జనసేనకు గాజు గ్లాసు గుర్తు ఇండిపెండెట్లు కేటాయించడం ఇబ్బందికరంగా మారింది. ఈ గుర్తును కామన్ సింబల్‌గా ఎన్నికల కమిషన్ పరిగణిస్తుండటంతో తమ ఓటు బ్యాంక్‌కు గండి పడుతుందనే ఆందోళన కూటమిలో స్పష్టంగా కనబడుతోంది. జనసేన పోటీలో లేని స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్ధులకు సైతం గాజు గ్లాస్ గుర్తును ఇసి కేటాయించింది.
కొన్ని చోట్ల పోటీ చేస్తున్న జనసేన – అన్ని చోట్ల గ్లాస్ గుర్తు
ఎన్‌డిఎ కూటమి పొత్తులో భాగంగా జనసేన రాష్ట్ర వ్యాప్తంగా 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్ధానాల్లో పోటీ చేస్తోంది. దీంతో మిగిలిన స్ధానాల్లో జనసేన స్ధానంలో మిత్రపక్షాలైన టిడిపి, బిజెపి అభ్యర్దులు పోటీలో ఉండనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక స్ధానాల్లో గాజు గ్లాస్ గుర్తును ఇతరులకు కేటాయించడంతో ఎదురుదెబ్బ తగులుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అసలే రెబల్ అభ్యర్ధులను ఒక వైపు బుజ్జగిస్తూ మరొక వైపు వారిని పోటీలో లేకుండా సర్ధుబాటు చేసుకునే పనిలో తలలు పట్టుకున్న ఆయా పార్టీల నేతలకు ఈసి నిర్ణయం తలనొప్పిగా మారింది.
జనసేన అభ్యంతరాలను పరిష్కరిస్తామన్న ఈసీ
తమ పార్టీ సింబలైన గాజు గ్లాస్ గుర్తును ఇతరులకు కేటాయించవద్దంటూ మంగళవారం జనసేన పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఒక వైపే న్యాయపోరాటం చేస్తూనే మరొక వైపు గాజు గ్లాస్ గుర్తు పొందిన ఇండిపెండెంట్లను ప్రసన్నం చేసుకునే పనిలో కూటమి నేతలు ఉన్నారు. కీలకమైన నియోజకవర్గాల్లో ఇతరులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించడంతో జనసేన, టిడిపి శ్రేణులు ఎలా ఎదుర్కోవాలనే అంశంపై అంతర్మథనం సాగిస్తున్నాయి. ఈసీ నిర్ణయం సానుకూలంగా వస్తే ఇండిపెండెంట్లకు వేరే గుర్తులు కేటాయిస్తారు. లేపోతే గాజు గ్లాస్ కొనసాగుతుంది.
కీలకమైన నియోజకవర్గాల్లో గ్లాస్ గుర్తు
అనకాపల్లి, రాజమండ్రి, గుంటూరు, బాపట్ల, విజయవాడ, ఒంగోలు ఎంపి స్థానలోసిండిపెండెంట్లుకు గుర్తును కేటాయించారు. అదే విధంగా టిడిపి కీలకనేతలు పోటీలో ఉండే కుప్పం, మంగళగిరి, విజయనగరం, టెక్కలి, భీమిలితో పాటు పాటు జగ్గంపేటలో జనసేన రెబల్ అభ్యర్ధిగా పోటీలో ఉన్న పి.సూర్యచంద్రకు కూడా గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు. వీటితో పాటు రామచంద్రాపురం, మండపేట, రాజమండ్రి అర్భన్, పాలకొల్లు, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, మైలవరంతో పాటు పలు నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ గుర్తు రచ్చ రచ్చ చేస్తోంది. ఇది ఇలా ఉంటే టిడిపి సైతం తమ పార్టీ నుంచి రెబల్ అభ్యర్ధులుగా పోటీలో ఉన్న పలువురుని ఇప్పటికే సస్పెన్షన్ చేసిన సంగతి తెలిసిందే. ఏది ఏ మైనప్పటికీ జనసేన పార్టీ గుర్తును ఇతర పార్టీలకు కేటాయించడం తమ ఓటు బ్యాంక్‌కు ఎంతో కొంత నష్టం వాటిల్లడంతో పాటు వైసిపికి లాభం చేకూరే అవకాశం ఉంది.