కడప లోక్‌సభలో షర్మిల ప్రభావం ఎంత ? కాంగ్రెస్ కోలుకుంటుందా ?

కడప పార్లమెంటు ఎన్నిక ఆసక్తి రేపుతోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ తరపున, వైఎస్‌ కుటుంబ సభ్యుల్లో మరొకరైన వైఎస్‌ అవినాష్‌రెడ్డి వైసిపి తరపున ప్రత్యర్థులుగా బరిలో నిలవడంపై అందరి దృష్టీ నిలిచింది. ప్రతిపక్ష టిడిపి తరపున చదిపిరాళ్ల భూపేష్‌ సుబ్బరామిరెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కడప పార్లమెంటు ఎన్నిక కాంగ్రెస్‌, వైసిపి, టిడిపి మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

వైఎస్ వివేకా హత్య కేసు ఎజెండాగా రాజకీయం

వివేకా హత్య కేసు అజెండాగా చేసుకుని ప్రచారం పతాకస్థాయిలో నడుస్తోంది. పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల, వైఎస్‌ వివేకా కుమార్తె సునీత న్యాయం చేయాలని కోరుతూ.. కొంగు జాపి ఓటర్లను అభ్యర్థిస్తున్న తీరు మహిళా ఓటర్లను గణనీయంగా ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది. కడప పార్లమెంటు పరిధిలో కడప, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, బద్వేల్‌ నియోజకవర్గాలు ఉన్నాయి. 16 లక్షల మంది ఓటర్లున్నారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల, వైసిపి తరపున వైఎస్‌ అవినాష్‌రెడ్డి, టిడిపి తరపున చదిపిరాళ్ల భూపేష్‌ సుబ్బరామిరెడ్డి బరిలో నిలిచారు. 2019 ఎన్నికల్లో వైఎస్‌ అవినాష్‌రెడ్డికి సుమారు మూడు లక్షల ఓట్ల మెజార్టీ లభించింది. ఈ ఎన్నికల్లో కడప పార్లమెంటు బరిలో వైఎస్‌ కుటుంబీకులు ఒకరిపై ఒకరు పోటీ చేస్తున్న నేపథ్యంలో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది.

కొంగుచాపి ఓట్లు అడుగుతున్న షర్మిల

వైఎస్‌ షర్మిల బస్సుయాత్ర పేరుతో ఏకైక అజెండాతోనే ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. ఇటీవల కడప, పులివెందుల పట్టణాల్లో సాగిన ప్రచారంలో ఐదేళ్ల కిందట తన సోదరి వైఎస్‌ సునీతకు తీవ్రమైన అన్యాయం జరిగిందని, సోదరుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి న్యాయం జరగనీయకుండా అడ్డుకుంటున్నారని, ప్రజా బ్యాలెట్‌ పోరులోనైనా న్యాయం చేయాలని కొంగు జాపి ఓటర్లను అభ్యర్థిస్తున్న అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
వైసిపి నాయకత్వం అప్రమత్తమైంది. పులివెందుల, లింగాల, సింహాద్రిపురం, తొండూరు, వేముల, వేంపల్లి, చక్రాయపేట మండలాల వారీ ఇన్‌ఛార్జులను నియమించుకుని ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు.

క్రాస్ ఓటింగ్ జరిగితే వైసీపీకి ఇబ్బందే

వైసిపి మద్దతుదారులుగా పేరు కలిగిన నాయకులు అంతగా ఆసక్తి చూపడం లేదనే వాదన వినిపిస్తోంది. వైసిపి ఐదేళ్ల పాలనలో తమకు గుర్తింపు, గౌరవం లభించలేదని కినుక వహించినట్లు తెలుస్తోంది. కడప, పులివెందుల, మైదుకూరు నియోజకవర్గాల్లోని వైఎస్‌ వివేకా సన్నిహితులను కలిసి మద్దతును అభ్యర్థిస్తున్నారు. కడప పార్లమెంటు పరిధిలోని పులివెందుల అసెంబ్లీ అభ్యర్థి వైఎస్‌ జగన్‌కు ఒక ఓటు, వైఎస్‌ షర్మిలకు మరొక ఓటు చొప్పున వేయాలనే ధోరణి కనిపిస్తోంది. కడప, మైదుకూరు, బద్వేల్‌, తదితర మిగిలిన నియోజకవర్గాల్లో వైఎస్‌ షర్మిలకు సెంటిమెంటు ఓట్లు పడే అవకాశలు ఉన్నాయనే విశ్లేషణ వినిపిస్తోంది.