుంది. సనాతన ధర్మంపై సీఎం స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ పై అన్నామలై నిర్వహించిన నిరసనలు కూడా హైలైట్ అనే చెప్పాలి. మోదీకి అత్యంత భక్తుడైన అన్నామలై కారణంగా మిత్రపక్షం అన్నాడీఎంకే దూరమైనప్పటికీ ఢిల్లీ పెద్దలు నొచ్చుకోలేదు. పీఎంకేతో ఎన్నికల పొత్తుపై అన్నామలై కీలక భూమిక పోషించారు.కొంతకాలం క్రితం పాదయాత్రతో జనంలోకి వెళ్లారు…

కోయంబత్తూరులో బీజేపీకి అనుబంధం

బీజేపీకి కోయంబత్తురుతో మంచి అనుబంధమే ఉంది. 1996లో అక్కడ బీజేపీ ఎంపీ ఉన్నారు. ప్రస్తుత తెలంగాణ ఇంఛార్జ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆ నియోజకవర్గానికి తొలి బీజేపీ ఎంపీ. అప్పట్లో జ్ఞానపతి రాజ్ కుమార్.. కోయంబత్తూరు బీజేపీ మేయర్ గా ఉండేవారు. 1998లో బీజేపీ అగ్రనేత, అప్పటి ఉప ప్రధాని ఎల్కే అద్వానీ కోయంబత్తూరు ప్రచారానికి వచ్చినప్పుడు ఆయన్ను హతమార్చేందుకు జరిగిన కుట్ర కోయంబత్తూరు చరిత్రలో చెరిపేయలేని మచ్చగా చెప్పాలి. అప్పుడు జరిగిన వరుస పేలుళ్లలో 58 మంది పౌరులు చనిపోగా.. 200 మంది వరకు క్షతగాత్రులయ్యారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు నిరసనగా అల్ ఉమ్రా అనే ఉగ్రవాద సంస్థ ఈ పేలుళ్లకు కుట్ర పన్నింది.

అక్కడ ఉత్తరాది డామినేషన్….

కోయంబత్తూరు లోక్ సభా నియోజకవర్గంలో ఉత్తరాది జనం ఎక్కువగా ఉంటారు. రాజస్థాన్, గుజరాత్ వ్యాపారులు అక్కడ సెటిలయ్యారు. వారంతా బీజేపీ వైపు మొగ్గు చూపుతారన్న విశ్వాసంతోనే అన్నామలై పోటీ చేస్తున్నారు. పైగా కోయంబత్తూరు నియోజకవర్గంలో అన్నాడీఎంకే, డీఎంకేకు సంప్రదాయంగా చెందని 40 శాతం ఓట్లున్నాయి. వాటిని సొంతం చేసుకుంటే విజయం సునాయాసమేనన్నది బీజేపీ ఆలోచన….